టీడీపీ 42వ ఆవిర్బావ దినోత్సవం సంధర్బంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల కన్వీనర్ అట్లూరి నారాయణ రావు రూపొందించిన “కదలరా తెలుగోడా కదలిరా” అనే మ్యూజిక్ ఆల్బమ్ ని టీడీపీ నేతలు టీడీ జనార్ధన్, వర్లరామయ్య, నక్కా ఆనందబాబు,జూలకంటి బ్రహ్మానందరెడ్డిలు ఆవిష్కరించారు.
విజయవాడ బందర్ రోడ్ లోని గేట్ వే హోటల్ (వివంత) లో ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఈకార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ టీ.డీ జనార్దన్ మాట్లాడుతూ…ఈ పాటలు అద్బుతంగా ఉన్నాయి. వైసీపీ 5 ఏళ్ల పాలన అరాచకమంతా 5 నిమిషాల పాటల్లో అద్బుతంగా వివరించారు. జగన్ రెడ్డి పాలన అరాచకాలు, దౌర్జన్యాలు ప్రతి ఒక్కరికీ అర్దమయ్యేలా ఈ పాటలు రూపొందించారు. మరో వైపు వైసీపీ పాలనలో దగా పడి, గాడి తప్పిన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అవసరాన్ని చక్కగా వివరించారని అన్నారు.
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడుతూ….వైసీపీ ప్రభుత్వం కళాకారులు, రచయితలపై కక్ష్యసాధింపులకు పాల్పడుతోందన్నారు. కళాకారులపై కూడా అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందన్నారు. దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కళాకారులకు అండగా ఉంటామని ఆయన అన్నారు.
పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు మాట్లాడుతూ…వైసీపీ పాలనలో అరాచకం రాజ్యమేలుతోందని, అన్ని వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఈ పాటల్లో కనిపిస్తున్నాయన్నారు. వైసీపీ అరాచకపాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని అన్నారు.
మాచర్ల టీడీపీ ఎమ్మెల్యే అభ్యదర్ది జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ…సమాజాన్ని చైతన్యం చేసే శక్తి పాటలకు ఉందని ఈ పాటలు టీడీపీ కార్యకర్తల్లో నూతనోత్సహాన్ని నింపుతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో చిట్టాబత్తిని చిట్టిబాబు, బుచ్చి రాం ప్రసాద్, శంకర్ నాయుడు, వల్లూరి కిరణ్, టీడీపీ రాష్ట్ర మీడియా కో ఆర్డినేటర్ దారపనేని నరేంద్ర తదితరులు పాల్గొన్నారు