– రత్నాల్లో ఒక్కొక్కటీ రాలిపోతున్నాయ్
– అమ్మ ఒడి పధకానికి ఇన్ని ఆంక్షలా ?
– పేదలను చదువుకు దూరం చేయవద్దు
– ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్
విజయవాడ : నవ రత్నాల పేరుతో ప్రభుత్వం ప్రజలకు సంక్షేమాన్ని దూరం చేస్తూ రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెడుతోందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు. ముఖ్యమంత్రి పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటీ రాలిపోతున్నాయని ఎద్దేవా చేశారు. ప్రతిఏటా రూ.6,500కోట్లు అమ్మ ఒడికి ఐదేళ్లు ఇస్తానన్న ప్రభుత్వం ఈ ఏడాది ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. ఎంతమంది పిల్లలు ఉన్నా ఇస్తామన్న ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక్కరికే పధకం ఇస్తోందని, పేద విద్యార్థులను చదువుకు దూరం చేయడం తగదన్నారు.
అమ్మ ఒడి పధకానికి రూ . 6455 కోట్లు బడ్జెట్ కేటాయించిన ప్రభుత్వం ఇప్పుడు ఇవ్వడానికి ఎందుకు వెనుకంజ వేస్తోందని ప్రశ్నించారు. మంగళవారం ఈ మేరకు ఆంధ్ర రత్న భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేసారు. అప్పులు చేస్తూ పరిపాలన చేస్తున్న ప్రభుత్వం సంక్షేమ పధకాలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. పేద, మధ్య తరగతి విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్ధులకు ‘జగనన్న విద్యాకానుక’ లో భాగంగా 47.32 లక్షల మంది విద్యార్ధులకు 731.30 కోట్లతో ‘జగనన్న విద్యాకానుక’ ఇస్తున్నామని చెబుతోన్న ప్రభుత్వం దీనికి ఆంక్షలు విధించండం ఎందుకని శైలజానాథ్ ప్రశ్నించారు.
నాడు-నేడుతో తొలి దశలో 3,669 కోట్లతో 15,715 పాఠశాలల అభివృద్ధి, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో 10 మార్పులు, వాటిలో భాగంగా స్కూళ్లలో ఫర్నిచర్, నీటివసతి, రక్షిత తాగునీరు, పెయింటింగ్స్, గ్రీన్ చాక్ బోర్డ్, ఇంగ్లీష్ ల్యాబ్, ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు, ప్రహరీ గోడ, వంటగది వంటి వసతులు , ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ ల్యాబ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఈ పధకాన్ని నీరు కార్చే ప్రయత్నం చేయడం తగదన్నారు. రెండేళ్లలోనే రూ.32,714 కోట్లు ఖర్చు చేశా మన్న ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉన్నా అమ్మ ఒడి పధకాన్ని ఇవ్వాలన్నారు. అమ్మ ఒడి సాయం అందాలంటే ఇకపై 75శాతం హాజరు తప్పనిసరి అని, వాస్తవానికి గతంలోనే ఈ నిబంధన ఉన్నా కొవిడ్ కారణంగా అమలుచేయడం సాధ్యం కాలేదని, ఈ ఏడాది చదువుతున్న వారికి కూడా 75శాతం హాజరుచూస్తారని, ఐదేళ్ల పాలనలో ఐదుసార్లు ఇస్తామన్న పథకాన్ని నాలుగేళ్లే ఇచ్చేలా మాస్టర్ ప్లాన్ వేశారని శైలజానాథ్ విమర్శించారు.