– పరిహారం ఇవ్వాలని డిమాండ్
నాటుసారా మరణాలపై లోకేశ్ ఆధ్వర్యంలో తెదేపా శాసనసభాపక్ష నేతలు నిరసన వ్యక్తం చేశారు. మద్య నిషేధంపై మహిళలకు జగన్ ఇచ్చిన హామీ గోవిందా అంటూ నినాదాలు చేశారు. నాటుసారా మృతుల పాపం జగన్ రెడ్డిదే అని ప్లకార్డులు ప్రదర్శించారు. బాధిత కుటుంబాలకు రూ.25 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మద్య నిషేధంపై మహిళలకు జగన్ రెడ్డి ఇచ్చిన హామీ గోవిందా గోవిందా అంటూ సమావేశాల చివరి రోజూ నారా లోకేశ్ ఆధ్వర్యంలో తెదేపా శాసనసభాపక్షం నిరసన వ్యక్తం చేసింది. మహిళల తాళిబొట్లు తెంచారంటూ తాళిబొట్లు చేతపట్టుకుని నిరసన ర్యాలీ చేశారు. 42మరణాలపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీకి కి నిరసన ర్యాలీ గా వెళ్లారు.
మృతుల ఫొటోలకు నివాళులర్పిస్తూ నల్ల కండువాలతో నిరసన ప్రదర్శన చేపట్టారు. కల్తీ నాటుసారా మృతుల పాపం జగన్ రెడ్డిదే అని ప్లకార్డులు ప్రదర్శించారు. కల్తీసారా మరణాలు జగన్ రెడ్డి హత్యలేనని నినాదాలు చేశారు. కల్తీ సారా బాధిత కుటుంబాలకు 25లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కల్తీ నాటుసారా మరణాలపై సభలో చర్చ చేపట్టనందుకు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశామని తెదేపా ఎమ్మెల్యేలు స్పష్టంచేశారు. అసెంబ్లీ జగన్ భజన సభలా మారిందని విమర్శించారు. సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా.. తమ గొంతు నొక్కారని మండిపడ్డారు. కల్తీసారా, నకిలీ మద్యంపై సభలో చర్చించాలని ఆందోళన చేశామన్నారు. ముఖ్యమంత్రి సభలో అవాస్తవాలు చెప్పారని ఆరోపించారు.
ఇకనుంచి ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తామని చెప్పారు. రోజూ తమ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాలు ముఖ్యమంత్రి భజనకే పరిమితమయ్యాయని దుయ్యబట్టారు. ఈ మేరకు మందడం సమీపంలో తెదేపా నేతలు మీడియాతో మాట్లాడారు.