Suryaa.co.in

Telangana

ప్రజలపై భారం పెట్టొద్దు

– ఎంత కష్టమైనా అధికారులు, ప్రభుత్వం కలిసి పని చేసి ప్రజలకు మేలు చేద్దాం
– ప్రజల అవసరాలు తీర్చేలా ఆరు గ్యారంటీలకు అవసరమైన నిధులను సమకూర్చుకోవాలి
– ఆస్తులు సృష్టించడం ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజలకు పంచ‌డమే ప్రజా పాలన లక్ష్యం
– బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల స‌మీక్ష స‌మావేశంలో డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క వెల్ల‌డి

ప్ర‌జ‌ల‌పై భారం మోప‌కుండ అన్ని ప్ర‌భుత్వ శాఖల అధికారులు ప్ర‌త్యామ్నాయ వ‌న‌రుల స‌మీక‌ర‌ణ‌పై దృష్టి సారించి రాష్ట్ర అభివృద్ధికి పాటుప‌డుదామ‌ని డిప్యూటి సీఎం భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. గురువారం రాష్ట్ర స‌చివాల‌యంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డిల‌తో క‌లిసి 2024-25 ఆర్ధిక సంవ‌త్స‌రానికి సంబంధించి వార్షిక బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల త‌యారీపై రెవెన్యూ, గృహ నిర్మాణం, ఐ అండ్ పిఆర్‌, ఉన్న‌త అధికారుల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు.

ఆస్తులు సృష్టించి, సృష్టించిన ఆస్తులతో వచ్చిన ఆదాయం ప్రజలకు పంచడానికి ఎంత క‌ష్ట‌మైన అదికారులు, ప్ర‌భుత్వం క‌లిసి ప‌ని చేసి ప్ర‌జ‌ల‌కు మేలు చేద్దామ‌ని ద‌శ దిశ నిర్ధేశం చేశారు. తెలంగాణ‌ను ప్ర‌జాస్వామిక‌, సంక్షేమ రాష్ట్రంగా అభివృద్ధి చేయడమే ప్ర‌జా పాలన లక్ష్యమ‌ని వివ‌రించారు. ప్ర‌జ‌ల‌కు మేలు చేయ‌డమే ఇందిర‌మ్మ రాజ్యం, కాంగ్రెస్ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌న్నారు. ప్ర‌భుత్వ ల‌క్ష్యాల‌కు అనుగుణంగా అధికారులు ప‌ని చేయాల‌ని కోరారు.

కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలు రెవెన్యూ శాఖ‌లో ఉన్న‌టువంటి భూముల లీజు గ‌డువు దాటిన వాటిపై దృష్టి సారించాల‌న్నారు. రాష్ట్ర ప్రజలకు చెందాల్సిన ఆస్తులు కొద్ది మంది చేతుల్లో ఉండటానికి వీలులేదని, ప్రభుత్వ ఆస్తులు ప్రజలకు చెందాలన్నారు.

ధ‌ర‌ణితో ప్ర‌జ‌ల హ‌క్కుల‌ను కాల‌రాయద్దు
గ‌త ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన ధ‌ర‌ణిలో కాస్తు కాలం తొల‌గించి రైతుల హ‌క్కుల‌ను కాల‌రాసింద‌న్నారు. ఇప్పుడు ఆ ప‌రిస్థితి ఉండొద్ద‌ని అధికారుల‌కు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రతి సంవత్సరం జమా బంధీ చేసేవారని గుర్తు చేశారు. 2014 త‌రువాత ఆ విధానం పాటించ‌కుండ ఐదారు సంవ‌త్స‌రాలు రెవెన్యూ స‌ద‌స్స‌లు నిర్వ‌హించకుండ జ‌మా బంధీని నిలుపుద‌ల చేయ‌డం వ‌ల్ల ఆనేక స‌మ‌స్య‌ల‌తో రైతులు ఇబ్బందులు ప‌డ్డార‌ని తెలిపారు.

గ‌త ప్ర‌భుత్వం ధరణి సాఫ్ట్వేర్ తీసుకొచ్చి ప్రభుత్వ, అసైన్డ్, మాన్యం, ఎండోమెంట్‌, ఆనేక త్యాగాలు, పోరాటాలు చేసిన ఫ‌లితంగా వ‌చ్చిన చ‌ట్టాల ద్వారా వచ్చిన భూములను పార్ట్ బి లో పెట్టి ఆ రైతుల హ‌క్కుల‌ను కాల‌రాసింద‌న్నారు. పార్ట్ బిలో ఉన్న భూముల‌ను క్లియర్ చేయడానికి కావాల్సిన సిస్టం కూడా లేకుండా చేయ‌డం వ‌ల్ల రైతులు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని తెలిపారు. ధ‌ర‌ణి వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు సంబంధించిన భూములు కొంత మంది ఆధీనంలోకి వెళ్లాయ‌ని, అదే విధంగా ప్ర‌భుత్వ భూములు సైతం కొద్ది మంది చేతుల్లోకి వెళ్లాయ‌ని వాటిని గుర్తించి తిరిగి తీసుకునే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రెవెన్యూ శాఖ అధికారుల‌ను ఆదేశించారు.

2014 సంవ‌త్స‌రం వరకు రాష్ట్ర వ్యాప్తంగా అసైన్ చేసి పంపిణీ చేసిన భూముల వివరాలు? 2014 నుంచి 2024 సంవ‌త్స‌రం వరకు గ‌త ప్ర‌భుత్వం వెనక్కి తీసుకున్న భూములు? వాటిని ఏ అవసరాల కోసం వాడారు? వెనక్కి తీసుకున్న భూముల్లో మిగిలి ఉన్న‌ భూమి ఎంత? అన్ని వివరాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని రెవెన్యూ శాఖ‌ను అదేశించారు.

