Suryaa.co.in

Telangana

5 నుంచి రైతు సత్యాగ్రహం కార్యక్రమాలు

-రైతులను నిండా ముంచిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం
-పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయమానికి కృషిచేయాలి
-కిసాన్‌ మోర్చా శ్రేణులకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పిలుపు

రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ సీట్లు భాజపా గెలిచేందుకు బీజేపీ కిసాన్‌ మోర్చా శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పదాధికారులు, కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఆయన పాల్గొని దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అనేక వాగ్దానాలు రైతులకు ఇచ్చి నిండా ముంచిన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. ప్రధానంగా రెండు లక్షల లోపు వ్యవసాయ రుణమాఫీ హామీ ఇచ్చి మాట తప్పారని, రైతు భరోసా మాటే మరిచారని ధ్వజమెత్తారు. తెలంగాణలో కిసాన్‌ మోర్చా గ్రామస్థాయిలో పర్యటించి రైతు జాగరణ చేయాలని కిసాన్‌ మోర్చా శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.

ఈనెల 5వ తేదీన అన్ని జిల్లా కేంద్రాలలో బీజేపీ కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టనున్న రైతు సత్యాగ్రహం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌ తివారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్‌రెడ్డి, పాపయ్య గౌడ్‌, రాష్ట్ర కిసాన్‌ మోర్చా ప్రధాన కార్యదర్శులు పడమటి జగన్‌ మోహన్‌రెడ్డి, మరిపల్లి అంజయ్య యాదవ్‌, కిసాన్‌ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిరుపతిరెడ్డి, కిరణ్‌గౌడ్‌, కిసాన్‌ మోర్చా రాష్ట్ర కార్యదర్శలు గోవర్ధన్‌గౌడ్‌ మహిపాల్‌, నరసింహారెడ్డి, చిలుకూరి రమేష్‌, వివిధ జిల్లాల కిసాన్‌ మోర్చా అధ్యక్షులు, ఇన్‌చార్జీలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE