-1983లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన మూలారెడ్డి
-ఆ తర్వాత 3 సార్లు అదే నియోజకవర్గం నుంచి గెలుపు
-2004, 2009 ఎన్నికల్లో ఓడిపోయిన నల్లమిల్లి
టీడీపీ సీనియర్ నేత, తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి (80) సోమవారం తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం మరణించారు. అనపర్తి నియోజకవర్గ పరిధిలోని తన స్వగ్రామం రామవరంలోనే ఉంటున్న మూలారెడ్డి ఆది నుంచి టీడీపీ నేతగానే కొనసాగారు.
అనపర్తి నియోజకవర్గం నుంచి ఏకంగా నాలుగు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ ఆవిర్భవించాక 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనపర్తి నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మూలారెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత 1985, 1994, 1999 ఎన్నికల్లోనూ ఆయన అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తదనంతరం 2004, 2009 ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థిగానే పోటీ చేసిన మూలారెడ్డి పరాజయం పాలయ్యారు. 2014 ఎన్నికల్లో మూలారెడ్డి బదులుగా ఆయన కుమారుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.