తెలంగాణలో జరిగిన ప్రతి పోరాటం భూమి కోసమే
తెలంగాణలో జ‌రిగిన ప్ర‌తి పోరాటం భూమి కోస‌మే జ‌రిగింద‌ని డిప్యూటి సీఎం వివ‌రించారు. 1945-1952 మ‌ధ్య‌న‌ జరిగిన తెలంగాణ సాయుధ రైతంగా పోరాటం, ఆత‌రువాత జ‌రిగిన న‌క్స‌ల్ బ‌రి ఉద్య‌మం, 1969 తెలంగాణ‌ పోరాటం ఇలా అనేక పోరాటాలు భూమి కోసమే జ‌రిగాయ‌ని ఆపోరాటాల ఫలితంగా గ‌త ప్ర‌భుత్వాలు చ‌ట్టాలు తెచ్చి టెనన్సీ యాక్ట్, భూ సంస్క‌ర‌ణ‌ల చ‌ట్టం ద్వారా రైతుల‌కు భూముల‌పై హ‌క్క‌లు క‌ల్పించార‌ని చెప్పారు. ఈ హ‌క్కుల‌ను ధ‌ర‌ణి పేరిట కాల‌రాయ‌డం స‌రికాద‌న్నారు.

2004- 2009 మధ్య ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నక్సల్స్ తో జరిపిన చర్చలు ప్రజా సంఘాల నాయకులు చేసిన 104 రికమండేషన్స్ లో 93 రికమండేషన్స్‌కు కోనేరు రంగారావు క‌మిటి ద్వారా చట్టాలు చేసి భూ సమస్యలు పరిష్కారం కొరకు సీసీఎల్ఏ నుంచి తహసిల్దార్ కార్యాలయం వరకు ప్రత్యేక అధికారులు నియ‌మించిన‌ట్టు గుర్తు చేశారు. ప్ర‌జ‌లు చేసిన పోరాటాలు, త్యాగాలతో చేసిన‌ చట్టాల ద్వారా భూమిపై ప్రజలు తెచ్చుకున్న హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

గత ప్రభుత్వంలో ఆగిపోయిన ఆపద్బాంధు, పిడుగుపాటుతో చనిపోయిన కుటుంబాలకు అందించే ఆర్థిక సహాయానికి సంబంధించిన పథకాలకు నిధులు కేటాయించ‌కుండ గ‌త ప్ర‌భుత్వం ఆపివేసింద‌ని అధికారులు వివ‌రించారు. కేంద్ర ప్రభుత్వం గత పది సంవత్సరాల్లో తెలంగాణకు 1.50 లక్షల ఇండ్ల నిర్మాణానికి మాత్రమే నిధులు ఇచ్చిందని, 2023-24 సంవ‌త్స‌రంలో ఇండ్ల నిర్మాణ ప‌థ‌కానికి తాత్క‌లిక బ్రేకులు వేసింద‌ని అధికారులు చెప్పారు.

వచ్చే వార్షిక సంవత్సరంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం తయారు చేసిన ప్రతిపాదనలను డిప్యూటీ సీఎంకు వివరించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2లక్షల‌ ఇండ్ల నిర్మాణానికి గాను 67 వేల ఇండ్ల‌ నిర్మాణం పూర్తి చేశామని, మిగతా ఇండ్ల నిర్మాణం పనులు జరుగుతున్నాయని చెప్పారు.

మంత్రి త‌మ్మలతో క‌లిసి వ్య‌వ‌సాయం, మార్కెటింగ్‌, చేనేత జౌలి, ఉద్యాన‌వ‌న శాఖ‌లపై సమీక్ష‌
2024-25 వార్షిక బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల‌పై మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావుతో కలిసి రాష్ట్ర స‌చివాల‌యంలో వ్య‌వ‌సాయం, మార్కెటింగ్‌, చేనేత జౌలి, ఉద్యాన‌వ‌న శాఖ‌లపై డిప్యైటీ సీఎం సమీక్షించారు. రైతు బీమా, పంటల బీమా, రైతుబంధు, ఆయిల్ ఫామ్ పంటల సాగు, ధాన్యం కొనుగోలు, డ్రిప్ సాగుకు కేటాయించిన నిధుల ఖర్చులపై చర్చించారు.

నకిలీ విత్తనాలు మార్కెట్ లోకి రాకుండా సంపూర్ణంగా అరికట్టాలని, విత్త‌న‌ తయారీలో ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించని కంపెనీలపై ఉక్కు పాదం మోపాలని అధికారుల‌ను మంత్రులు ఆదేశించారు. చేనేత జౌలి శాఖ ఆధ్వర్యంలో అమ‌లు చేస్తున్న పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. బతుకమ్మ చీరలు, విద్యార్థులకు అందించే యూనిఫామ్ వస్త్ర తయారీ గురించి ఆరా తీశారు. ఈ వార్షిక సంవత్సరానికి కావలసిన బడ్జెట్ ప్రతిపాదనలు ఆయా శాఖల అధికారులు ఆర్థిక శాఖ అధికారులకు అందజేశారు.

ఈ స‌మ‌వేశంలో ర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, శ్రీనివాసరాజు, ఐ ఆండ్ పిఆర్ స్పెషల్ కమిషనర్ అశోక్ రెడ్డి, ఫైనాన్స్ జాయింట్ సెక్రెటరీ హరిత, వ్య‌వ‌సాయ శాఖ సెక్ర‌ట‌రి రఘునందన్ రావు, డిప్యూటి సీఎం సెక్ర‌ట‌రి కృష్ణ భాస్కర్ త‌దిత‌ర అధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE