– మహనీయులు పుట్టిన గడ్డలో గంజాయి మొక్కలు
– బూతులు మాట్లాడేవారికే జగన్ పదవులు
– పాలకులు అంటే సేవకులు అని ఎన్టీఆర్చా టిచెప్పారు
– గుడివాడ ‘రా..కదలిరా’ బహిరంగసభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు
“ఎన్టీఆర్ జయంతి సందర్భంగా గుడివాడ సభలో ఎటుచూసినా జనమే… జనం. నిన్నటివరకు బూతులు మాట్లాడిన వారు ప్రజాగ్రహంలో కొట్టుకుపోవడం ఖాయం.. భూస్థాపితం కావడం ఖాయం. తెలుగుదేశం-జనసేన నాయకులు, కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే.. తమకు ఎవరు ఎదురొచ్చినా తొక్కేస్తామనేలా ఉన్నారు. మనశక్తిని ఎవరూ ఆపలేరు.
తెలుగుదేశం-జనసేన గెలుపు అన్ స్టాపబుల్. రా..కదలిరా సభను గుడివాడలోనిర్వహించడాని కారణం.. దేశ రాజకీయాలను తిరగరాసిన నాయకుడు పుట్టిన ప్రాంతం కావడమే.ఆత్మగౌరవ నినాదంతో తెలుగువాడి సత్తాను, శక్తియుక్తుల్ని ప్రపంచానికి చాటిన వ్యక్తి ఎన్టీఆర్.
సంక్షేమ పథకాలకు ఆద్యుడు.. సుపరిపాలనకు బాటలు వేసిన మహానుభావుడు. నిమ్మకూరులో పుట్టి.. చిత్రసీమను, రాష్ట్రాన్ని ఏలిన .. కథానాయకుడు, మహానాయకుడు, యుగపురుషుడు ఎన్టీఆర్.తెలుగుదేశం అంటేనే తెలుగువారి పౌరుషం…ఆత్మగౌరవం.. సంక్షేమం.. సామాజిక న్యాయాల కలబోత. ఎదురొచ్చినవారిని.. ఎదిరించే వారిని తొక్కుకుంటూ ముందుకు సాగే సైన్యమున్న పార్టీ తెలుగుదేశంపార్టీ.
దేశానికి మహామహుల్ని అందించి, సాంస్కృతిక, సాహితీ, రాజకీయ, సినీ రంగాలకు వేదికగా నిలిచింది కృష్ణాతీరం.. కృష్ణా జిల్లా. ఈ ప్రాంతంలో ప్రతి ఊరికి ఒక ఘనచరిత్ర ఉంది. గొప్పగొప్ప వ్యక్తులు నడయాడిన ప్రాంతమిది. ప్రతి వ్యక్తికి కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి.రాజకీయ ఉద్ధండులైన భోగరాజు పట్టాభి సీతారామయ్య, గొట్టిపాటి బ్రహ్మయ్య, చండ్ర రాజేశ్వరరావు, కే.ఎల్.రావు, మండలి వెంకట కృష్ణారావు వంటి ఎందరో గొప్ప వ్యక్తులు పుట్టిన ప్రాంతం.
కృష్ణా పత్రిక వ్యవస్థాపకులు ముట్లూరి కృష్ణారావు, ఆంధ్రపత్రిక కాశీనాథుని నాగేశ్వరరావు, పత్రికా ప్రముఖులు నార్ల వెంకటేశ్వరరావు ఈ జిల్లావారే. అక్కినేని నాగేశ్వరరావు, ఘంటసాల, వేదాంతుల రాఘవయ్య, మల్లాది రామకృష్ణశాస్త్రి, వేటూరి సుందరరామ్మూర్తి ఇక్కడివారే. జ్ఞానపీఠ్ అవార్డ్ గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ ఈ గడ్డపైనే పుట్టారు. బ్రిటీష్ కాలంలో భారత క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించింది మన బందరు వాసి సీ.కే.నాయుడు.
సంఘ సంస్కర్త త్రిపురనేని రామస్వామి, జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, గోరా వంటి మహానీయులు ఈ గడ్డపైనే పుట్టారు. కూచిపూడి నాట్యం దేశానికే గర్వకారణం.. ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. ఈ చల్లని సాయంత్రం వేళ కృష్ణా తీరప్రాంతంలో పుట్టిన మహీనీయులు.. కళల్ని తలుచుకుంటే చెప్పలేనంత ఆనందం కలుగుతోంది.
