ఋషికొండ పై ఆరెకరాలలో నిర్మాణం అంటూ… 21 ఎకరాలలో నిర్మాణాలు

110

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు

ఋషికొండను పూర్తిగా గుండు కొట్టిసినట్లుగా చదును చేసి నాలుగు మిలియన్ల చదరపు అడుగులలో భవన నిర్మాణాలకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ప్రతిపాదనలను సిద్ధం చేసిందని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. చేతిలో దమ్మిడి కూడా లేని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ, ఇప్పటికే 2.8 మిలియన్ చదరపు అడుగులలో నిర్మాణాలను చేపడుతుందన్నారు. ఐదు లక్షల రూపాయల అభివృద్ధి పనులకు కూడా డబ్బులు అడగనివారే టెండర్లను దాఖలు చేయాలంటున్న రాష్ట్ర ప్రభుత్వం, వందల కోట్ల రూపాయలను వెచ్చించి 40 లక్షల చదరపు అడుగులలో భవన నిర్మాణాలను చేపట్టి ఏమి చేసుకుంటుందని ప్రశ్నించారు.

ఋషికొండపై ఆరెకరాలలో మాత్రమే నిర్మాణ పనులను చేపడుతున్నామని న్యాయస్థానానికి చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం, దాదాపు 21 ఎకరాలలో నిర్మాణ పనులను కొనసాగిస్తుందని తెలిపారు. సోమవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామ కృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ… ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక సంస్థ నిర్మిస్తున్న భవనాలు ఏవి కూడా అద్దెకు ఇచ్చే మాదిరిగా లేవన్నారు. సచివాలయ భవనాల మాదిరిగా ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం 2.8 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవన నిర్మాణాలు చేపడుతున్న ఏపీ టూరిజం శాఖ, 40 లక్షల చదరపు అడుగులలో భవన నిర్మాణ లను చేపట్టేందుకు ప్రతిపాదనలను చేసిందన్న రఘురామకృష్ణంరాజు, ఆ భవన నిర్మాణాలకు సంబంధించిన ప్లాన్ కాపీలను మీడియా ప్రతినిధుల ముందు ప్రదర్శించారు. నాలుగు మిలియన్ల చదరపు అడుగుల భవన నిర్మాణాలు అంటే, రాష్ట్రంలోని హోటల్స్ విస్తీర్ణం అంతా కూడా కలుపుకుంటే, అంత ఉండదని చెప్పారు. ఈ నాలుగు మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏపీ పర్యాటక శాఖ…ముఖ్యమంత్రి నివాసయోగ్యమైన భవనాలు, సెక్రటేరియట్ భవనాలు నిర్మించి, భవిష్యత్తులో ఈ భవనాలను రాష్ట్ర ప్రభుత్వానికి అద్దెకిస్తున్నామని చెబుతారన్నారు. ఇదంతా ఒక పథకం ప్రకారం చేస్తారని వెల్లడించారు.

ఋషికొండ పై ఉన్న చిట్టి , పొట్టి రిసార్ట్స్ లను కూల్చి, అదే స్థానంలో భవన నిర్మాణాలను చేపడుతున్నామని సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని, అదే స్థానంలో నిర్మాణాలను చేపట్టాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించిందని తెలిపారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చట్టం అంటే గౌరవం లేదని, న్యాయస్థానాలు అంటే లెక్కే లేదని పేర్కొన్నారు. అందుకే కోర్టులకు చెబుతున్నది ఒకటి, చేస్తున్నది మరొకటి అంటూ మండిపడ్డారు.

విశాఖకు రాజధాని తరలడం ఖాయమని టీటీడీ చైర్మన్ పేర్కొంటున్నారని, ఇక ఎ 2 అయితే రాజధాని తరలింపు ప్రక్రియను ఎవరు అడ్డుకోలేరని అంటున్నారని చెప్పారు. కోర్టులో కేసు ఉండగానే ఈ విపరీత వ్యాఖ్యలు ఏమిటని ప్రశ్నించిన రఘురామకృష్ణంరాజు, మిమ్మల్ని జైల్లో పెట్టింది న్యాయస్థానాలే కదా అని గుర్తు చేశారు. ఋషికొండ ప్రకృతి విధ్వంసం పై న్యాయస్థానంలో పోరాడుతున్న సీనియర్ న్యాయవాది కె ఎస్ మూర్తి, ఋషికొండను ఆదివారం సందర్శించారన్నారు. అయితే మీడియా సమక్షంలోనే ఋషికొండ సందర్శించిన సీనియర్ న్యాయవాది మూర్తి పై, జనసేన యువనేత మూర్తి యాదవ్ పై అక్రమ కేసును బనాయించారన్నారు. ఋషికొండను సందర్శించే సమయంలో వీరు, ఒకరిపై చేయి చేసుకున్నారన్న జూనియర్ ఇంజనీర్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఏ వన్ నిందితునిగా మూర్తి యాదవ్ పై, ఎ టూ నిందితునిగా సీనియర్ న్యాయవాది మూర్తిపై కేసు నమోదు చేశారని తెలిపారు. ఋషికొండను సందర్శించే సమయంలో వారి వెంట మీడియా ప్రతినిధులు పూర్తిగా ఉన్నారని, ఒకవేళ ఎవరిపైననైనా చేయి చేసుకుని ఉంటే, అందరికీ ఈపాటికే తెలిసి ఉండేది కదా? అని ప్రశ్నించారు. ఈరోజు తన తరపు న్యాయవాది పివిజి ఉమేష్ చంద్ర కూడా ఋషికొండను సందర్శించ నున్నారని, ఆయన్ని సందర్శించడానికి అనుమతిస్తారా? లేదా?? అన్నది చూడాలన్నారు. ఋషికొండపై కనివిని ఎరుగని రీతిలో ప్రకృతి విధ్వంసం జరిగిందని, జరుగుతోందని ఈ విషయాన్ని ఈనెల 5వ తేదీన కోర్టు దృష్టికి తీసుకు వెళ్తామని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

