Suryaa.co.in

Andhra Pradesh

విద్యుత్ ఛార్జీల పెంపుపై రైతులతో టిడిపి నేత జీవి వినూత్న నిరసన

ఫ్యాను గుర్తుతో జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసగించి గద్దెనెక్కి ఇళ్లలో ఆ ఫ్యాన్లు తిరగకుండా చేస్తున్నారని నరసరావుపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఎద్దేవా చేశారు. పెరిగిన విద్యుత్‌ చార్జీలు, ట్రూఅప్‌ చార్జీలపై తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన ‘గ్రామ స్థాయిలో పోరుబాట’ సాగుతోంది. విద్యుత్‌ చార్జీలపై నెలరోజుల ఆందోళన కార్యక్రమంలో భాగంగా బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల లో నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జి.వి ఆంజనేయులు, మరియు టీడీపీ నేతలు పర్యటించారు.
బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల గ్రామంలో 33/11 కెవి విద్యుత్ ఉప కేంద్రం వద్ద ఫ్యాన్‌లకు ఉరి వేసుకొంటు, జగన్‌రెడ్డి పాలనలో ఫ్యాన్లు తిరగడం లేదంటూ నిరసన తెలిపారు. విద్యుత్‌ చార్జీలు పెంచనని ఎన్నికల ప్రచార సభల్లో హామీలిచ్చిన జగన్‌ ఈ రెండున్నరేళ్లలో ఆరు సార్లు రూ.36,802 కోట్ల భారం విద్యుత్‌ వినియోగదారులపై మోపారని వారు ఆరోపించారు.
నెలకు రూ.350 వచ్చే బిల్లు ఇప్పుడు రూ.1,000కి పెరిగిపోయిందన్నారు. ప్రభుత్వం పెంచిన విద్యుత్‌ చార్జీలను తగ్గించడంతో పాటు ట్రూఅప్‌ చార్జీలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌


చార్జీలను తగ్గించి, ట్రూఅప్‌ చార్జీలను రద్దు చేసి, డిస్కంల బకాయిలు రూ.12 వేల కోట్లు వెంటనే చెల్లించి, అధిక ధరలకు విద్యుత్‌ కొనకుండా, విద్యుత్‌ ఉత్పత్తిని పెంచాలని మాజీ ఎమ్మెల్యే జి.వి ఆంజనేయులు డిమాండ్‌ చేశారు..
ఈ సందర్భంగా రైతులు కరెంటు కోతలపై వినూత్న నిరసన చేపట్టారు.తిరగని ఫ్యాన్లు మాకు ఉరితాళ్లు అంటూ.. ఫ్యాన్ కు ఉరి వేసుకునే సన్నివేశాలను కళ్లకు కట్టినట్లు చూపించారు…
తెలుగుదేశం నాయకులు పెమ్మసాని నాగేశ్వరరావు, తిప్పి శెట్టి వెంకటేశ్వర్లు, దాసరి కోటేశ్వరరావు, గోవింద్ నాయక్, వెంకటేశ్వర రెడ్డి తదితరులు ఈ నిరసన కార్యక్రమంలో లో పాల్గొన్నారు.

LEAVE A RESPONSE