ఎన్టీఆర్ గారు మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచింది ఈ గుడివాడ నుంచే, ఆయన రాజకీయ ప్రస్థానం ఇక్కడే మొదలైంది. ఎందరో మహామహులు పుట్టి, నడయాడిన తులసివనంలో ఇప్పుడు గంజాయి మొక్కలు పుట్టాయి. ఆ గంజాయి మొక్కల్ని ఏరివేయాలా..లేదా? అధికారమంటే బూతులు.. దోపిడీ.. కేసినోలు.. పేకాటలు.. కబ్జాలు. అదే వీళ్లకు తెలిసింది.
సంక్రాంతికి కూడా కేసినోలు .. జూదక్రీడలు నిర్వహించి మన డబ్బులు కొట్టేస్తున్నారు. అలాంటి వీళ్లను క్షమించాలా? తొందర్లోనే మీ అందరి కథ తేలుస్తాం. మీరు మంచి చేస్తే సహకరిస్తాం. కానీ మీరు చేసిన అరాచకాలు..రౌడీయిజం తలుచుకుంటే రక్తం మరిగిపోతోంది.
ఎన్టీఆర్ 8 సంవత్సరాలు.. నేను 15 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. 22 ఏళ్లలో మనం ఆలోచించి ఉంటే ఈ గంజాయి మొక్కలు పెరిగేవా?
సీఎం పదవికి జగన్ అనర్హుడు
ముఖ్యమంత్రి పదవికి అర్హతలేని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. బూతు శ్రీ అయిన వ్యక్తికి ఎమ్మెల్యే పదవి…బూతురత్నకు ఎంపీ పదవి.. బూతుసామ్రాట్ అయితే మంత్రి పదవి… ఇదీ ఈనాడు రాష్ట్రంలో సాగుతున్న రాజకీయం. ఎంపీలంటే పార్లమెంట్ లో మాట్లాడి కేంద్రాన్ని మెప్పించి రాష్ట్రానికి ప్రాజెక్టులు తీసుకురావాలి. కానీ ఇక్కడున్న సైకో అవన్నీ అవసరం లేదంటున్నాడు.. చంద్రబాబుని తిట్టావా.. పవన్ కల్యాణ్ ను తిట్టావా.. లోకేశ్ ను తిట్టావా.. అవేవీ చేయలేదు కాబట్టి..నీకు టిక్కెట్ ఇవ్వను అన్నాడు.. ఇక్కడున్న ఎంపీని. అదీ వీళ్ల రాజకీయం.
బీసీ ఎంపీ కర్నూల్ నుంచి మాట్లాడుతున్నాడు… ఐదేళ్లలో ముఖ్యమంత్రినే కలవలేదు.. అపాయింట్ మెంటే ఇవ్వలేదు అంటున్నాడు. బలహీనవర్గాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీ ఈ ముఖ్యమంత్రి ఎంత అహంభావో.. అహంకారో చెప్పకనే చెప్పాడు.
మరొకడేమో.. సంక్రాంతి సంబరాలని చెప్పి, పేదలకు ఇచ్చే పింఛన్ల సొమ్ముని నొక్కేసి డ్యాన్సులు వేస్తున్నాడు.ఇంకొకతనేమో..సంక్రాంతి సంబరాలు అంటూ కేసినోలు.. పేకాట శిబిరాలు నిర్వహిస్తాడు. ఆర్థిక మంత్రి అప్పుల మంత్రిగా మారాడు. ఎక్కడచూసినా అప్పులే. 13లక్షల కోట్ల అప్పులు చేశారు. ఈ అప్పులు ఎవరు తీరుస్తారు అని అడుగుతున్నా? ముఖ్యమంత్రి కడతాడా.. సాక్షి పేపర్.. జగతి పబ్లికేషన్స్ కడతాయా?
అప్పులు కట్టాల్సింది ప్రజలే. అప్పులు చేసి వీళ్లు వెళ్లిపోతే ఆ సొమ్మంతా మనమే కట్టాలి. అప్పులు చేసేది వీళ్లే.. దుర్మార్గాలు.. నేరాలు…ఘోరాలు చేసేది వీళ్లే. బూతులుతిట్టేది వీళ్లే. నెపం మాత్రం మనపై వేస్తూ కాలక్షేపం చేస్తూ ముందుకు పోతున్నారు. ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నీతిమాలిన బూతుల వ్యక్తులకు ఓటేస్తే ఈ రాష్ట్రానికి అరిష్టం. రేపు రాబోయే ఎన్నికల్లో ఇలాంటి చెడువ్యక్తుల్ని చిత్తుచిత్తుగా ఓటు ద్వారా ఓడించి వారికి బుద్ధిచెప్పాల్సిన బాధ్యత మీపైనే ఉంది.
