Suryaa.co.in

Editorial

ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్ టెక్నాలజీలో టీడీపీ

– ఐటిడిపి రూపొందించిన కృత్రిమ యాంకర్
– లోకేష్ పాదయాత్ర వార్తలు చదివిన ఏఐ యాంకర్
– తొలి ఏఐని వినియోగించిన రాజకీయపార్టీగా టీడీపీ
– ఇప్పటికే ‘స్వతంత్ర’ చానెల్ ప్రయోగం
– ఏఐ న్యూస్‌రీడర్‌తో వార్తలు చదివించిన తొలి తెలుగు చానెల్
( మార్తి సుబ్రహ్మణ్యం)

సాంకేతికతను వాడుకునే రాజకీయ పార్టీల్లో టీడీపీ ఎప్పుడూ ముందుంటుంది. ఢిల్లీలో బీజేపీ నూతన భవనం నిర్మించకముందువరకూ.. దేశంలోనే అతి పెద్ద లైబ్రరి, డిజిటల్ లైబ్రరీ ఉన్న పార్టీగా, టీడీపీ చరిత్ర సృష్టించింది. వేలకొద్దీ పుస్తకాలు, లక్షల్లో డిజిటల్ పేపర్లు, శాఖలవారీగా డేటా ఉండేలా, టీడీపీ ఆ లైబ్రరీని రూపొందించింది. ఇప్పటి వైసీపీ ఎమ్మెల్సీ, కేంద్రమాజీ మంత్రి డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు వంటి మేధావులు అక్కడే కొలువు తీరేవారు.

దేశంలోని ఏ శాఖకు ఎంత బడ్జెట్ కేటాయించారు? ఎన్ని విడుదల చేశారు? ఎంత ఖర్చు పెట్టారన్న డేటాను అప్‌లోడ్ చేసేందుకు, డజన్ల సంఖ్యలో ఉద్యోగులు ఉండేవారు. నయ్రస్‌చానెళ్లలో వచ్చే తాజా వార్తలను ఎప్పటికప్పుడు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, పార్టీ సీనియర్లకు పంపించేవారు. వార్తా పత్రికల్లో వచ్చే కథనాలు, వ్యాసాలు వేటికివాటిని విభజించి డిజిటలైజేషన్ చేశారు. వీరుకాకుండా బోలెడు మంది ఎనలిస్టులు సేవలందిస్తుంటారు.

పార్టీ సీనియర్లు నిర్వహించే విలేకరుల సమావేశాలకు ఆ మెటీరియల్ ఉపయోగపడేవి. ఇప్పుడు టీడీపీ నాలెడ్జ్ సెంటర్ అదే పనిచేస్తోంది. పార్టీ నేత మాల్యాది, అనిల్ సారథ్యంలో టీడీపీ డిజిటల్ లైబ్రరీ

సాంకేతికంగా బలంగా ఉంది. ఈ విభాగంతో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నిరంతరం భేటీ అయి, రాష్ట్రం-దేశంలో జరిగే పరిణామాలపై చర్చిస్తుండటం విశేషం. అనేకమంది సీనియర్ జర్నలిస్టులు తమ కథనాల కోసం, టీడీపీ లైబ్రరీపై ఆధారపడేవారంటే అతిశయోక్తి కాదు.

‘ఈనాడు’ పత్రికలో సుదీర్ఘకాలం పనిచేసిన దివంగత రమేష్‌బాబు టీడీపీ లైబ్రరీని సాంకేతికంగా మరింత ఆధునీకరించారు. ప్రముఖ జర్నలిస్టు పూల విక్రమ్ వంటి లబ్ధప్రతిష్ఠులైన విశ్లేషకులు సైతం ఈ లైబ్రరీకి సేవలందించినవారే.

అలాంటి టీడీపీ ఇప్పుడు తొలిసారిగా, ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్ టెక్నాలజీని దొరకబుచ్చుకుని జనంలోకి వచ్చింది. ఐటిడిపి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు దీనిని రూపొందించారు. దానితో పార్టీకి సంబంధించిన యువగళం సైట్‌లో.. ఈ ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్ టెక్నాలజీని ఉపయోగించి, ఒక యాంకర్‌ను సృష్టించారు.

ఆమె లోకేష్ పాదయాత్ర షెడ్యూల్‌ను తెలుగులో చదివే వీడియోను, ఐటిడిపి విభాగం విడుదల చేసింది. దీనికి అసంఖ్యాకమైన స్పందన వస్తోందని ఐటిడిపి నేతలు చెబుతున్నారు. అచ్చం వార్తలు చదివే న్యూస్‌రీడర్‌లా ఉన్న ఆ యాంకర్.. ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్ టెక్నాలజీతో తయారైన బొమ్మ అన్న విషయం, సాధారణంగా ఎవరూ గ్రహించే అవకాశం లేదు.

కాగా ఏడాది క్రితమే స్థాపించినప్పటికీ, తెలుగు టీవీ చానళ్ల రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్న స్వతంత్ర చానెల్.. ఈ ప్రయోగాన్ని గత రెండువారాల క్రితమే చేయడం విశేషం. ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్ టెక్నాలజీతో రూపొందించిన యాంకర్‌తో, వార్తలు చదివించడం ద్వారా.. తెలుగు టీవీ రంగంలో స్వతంత్ర సరికొత్త సాంకేతిక సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది.

LEAVE A RESPONSE