– అధికారులకు వేధింపులు
-టీడీపీ నేత జీవి ఆంజనేయులు ధ్వజం
అమూల్ డైరీ కి అమ్ముడు పోయి సహకార సంఘాన్ని నిర్వీర్యం చేస్తూ అధికారులను వేధిస్తున్నారని నరసరావుపేట టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు ధ్వజ మెత్తారు. శుక్రవారం వినుకొండ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
అమూల్ డైరీ కి పాలు సరఫరా చేయడం లేదని గ్రామ పంచాయతీ సెక్రటరీలకు నోటీసులు ఇవ్వడం అమూల్ డైరీ కి అమ్ముడుపోవడం కాదా అని ప్రశ్నించారు. గుజరాత్ అమూల్ డైరీ దగ్గర కోట్ల రూపాయల ముడుపులు అందుకొని ఆ డైరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరకు ప్రభుత్వ నిధులు 6500 కోట్లు ధారాదత్తం చేశారు అని విమర్శించారు.
గ్రామాల్లో పారిశుధ్యం, పరిశుభ్రత, డెంగ్యూ, మలేరియా జ్వరాల తో క్షీణిస్తున్న ఆరోగ్య పరిస్థితులపై దృష్టి సారించాల్సిన గ్రామ పంచాయితీ సెక్రటరీలను అమూల్ డైరీ కి ఊడిగం చేయాలనడం విడ్డూరంగా ఉందని అన్నారు.
సంగం డైరీ సహకార రంగంలో రైతులకు మేలు చేస్తుంటే జగన్ రెడ్డి ప్రభుత్వం రైతులకు ద్రోహం చేసేందుకు ఈ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ తన సొంత లాభం కోసం అమూల్ ను ప్రోత్సహిస్తుందని విమర్శించారు. పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులతో మందు అమ్మిస్తున్నారని ఆరోపించారు.మద్యం, ఇసుక, బియ్యం, గుట్కా వ్యాపారాలు చేస్తూ జగన్ అండ్ కో దోచుకుంటున్నారని విమర్శించారు.
స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఇది కట్టడి చేస్తున్న అధికారులపై కన్నెర్ర చేస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారని ఇది ఈయన నిజాయితీ అని ఎద్దేవా చేశారు. స్థానిక ఎమ్మెల్యే కు ఈ అక్రమాల్లో వాటా ఉందని చెప్పారు. వినుకొండ లో నిజాయితీగల అధికారులు పని చేయాలంటే కష్టంగా మారిందని అన్నారు. వాటాలు ఇస్తే స్థలాలు రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. లేదంటే ఎమ్మెల్యే నుండి నిలిపివేయాలని ఆదేశాలు వస్తాయి. ఇలా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుండి వాటాలు పుచ్చుకుంటూ కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు.
రాష్ట్రాన్ని జగన్ దోచుకుంటే.. వినుకొండలో అక్రమ వ్యాపారులను అడ్డం పెట్టుకొని బొల్లా దోచుకుంటున్నారని టిడిపి నేత జీవి విమర్శించారు. ఎరువులు బ్లాక్ మార్కెట్లో అమ్మించి రైతుల సొమ్ము కాజేస్తున్నారు అని అన్నారు.ఇలా అవినీతికి ఎమ్మెల్యే కేరాఫ్ గా మారారని విమర్శించారు.