నాడు ముద్దులు… నేడు గుద్దులే గుద్దుళ్లు. ఎన్నికల సమయంలో ముందుగా ఒక మోసగాడు ముద్దులు పెట్టాడు. అతను అధికారంలోకి వచ్చాక మీ జీవితాలు మారాయా? నిత్యావసరాల ధరలు పెరిగి పేదలు పండుగ చేసుకోలేని దుస్థితికి వచ్చారు.ఆనాడు విద్యుత్ ఛార్జీలు రూ.200లు ఉంటే, ఇప్పుడు రూ.1000 పెరిగాయి. మద్యం క్వార్టర్ ఆనాడు రూ.60లు ఉంటే.. నేడు రూ.200లు. పెంచిన సొమ్ము ఎవరి జేబుల్లోకి పోతోంది?
కూలి పనిచేసుకునేవారు..రైతులు.. మహిళలు.. యువత..ఉద్యోగులు అందరూ నష్టపోయారు.చెత్తపై కూడా పన్నువేసిన చెత్త ముఖ్యమంత్రి.. పనికిమాలిన ముఖ్యమంత్రి… చరిత్రలో ఎప్పుడూ చూడని పిచ్చి తుగ్లక్ ముఖ్యమంత్రి.. దుర్మార్గపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. విద్యుత్ … ఆర్టీసీ ఛార్జీలు.. నిత్యావసరాల ధరలు.. పెట్రోల్, డీజిల్ రేట్లు..ఇంటిపన్ను.. మద్యం ధరలు.. ఇలా అన్నీ పెంచి పేదలకు రూ.10లు ఇస్తూ 100రూపాయలు దోచేస్తున్నాడు. ఇదీ దోపిడీ ప్రభుత్వం కాక మరేమిటి? 4 ఏళ్లలో రాష్ట్రంలోని ఒక్కో కుటుంబంపై రూ.4లక్షల నుంచి రూ.6లక్షల భారం పడే పరిస్థితి తీసుకొచ్చారు.
జరిగేది అవినీతి.. దోపిడీ కాదా? ఈ దోపిడీని అరికట్టాలా..లేదా? అడిగిన వారిపై కేసులు. తమ్ముళ్లూ… మనల్ని వేధించే వారికి వడ్డీతోసహా.. చక్రవడ్డీ కలిపి చెల్లిస్తాం. తిరుపతి ఎన్నికల్లో ఒక ఐఏఎస్ అధికారి ఎగిరెగిరి పడ్డాడు. 20వేల దొంగఓట్లు సృష్టించాడు. ఈ రోజు ఎన్నికల కమిషన్ అతన్ని సస్పెండ్ చేసింది.. సిగ్గుండాలి.
సమర్థవంతమైన.. సుపరిపాలనతోనే పేదలకు సంతోషం. ఇది పేదల ప్రభుత్వం కాదు. పేదల రక్తం తాగే ప్రభుత్వం. జగన్ వస్తే అమరావతి-పోలవరం ఆగిపోతాయని నాడే చెప్పాఇంతకుముందే చెప్పాను.. జగన్మోహన్ రెడ్డి వస్తే పోలవరం ఆగిపోతుంది.. అమరావతి నిలిచిపోతుందని. పోలవరాన్ని గోదావరిలో ముంచేశాడు. అమరావతిని చెరబట్టాడు. దీనివల్ల రాష్ట్ర సంపద నాశనమైంది.
అన్ని అరిష్టాలకు కారణం.. ఈముఖ్యమంత్రి.. వైసీపీ నాయకులు చేసిన తప్పుడు పనులే. ఈ ముఖ్యమంత్రి దాదాపు 100 వరకు సంక్షేమ పథకాలు రద్దుచేశాడు. అన్నాక్యాంటీన్లు.. విదేశీ విద్య.. చంద్రన్న బీమా.. పండుగ కానుకలు… పెళ్లికానుకలు…రైతులకు సబ్సిడీలు..బీసీలకు చెందిన 30 పథకాలు..ఎస్సీలకు సంబంధించి 27 పథకాలు.. ఎస్టీల పథకాలు.. మైనారిటీల పథకాలు రద్దుచేసిన రద్దుల ప్రభుత్వం.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.
ఇలాంటి పనులుచేసిన వ్యక్తి పేదవాడికి పెత్తందారుకి మధ్య పోరాటమంటున్నాడు. దేశంలో అసలుసిసలైన నిజమైన పెత్తందారు జగన్మోహన్ రెడ్డి. ఈ ముఖ్యమంత్రి కోటీశ్వరుడు అయితే..పేదవాడు నిరుపేదగా మారాడు. దేశంలోని ముఖ్యమంత్రులందరి కంటే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా నిలిచాడు. రూ.510 కోట్లతో దేశంలోని ముఖ్యమంత్రులు అందరి కంటే ఎక్కువ సంపద కలిగిఉన్నాడు.
అధికారమంటే అతనికి దోపిడీ.. బ్రిటీష్ వారు వ్యాపారం పేరుతో దేశంలోకి వచ్చి, ఇక్కడున్న సంపదంతా కొల్లగొట్టారు. జగన్మోహన్ రెడ్డి సొంత వ్యాపార సంస్థలు పెట్టాడు. ఇసుక, మద్యం, భూ కుంభకోణాలు, సెటిల్మెంట్లు. ఎటుచూసినా దోపిడీనే.
అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు
ఇప్పుడు కొత్తగా భూరక్షణ చట్టం అంటున్నాడు. భూ రక్షణ కాదు..భూ భక్షణకోసం సిద్ధమయ్యాడు. ఇప్పుడు రాష్ట్రంలో ఓట్లదొంగలు పడ్డారు. రేపు భూముల దొంగలు రాబోతున్నారు. మీరంతా జాగ్రత్తగా ఉండాలి.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ (భూ రక్షణ చట్టం) ను టీడీపీప్రభుత్వం రాగానే రద్దుచేస్తాం. యథావిథిగా పూర్వమున్న పరిస్థితినే కొనసాగిస్తామని హామీ ఇస్తున్నా. దుర్మార్గుల చేతిలో సాంకేతిక పరిజ్ఞానం ఉండటం అత్యంత ప్రమాదకరం.
మీ బిడ్డ అంటూ ఎన్నికల ప్రచారానికి వస్తున్నాడు. మీరంతా నువ్వు మా బిడ్డవు కాదు, రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డఅని చెప్పాలి. పాతసినిమాల్లో ఒక నటుడుండేవాడు. ఆ మాదిరి తడిగుడ్డతో జనం గొంతులు కోసే రకం ఈ జగన్మోహన్ రెడ్డి. అన్నీ కుట్రలు.. కుతంత్రాలే. బాబాయ్ హత్య ఏమైంది. హూ కిల్డ్ బాబాయ్. ఇప్పటికైనా అసలు దోషులు అరెస్ట్ అయ్యారా? ఆయన కూతురిపై, ముఖ్యమంత్రికి చెల్లి.. ఆమెపై.. సీబీఐపైనే కేసులు పెట్టారు.
కోడికత్తి శీను ఏమయ్యాడు? ఎన్నేళ్లు అయ్యింది? 5 ఏళ్లుగా దళిత యువకుడు చేయని తప్పుకు జైల్లో మగ్గిపోతున్నాడు. ఆ నేరం మనపై వేయాలని ప్రయత్నించి, చివరకు కోడికత్తి శీనుని జైల్లోనే ఉంచాడు.
మనందరం చెల్లిని సమానంగా చూస్తాం. ఆమెను సంతోషంగా ఉంచుతాం. ఆడబిడ్డలకు కూడా ఆస్తిలో సమానహక్కు కల్పించింది ఎన్టీఆర్.తన చెల్లికి ఆస్తిలో హక్కు ఇచ్చేపరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి లేడు. జగనన్న బాణం ఎక్కడికి వెళ్లిందో చూస్తున్నాం కదా!
మాటమాటకీ విశ్వసనీయత అంటాడు. మద్యాన్ని నిషేధించాకే ఓట్లు అడుగుతాను అన్నాడు. చెప్పింది చేశాడా? మద్యంపై వచ్చే ఆదాయం తాకట్టు పెట్టి రూ.36 వేలకోట్లు అప్పులు తెచ్చాడా..లేదా? ఈ వ్యక్తికి ఓట్లు అడిగే హక్కు ఉందా? ఇదేనా ఈయన విశ్వసనీయత?
ఏటా జాబ్ క్యాలెండర్ అన్నాడు….డీఎస్సీ నిర్వహిస్తాను అన్నాడు. 5 ఏళ్లలో ఒక్క ఉద్యోగమైనా ఇచ్చాడా? జాబ్ రావాలంటే తెలుగుదేశం-జనసేన ప్రభుత్వమే రావాలి. యువగళం కింద యువతకు 20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఉద్యోగం వచ్చేవరకు ఒక్కొక్కరికి రూ.3వేల నిరుద్యోగ భృతి అందిస్తాం. ఇంట్లోనే కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. ప్రపంచంలో ఉండే ప్రముఖ కంపెనీలు అన్నీ రాష్ట్రానికి తీసుకొస్తాం.
ప్రచారానికి వచ్చే వైసీపీ నేతల్ని నిలదీయండి. మాకు బూతులు మాట్లాడేవారు వద్దు.. అభివృద్ధి చేసేవారు కావాలని నినదించండి. మా బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలి.. గంజాయి, మాదకద్రవ్యాలు కాదని తేల్చిచెప్పండి. ఊరువాడా అక్రమకేసులు పెట్టడం కాదు.. పరిశ్రమలు రావాలని చెప్పండి. మాయమాటలు కాదు.. వ్యవసాయానికి సబ్సిడీలు కావాలని చెప్పండి. రోడ్లు.. ఇతర మౌలిక వసతులు కల్పించాలని కోరండి. గతంలో ఈ ముఖ్యమంత్రి ఊరూరా తిరిగి బుగ్గలు నిమిరాడు. ఇప్పుడేమో పరదాలు కట్టుకొని తిరుగుతున్నాడు. తప్పుచేసిన వాడు తడబడతాడు. మనం తప్పు చేయలేదు కాబట్టే.. ధైర్యంగా తిరుగుతున్నాం. ధైర్యంగా ప్రజల్లో తిరిగే పార్టీలు టీడీపీ-జనసేన మాత్రమే.
ప్రభుత్వమిచ్చిన జీవోలు బయటకు రాకుండా దాచిపెట్టారు. ఎందుకంటే అన్నీ తప్పుడు జీవోలు.. చీకటి జీవోలు. వీళ్లు చేసిన అవినీతి, అక్రమాలు బయటకు వస్తే పునాదులు కదులుతాయన్న భయంతోనే జీవోలు దాచిపెట్టారు. 5 ఏళ్లలో ఈ ముఖ్యమంత్రి ఎక్కడైనా..ఎప్పుడైనా ఒక ప్రెస్ మీట్ పెట్టాడా? చెప్పిన హామీలు ఎందుకు నెరవేర్చవని అడుగుతారన్న భయంతోనే బయటకు రాడు.
‘పల్లె పిలుస్తోంది’ కార్యక్రమానికి భువనేశ్వరి పిలుపునిచ్చారు. ఎక్కడెక్కడో ఉన్న తెలుగువారు సంక్రాంతికి సొంత ఊళ్లకు వచ్చారు. అందరం దేవుడి వద్దకు వెళ్లి మంచి చేయాలని కోరితే, ఈయన మాత్రం ప్రజలసొమ్ముతో ఇంటిపక్కనే దేవాలయం కట్టించుకున్నాడు. మనందరం పల్లెకు పోతే..ఈయన ప్యాలెస్ లోనే పల్లెను నిర్మించాడు. ఇలాంటి వ్యక్తి సమాజానికి…రాష్ట్రానికి అవసరమా? ఏది చూసినా, ఏంచేసినా..అంతా నటన, బూటకమే.
నల్ల బెలూన్లు ఎగరేసిన వారిపై అక్రమ కేసులు పెట్టారు. రేపు ఇంకా ఎక్కువగా ఎగరేస్తే ఏంచేస్తాడు? తప్పుడు పనులు చేసేవారిని ప్రజల్లో దోషిగా నిలబెట్టే శక్తి అంబేద్కర్ రాజ్యాంగానిది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం హక్కుల కోసం.. భవిష్యత్ కోసం పోరాడదాం.
మీ భవిష్యత్తుకు గ్యారంటీ
భవిష్యత్ కు గ్యారెటీ’ అనే కార్యక్రమంతో మీ భవిష్యత్ కు, రాష్ట్ర భవిష్యత్ కు నేను గ్యారెంటీ ఇస్తున్నాను. ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.1500లు ఇస్తాం. డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి, మహిళలకు పొదుపు ఉద్యమం నేర్పింది తెలుగుదేశమే. రూపాయి మీరు దాచుకుంటే రూపాయి అదనంగా ఇచ్చాం. మహిళలకు నాయకత్వం నేర్పించాం. అలాంటి మహిళల్ని మరింత శక్తివంతులుగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటాను.
• తల్లికి వందనం పథకంలో భాగంగా ప్రతి ఇంట్లో ఎందరు చదువుకునే పిల్లలుంటే, అందరికీ ఏటా రూ.15వేలు అందిస్తాం.
• ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఆడబిడ్డలకు అందిస్తాను. ఆర్టీసీ బస్సుల్లో దర్జాగా వెళ్లేలా ఉచిత ప్రయాణం అందిస్తాం.
• అన్నదాత పథకం కింద ప్రతిరైతుకు ఏడాదికి రూ.20వేల ఆర్థిక సాయం అందిస్తాం. ఆక్వా కల్చర్ అభివృద్ధికోసం యూనిట్ విద్యుత్ 1.50పైసలకే అందించి, జోన్ పద్ధతి తొలగిస్తాం. నందివాడలో ఆక్వాసాగు బాగుంది.