మేనిఫెస్టోలో చెప్పింది ఏమిటి ?… చేస్తున్నది ఏమిటి??
2019లో మేనిఫెస్టోలో చెప్పింది ఏమిటి?, ఇప్పుడు చేస్తున్నది ఏమిటని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రఘురామకృష్ణం రాజు సూటిగా ప్రశ్నించారు. తాము ఎన్నికల మేనిఫెస్టోలో మద్యనిషేధం చేస్తామని చెప్పలేదన్న రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను, తమ పార్టీ నాయకులు కూడా ఖండించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. మద్యనిషేధంతోపాటు, ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఇచ్చిన హామీలకు సంబంధించిన వీడియోను ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధుల ముందు ప్రదర్శించారు. మధ్య నిషేధాన్ని అమలు చేస్తున్న గుజరాత్ రాష్ట్రం అభివృద్ధిలో నెంబర్ వన్ గా ఉన్నదని, మద్యం లేకపోతే మనం రాష్ట్రాన్ని నడిపించలేమా ?అని గతంలో పేర్కొన్న జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు మధ్య నిషేధం అన్న పదాన్ని నిషేధించినట్లుగా ఆయన మంత్రివర్గ సహచరుడైన అమర్నాథ్ మాట్లాడుతున్న స్పందించకపోవడం ఏమిటని ఎద్దేవా చేశారు. గతంలో బ్రాందీరాజ్యం పోయి, గాంధీ రాజ్యం వచ్చిందన్న మరొక మంత్రి రోజా సెల్వమణి గతంలో అసెంబ్లీలో మాట్లాడిన వీడియోను ఈ సందర్భంగా రఘురామకృష్ణం రాజు ప్రదర్శించారు. ఇప్పుడు రాష్ట్రంలో మద్యనిషేధమే లేదని అంటున్నారని, దానితో… త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో ఆమె ఏమి మాట్లాడుతారో చూడాలంటూ అపహాస్యం చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ఓట్లే అడగమని జగన్మోహన్ రెడ్డి అన్నారని ఈ సందర్భంగా రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. అయితే తనకొచ్చిన ఇబ్బంది ఏమి లేదని ప్రస్తుతం తాను ఈ పార్టీలో ఉన్నప్పటికి, ఈ పార్టీ గుర్తుపై పోటీ చేయనని చెప్పారు. మా డబ్బులు కొట్టేసి, మాకు పథకాలను అమలు చేస్తున్నామని అంటున్నారేందని డోన్ లో ఒక మహిళ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిలదీసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, మహిళల్లో వచ్చిన చైతన్యం పురుషులలో రాకపోవడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు.. ఒక మధ్య నిషేధం పై మహిళలే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కోరారు.

టిడ్కో ఇల్లు ఏమయ్యాయి?
గత ప్రభుత్వ హయాంలో మూడు లక్షల టిడ్కో ఇల్లు దాదాపు 80 నుంచి 98 శాతం వరకు పూర్తయ్యాయని, ఆ ఇళ్ల మిగిలిన పనులు పూర్తి చేసి పేదలకు ఎందుకు అప్పగించలేదని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. టిడ్కో ఇండ్ల లబ్ధిదారులు ఎన్నాళ్ళని వాయిదాలు చెల్లించాలని ప్రశ్నించిన జగన్మోహన్ రెడ్డి, ఈ మూడేళ్లలో ఒక్క ఇంటి నిర్మాణాన్ని కూడా చేపట్టలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇండ్ల నిర్మాణమే చేయకుండా, పేదలకు ఇచ్చిన ఒక హామీని నెరవేర్చారని, అదేమిటంటే… ఇండ్ల వాయిదాల సొమ్ము చెల్లించవలసిన అవసరం లేకుండా చేశారని అపహాస్యం చేశారు. గత ప్రభుత్వ హయాంలో పెళ్లి చేసుకున్న బీసీ యువతులకు 30 వేల రూపాయలు ఇస్తే, తాను 50,000 రూపాయలు ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, ముస్లిం క్రిస్టియన్ మైనార్టీలకు లక్ష రూపాయల చొప్పున వైఎస్సార్ పెళ్లి కానుక కింద అందజేస్తానని అన్నారని గుర్తు చేశారు. అయితే, ఏ ఒక్కరికి కూడా డబ్బులు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తానని చెప్పి, రద్దు చేసింది లేదన్న ఆయన, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తానని చెప్పి ఉన్న ఉపాధ్యాయ పోస్టులను ఎత్తివేసే ప్రయత్నాన్ని చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఇక ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్, డీఎస్సీ నిర్వహిస్తానని చెప్పి, జాబ్ క్యాలెండర్ ఇచ్చింది లేదని, డీఎస్సీ నిర్వహించింది లేదని విమర్శించారు.

బెయిల్ పిటిషన్ తిరస్కరణ…
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న నలుగురి బెయిల్ పిటిషన్ కోర్టు తిరస్కరించిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. తమ బాబాయి హత్య కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో, తమ ముఖ్యమంత్రి ఆనందంగా ఉంటారని, ఆయన ఆనందమే మా ఆనందమంటూ రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు.