Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీతోనే బడుగులకు రాజ్యాధికారం

* ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఎన్టీఆర్
* టీడీపీలోనే కార్యకర్తలకు గౌరవం
* సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పర్యవేక్షణలో పార్టీ మరింత పటిష్టం
* తప్పుడు కేసుల నుంచి కార్యకర్తలకు త్వరలో విముక్తి
* మహానాడులోగా అన్ని పదవుల పంపకం పూర్తి
* పసుపు జెండా రెపరెపలే నా ధ్యేయం… నాకు గ్రూపుల్లేవ్
* బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
* పెనుకొండలో భారీ ఎత్తున ‘దేశం’ ఆవిర్భావ దినోత్సవం
* పట్టణంలో భారీ ర్యాలీ…రోగులకు పండ్లు, రొట్టెల పంపిణీ

పెనుకొండ : టీడీపీ వల్లే బడుగులకు రాజ్యాధికారం సాధ్యమైందని, సూర్య చంద్రులు ఉన్నంత వరకు ప్రజల గుండెల్లో అన్న ఎన్టీఆర్ జీవించే ఉంటారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. కష్టపడే ప్రతి కార్యకర్తకూ పార్టీ ప్రాధాన్యమిస్తోందన్నారు. దేశంలోనే తొలిసారి కార్యకర్తలకు జీవిత బీమా కల్పించిన పార్టీ కూడా టీడీపీయేనని స్పష్టంచేశారు. 43వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పెనుకొండలో మంత్రి సవిత నేతృత్వంలో శనివారం ఘనంగా నిర్వహించారు.

తొలుత పార్టీ కార్యాలయంలో పసుపు జెండాను మంత్రి ఆవిష్కరించి, ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి సవిత మాట్లాడారు. సూర్య చంద్రులు ఉన్నంత వరకూ అన్న ఎన్టీఆర్ జీవించే ఉంటారన్నారు. టీడీపీ స్థాపనతోనే బడుగు, బలహీన వర్గాలకు గుర్తింపు లభించిందన్నారు. అన్న ఎన్టీఆర్ ప్రోత్సాహంతో బడుగులు రాజ్యాధికారంలో భాగస్వామ్యయ్యారన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు టీడీపీని మరింత పటిష్ట పరిచారన్నారు. ఒకవైపు పార్టీ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ, అభివృద్ధిపథంలో దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టేలా నిరంతరం కృషి చేస్తున్నారన్నారు.

మంత్రి నారా లోకేశ్ కృషితో టీడీపీ కార్యకర్తలకు ప్రాధాన్యం లభిస్తోందన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన కార్యకర్తకు రూ.5 లక్షల జీవిత బీమా అందేలా మంత్రి నారా లోకేశ్ చర్యలు తీసుకున్నారన్నారు. పేద కార్యకర్తలు అనారోగ్యానికి గురైతే వారికి అండగా ఉంటున్నారన్నారు. కార్యకర్తల బిడ్డల చదువుకు, వివాహాలకు సైతం మంత్ర లోకేశ్ భరోసా ఇస్తున్నారన్నారు. కోటీ 2 లక్షల మంది కార్యకర్తలు సభ్యత్వ నమోదు చేసుకుని, దేశంలోనే అతిపెద్ద రాజకీయ కుటుంబంగా టీడీపీ ఆవిర్భవించిందన్నారు.

మహానాడులోగా పదవుల పంపకం
మే నెలాఖరులో జరిగే టీడీపీ మహానాడుకు కడప వేదికైందని మంత్రి సవిత వెల్లడించారు. మహానాడులో పార్టీ కమిటీలతో పాటు అనుబంధ కమిటీల పదవులను కూడా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. దీంతో ప్రతి బూత్ కు నలుగురు యువకులను నియమించనున్నట్లు తెలిపారు. వారికి ఉపాధి అవకాశాలు కూడా పార్టీయే చూసుకుంటుందన్నారు. నామినేటెడ్ పదవులు సైతం భర్తీ చేస్తున్నామన్నారు. పార్టీ కోసం కష్టపడిని కార్యకర్తలకే పదవుల్లో ప్రాధాన్యమిస్తున్నామన్నారు.

పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి…
ఎన్డీయే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులకు అందజేయాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని మంత్రి సవిత స్పష్టంచేశారు. దీపం పథకం-2కు సంబంధించి క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, వాటిని పరిష్కరించి, అర్హులకు పథకం ఫలాలు అందజేయాలని కార్యకర్తలకు మంత్రి సవిత సూచించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబునాయుడు అమలు చేస్తున్నారన్నారు. పెన్షన్లను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచారన్నారు. ఇసుకతో పాటు మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నామన్నారు. త్వరలో తల్లికి వందనం, రైతు భరోసా పథకాలను కూడా అమలు చేయబోతున్నామన్నారు. తల్లికి వందనం పథకం కింద ఇంటిలో ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఏడాదికి రూ.15 వేలు అందజేస్తామన్నారు.

గాలి కొచ్చిన పార్టీ గాల్లో కలిసిపోయింది…
ఒక్క ఛాన్సంటూ అధికారంలోకి వచ్చిన జగన్ అసమర్థ పాలనతో ప్రజలు విసిగిపోయి, సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఎన్డీయేకు పట్టం కట్టారని మంత్రి సవిత తెలిపారు. గాల్లో వచ్చిన పార్టీ గాల్లో కలిసిపోయిందని ఎద్దేవా చేశారు. జగన్ సమస్థ నిర్ణయాల కారణంగా రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఇరుక్కుపోయిందన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సీఎం చంద్రబాబునాయుడు సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే అభివృద్ధి కార్యక్రమాలను శ్రీకారం చుడుతున్నారన్నారు.

కేసుల నుంచి టీడీపీ క్యాడర్ కు విముక్తి
గత జగన్ ప్రభుత్వం తప్పుడు కేసులను అనేక మంది టీడీపీ నాయకులపై బనాయించిందని మంత్రి సవిత తెలిపారు. తప్పుడు కేసుల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలకు విముక్తి కల్పించడానికి సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయించారన్నారు. తప్పుడు కేసులు బనాయించబడిన వారు తమ పేర్లు ఇస్తే, సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళతానన్నారు. నీరు-చెట్టు బిల్లులు సైతం త్వరలో మంజూరు చేస్తామని మంత్రి సవిత కార్యకర్తలకు, నాయకులకు భరోసా ఇచ్చారు.

నాకు గ్రూపుల్లేవ్…
పెనుకొండ నియోజక వర్గంలో 85వేల మందికి పైగా టీడీపీ సభ్యత్వాలు నమోదయ్యాయని, రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి ఢోకా లేదని మంత్రి సవిత ధీమా వ్యక్తంచేశారు. పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్నట్లు వెల్లడించారు. ఏ సమస్య ఉన్నా తనను నేరుగా సంప్రదించొచ్చునన్నారు. తనకు గ్రూపుల్లేవని, పార్టీ అభివృద్ధే తన ధ్యేయమని మంత్రి సవిత స్పష్టంచేశారు.

పట్టణంలో భారీ ర్యాలీ..
అంతకుముందు టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి సవిత నేతృత్వంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ఎన్టీఆర్ సర్కిల్ వరకు సాగింది. అక్కడున్న ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి సవిత పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ నాయకులను, కార్యకర్తలను మంత్రి సవిత ఘనంగా సత్కరించారు. కేక్ కట్ చేసి, నాయకులకు, కార్యకర్తలకు తినిపించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యాకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

LEAVE A RESPONSE