• ఈ క్రాప్ విధానంతో గిట్టుబాటు ధర లేకుండా చేసింది ఈ ప్రభుత్వం. పంట ఉత్పత్తులు గిట్టుబాటుధరకు కొనకుండా, దళారులతో రైతుల కష్టాన్ని దోపిడీ చేశారు. మరలా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే రైతులకు గిట్టుబాటు ధర అందిస్తాం. పంట ఉత్పత్తులు ఎప్పటికప్పుడు కొని, కచ్చితంగా డబ్బులు చెల్లిస్తాం.
• రాబోయేది రైతు ప్రభుత్వం. రైతు రాజ్యం వస్తుంది.. రైతే రాజు. రైతుల్ని అన్నివిధాలా ఆదుకునే తీరతాం.
• ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందిస్తాం. వెనుకబడిన కులాలకు సబ్ ప్లాన్ తీసుకొచ్చి, బీసీలను ఆదుకుంటాం. వారిరక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తాం.
• ఎన్టీఆర్ స్వగ్రామంలో నేడు P-4 కార్యక్రమానికి రూపకల్పన చేశాను. పేదలకోసం పనిచేయాలన్నది ఎన్టీఆర్ కల. పేదల్ని ఏ విధంగా ఆర్థికంగా పైకి తీసుకురావాలనే దానిపై తెలుగుదేశానికి స్పష్టమైన విధానముంది.
• జగన్మోహన్ రెడ్డి పేదలకు 10రూపాయలు ఇస్తూ.. 100రూ.లు దోచేస్తున్నాడు. మనం చేయబోయేది సంపద సృష్టించి, పేదలకు ఇచ్చే సొమ్ముని రెట్టింపు చేయడం. పేదలకు సంపద పంచడం చేస్తాం.
• పేదలు జీవితాంతం ఆర్థిక అసమానతలతో బాధపడకుండా సంతోషంగా ఉండాలన్నదే టీడీపీ-జనసేన ప్రభుత్వ లక్ష్యం. ప్రపంచంలోని తెలుగువారిని రాష్ట్రానికి అనుసంధానించి ‘వికాసం’ అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా 5, 10 ఏళ్లలో రాష్ట్రంలోని పేదలకు పూర్తిగా న్యాయం చేస్తాం. వారిన పేదరికం నుంచి పైకి తీసుకొచ్చి, ధనికుల్ని చేస్తాం.
*రాజకీయాల్లో ఎప్పుడైనా ట్రాన్స్ ఫర్లు చూశారా*
• ఎప్పుడైతే తెలుగుదేశం-జనసేన కలిశాయో, అప్పుడే వైసీపీ నేతల ప్యాంట్లు తడిచాయి. జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. వాస్తవం తెలిసే జగన్మోహన్ రెడ్డికి నిద్ర రావడంలేదు. ఆ భయంతోనే 95 మంది ఎమ్మెల్యేలను మారుస్తాను అంటున్నాడు.
• చెత్త ఎక్కడున్నా చెత్తేకదా! ఇక్కడున్న చెత్తను పక్కన పడేస్తే అది చెత్త కాకుండా పోతుందా? రాజకీయాల్లో ఎప్పుడైనా ట్రాన్స్ ఫర్లు చూశారా? ప్రజా ప్రతినిధుల్ని ఎప్పుడైనా మార్చారా? ప్రజలకు మంచి చేసే వారిని చేయనివ్వకుండా.. నేడు ఇష్టానుసారం మారుస్తూ ప్రజల్ని మోసగించడానికి చూస్తున్నాడు.
• ఎందరిని మార్చినా గెలిచేది లేదు. వైనాట్ పులివెందుల అంటున్నాం. పులివెందులలో జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటేయాలి? బాబాయ్ ని చంపినందుకా.. వ్యవసాయానికి, తాగడానికి నీళ్లివ్వనందుకా..రాష్ట్రాన్ని నాశనం చేసినందుకా? దేనికో చెప్పండి.
• 83 రోజుల కౌంట్ డౌన్ మొదలైంది. 83 రోజుల తర్వాత జగన్ అతని పార్టీ ఇంటికే. ఇలాంటి పార్టీని భూస్థాపితం చేసే బాధ్యత అందరిపై ఉందని తెలుసుకోండి.
• పండుగలు కూడా లేకుండా అంగన్ వాడీ సిబ్బంది రోడ్లపై ఉన్నా ఈ ముఖ్యమంత్రి పట్టించుకోడు. తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం రాగానే అంగన్ వాడీ సిబ్బంది జీతాలు మరలా పెంచుతాం
• గుడివాడలోని పేదలకోసం మన ప్రభుత్వం గతంలో 8,900 టిడ్కోఇళ్లు నిర్మించింది. ఆ ఇళ్లకు రంగులేశారు తప్ప.. వీళ్లు ఏమీ చేయలేదు? రంగులు ముఖాలకు వేసుకుంటే బాగుండేది. ఎవరికో పుట్టిన బిడ్డను మా బిడ్డలని చెప్పుకుంటారా? 90 శాతం పూర్తిచేసిన ఇళ్లను 10శాతం పూర్తిచేసి పేదలకు ఇవ్వలేకపోయారు? అలాంటి వీళ్లు మూడు రాజధానులు కడతారా?
• గుడివాడ-పామర్రు ప్రధాన రహదారిని బాగుచేశారా? ఆ రహదారిని అధికారంలోకి రాగానే పూర్తిచేస్తాం. రైల్వే ట్రాక్ పై నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల్ని వేగవంతం చేస్తాం.
• మణికొండ-గుడివాడ రహదారిని నాలుగువరసల రహదారిగా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం. అవనిగడ్డ-కోడూరు రహదారి మరమ్మతులకు రూ.30కోట్లు ఇస్తానన్నాడు.. ఇచ్చాడా? ఆ రోడ్డుని మనమే బాగుచేయాలి.
• తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో స్టేడియం నిర్మాణానికి రూ.13కోట్లు..ఇండోర్ స్టేడియానికి రూ.5కోట్లు ఇచ్చాం. ఆ పనులేవీ పూర్తికాలేదు. టీడీపీ-జనసేన ప్రభుత్వం రాగానే ఆ పనులన్నీ పూర్తిచేస్తాం.
• బైపాస్ రోడ్డులోని గౌతమ్ స్కూల్ వద్ద పేదలకు చెందిన 6 ఎకరాలు మాయమయ్యాయి. ఆ భూమిని కాపాడుకోవడానికి చర్యలు తీసుకుంటాం.
• గుడివాడ మండలంలో మట్టికి రెక్కలొచ్చాయి. ఎమ్మెల్యే వేధింపులతో అతని అనుచరుడు వంకా విజయ్ రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడా..లేదా? గుడివాడలో వైశ్య వర్గానికి చెందిన పెదమల్లు ఆంజనేయులు షాపింగ్ కాంప్లెక్స్ ఎమ్మెల్యే అనుచరులు బలవంతంగా రాయించుకోవడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు.
• గుడివాడ మంచికి మారుపేరు. అలాంటి ప్రాంతంలో ఇలాంటి వ్యక్తులుంటే చూస్తూ ఊరుకోవాలా? గుడివాడ ప్రజలకు ప్రధాన సమస్య.. ఇక్కడున్న ఎమ్మెల్యేనే. ఆ ఎమ్మెల్యేను చిత్తుచిత్తుగా ఓడించి, గుడివాడ నియోజకవర్గాన్ని ప్రక్షాళన చేయండి.
• ఇక్కడున్న ఎమ్మెల్యే నోరు తెరిస్తే బూతులే. అది నోరు కాదు.. మురికి కాలువే. ఎంత శుభ్రపరిచినా అది ఎప్పటికీ మురికికాలువే. నా వద్ద ఓనమాలు నేర్చుకొని నాకే పాఠాలు చెప్పేవారికి నేనేంటో చూపిస్తా.
• కొడాలి…నోరుందని పారుసుకోవద్దని హెచ్చరిస్తున్నా. నోరు పారేసుకుంటే భవిష్యత్ లో జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నా. తెలుగుదేశం పార్టీ ఎవరి జోలికి వెళ్లదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నా.. మనల్ని మనం కాపాడుకోవాలన్నా… ఎలాంటి పరిస్థితినైనా ఎదిరించి నిలిచేది తెలుగుదేశంపార్టీనే.
• మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు…గతంలో సీటు ఇవ్వకపోయినా.. ఇప్పుడు రాముని నియమించినా.. గెలుపే ప్రధానమని ఒప్పుకున్న వ్యక్తి.
• రాము, వెంకటేశ్వరరావు ఇద్దరూ కలిసి ఇక్కడి ఎమ్మెల్యేను ఏకంగా పంపాల్సిన చోటకి పంపిస్తారు. వారికి తోడుగా మీరుండాలి. ఇక్కడుండే జనసేన-టీడీపీ కార్యకర్తలు అహంభావంతో విర్రవీగే వారిని కాలగర్భంలో కలిపేలా కసితో పనిచేయాలి.
• మీరంతా నాకోసం.. పవన్ కల్యాణ్ కోసం పనిచేయడంలేదని తెలుసుకోండి. భావితరాల భవిష్యత్ కోసం పనిచేస్తున్నారు. ‘రా..కదలిరా’ అన్న టీడీపీ పిలుపు రాష్ట్రమంతా ప్రభంజనంలా మారాలి.
• ఇక్కడ బూతులు మంత్రి ఉంటే.. బందరులో నీతుల మంత్రి ఉన్నాడు. ఆయన రోజూ అన్నం తింటున్నాడా.. భూములు తింటున్నాడా? స్థలం కనిపిస్తే మింగేస్తున్నాడు.
• సత్రం భూమి 1000 గజాలు ఆక్రమించుకున్నాడు. బైపాస్ రోడ్ కోట జైరామ్ పేరుతో 1.5 ఎకరాలు ఆక్రమించాడు. బైపాస్ రోడ్ లో రంగనాయక స్వామి ఆలయం స్థలం కబ్జా చేశాడు. వినాయకనగర్ ఆర్టీసీ కాలనీలో 200 గజాల పార్క్ స్థలం ఆక్రమించాడు. కృతివెన్నులో 300ఎకరాలు బినామీ పేర్లతో కొన్నాడు. ఎక్కడచూసినా భూకబ్జాలు..ఆక్రమణలే.
• ఎప్పుడో పూర్తి కావాల్సిన పోర్టుని పూర్తిచేయకుండా నాటకాలు ఆడుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే బందర్ పోర్ట్ పూర్తవుతుంది. అక్కడ ఆయన పని అయిపోయిందని తెలిసే…సుపుత్రుడని తెచ్చాడు. అక్కడ మన కొల్లు రవీంద్ర ఉన్నాడు.. ఆయన చూసుకుంటాడు.
• జోగి.. నిన్నటివరకు పెడనను పీడించిన రోగి. ఆ చెత్తను ఈ ముఖ్యమంత్రి పక్కన వేశాడు. పెనమలూరుకు వేశాడు. నా ఇంటిపై దాడి చేస్తే అతనికి మంత్రి పదవి ఇచ్చారు. అతని చీటి ఇప్పుడు పెడనలో చినిగితే.. పెనమలూరులో ఈ దరిద్రం మాకొద్దు అంటున్నారు.
• ఆయన కథ చూస్తే పనికి ఇంతని కమీషన్. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే తాపత్రయం. ఆయనకు కూడా గుణపాఠం చెబుతాం.
• గన్నవరం.. ఆ పేరు చెప్పే స్థాయి నాదికాదు. ఇంతకు ముందు వీళ్లను పెంచి పోషించాను. తర్వాత తెలిసింది వీళ్లు గంజాయి మొక్కలని. వీళ్లు తిడుతుంటే పడుతున్నది నన్ము నమ్ముకున్న ప్రజలకోసమే. లేకపోతే వీళ్లను లెక్కకూడా చేయను.
• రూ.400కోట్ల భూ కబ్జాలు.. రూ.300కోట్ల గ్రావెల్ దోపిడీ..ఇదీ వీళ్ల కండకావరం. డబ్బుంటే ఏమైనా చేయొచ్చనే ధీమాతో ఉన్నారు.
• పామర్రులో కైలే అనిల్ కుమార్..అతను చేసిన అభివృద్ధి సున్నా..దోపిడీయే మిన్న. మట్టిని మింగేస్తున్నాడు..ఇసుక బొక్కేస్తున్నాడు. ఇళ్లస్థలాల పేరు చెప్పి ఎకరం రూ.16 లక్షలకు కొని, ఎకరం రూ.43లక్షలకు ప్రభుత్వానికి అమ్మాడు.
• అవనిగడ్డ ఎమ్మెల్యే.. అవనిగడ్డకు పట్టిన అవినీతి గడ్డ. మురికి కాలువల మరమ్మతుల పేరుతో దోపిడీ. ఈ ఏడుగురు ఎమ్మెల్యేలను ఇంటికి పంపుతారా..లేదా? తెలుగుదేశం-జనసేన పార్టీల్ని మచిలీపట్నం పార్లమెంట్ వ్యాప్తంగా గెలిపించి, ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి.
• తెలుగుదేశం-జనసేన సునామీలో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయం. గుడివాడ అదిరింది.. వైఎస్సార్ కాంగ్రెస్ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి.ఈ రోజు నుంచి 83 రోజులు ఏ ఒక్క కార్యకర్త విశ్రమించవద్దు. గెలుపు ధీమాతో అశ్రద్ధ చేస్తే చాలా ప్రమాదం. 83 రోజులు మీరంతా సైకిలెక్కి, తెలుగుదేశం-జనసేన జెండాలు కట్టుకొని ఇంటింటికీ తిరగండి. ప్రజల్ని చైతన్యం చేయండి.
• గుడివాడ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు…ఇక్కడి ప్రజలకు పిలుపునిస్తున్నా. ‘రా..కదలిరా’ అన్న పిలుపునకు స్పందించాలి. అప్పుడే రాతియుగం పోయి స్వర్ణయుగం వస్తుంది.