తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జోనల్ వారీగా రైతు కోసం తెలుగుదేశం పేరిట టీడీపీ నిరసన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోంది. 14వ తేదీ నుంచి రైతు సమస్యలు, పంటలకు మద్దతు ధరలు, వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్ల బిగింపు వంటి సమస్యలపై 25 పార్లమెంటు స్థానాలను ఐదు జోన్లుగా విభజించి రోజుకో జోన్ పరిధిలో నిరసనలు తెలిపేలా కార్యాచరణ రూపొందించారు. 14వ తేదీన నంద్యాల, కర్నూలు, అనంతపురం, హిందూపురం, కడప పార్లమెంటు స్థానాల్లో రైతు సమస్యలపై ప్లకార్డ్స్, బ్యానర్లతో నినాదాలు చేస్తూ… ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీగా వెళ్ళి కూరగాయలు, ఇతర పంటలను నేలపై పోసి వినూత్నంగా నిరసనలు తెలపడం జరిగింది. వ్యవసాయ రంగంలో తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన ప్రతి పథకాన్ని కొనసాగించాలని, సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సమస్యల పరిష్కారం కోసం తహశీల్దారు కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు మునుపెన్నడూ ఎదుర్కోని విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. జగన్ రెడ్డి నిర్లక్ష్యం, అవగాహనా రాహిత్యం కారణంగా రాష్ట్రంలో వ్యవసాయం దుర్భరంగా తయారైంది. వర్షాలు పడినా నీరందే పరిస్థితులు లేవు. మరోవైపు డ్రైనేజీల మరమ్మతులు చేయకపోవడం, కాలువలు ఆధ్వానంగా తయారవడంతో ఏకంగా పంట విరామం ప్రకటించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రైతు వ్యతిరేక విధానాల కారణంగా రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు తీవ్రమవుతున్నాయి. వర్షాలు పుష్కలంగా కురిసినా సాగు నీరు అందడం లేదు. పంట కాలువలు, డ్రైన్ లలో పూడిక తొలగింపులు లేవు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించి రైతుల మెడకు ఉరి బిగిస్తున్నారు. విత్తనాలు, ఎరువులపై అందే సబ్సిడీ నిలిచిపోయింది. ఆకాశాన్నంటుతున్న ధరలతో ఎరువులు కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. పంట పండించేందుకు ప్రోత్సాహకాలు లేవు, ఉచిత ఎరువులు, విత్తనాలు లేవు. పండించిన పంటకు మద్దతు ధరలు లేవు. ఒకే రేషన్ కార్డులో ఇద్దరు అర్హులున్నా, ఒక్కరికే పెట్టుబడి సాయం అందిస్తామంటూ మెలిక పెట్టారు. రైతు రధం ద్వారా ట్రాక్టర్లు అందించే పథకాన్ని ఎత్తేశారు. ప్రకృతి వ్యవసాయం పేరుతో సేంద్రీయ వ్యవసాయాన్ని నాడు ప్రోత్సహిస్తే.. నేడు పాతరేశారు. ప్రతి విషయంలోనూ రైతు సమస్యలను తుంగలో తొక్కుతూ రైతులను బలిపీఠం ఎక్కించారు.
ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3 వేల కోట్లు, ప్రకృతి విపత్తుల సహాయ నిధి కింద ఏర్పాటు చేస్తానన్న రూ. 4 వేల కోట్లకు అతీగతీ లేదు. పంటలకు గిట్టుబాటు ధర, సున్నా వడ్డీ రుణాలు, పంట బీమా, ఇన్‌పుట్ సబ్సీడీ అమలులో వైఫల్యంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రూ. 22 వేల కోట్లు నష్టపోయారు. ఒక్కో రైతుకు రూ. 1.80 లక్షల నష్టం జరిగింది. చంద్రబాబు హయాంలో పంట నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ. 20 వేల ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించగా జగన్ రెడ్డి రూ. 15 వేలకే పరిమితం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు 37 లక్షల ఎకరాల్లో పంట నష్టపోతే, కేవలం 11 లక్షల ఎకరాలకే అరకొరగా ఇన్‌పుట్ సబ్సిడీ అందించారు. రాయలసీమ రైతులకు ఎలాంటి సాయం అందలేదు. రాయలసీమ, ఇతర మెట్టప్రాంతాల్లో వ్యవసాయానికి వరప్రసాదిని డ్రిప్ ఇరిగేషన్‌ను అటకెక్కించారు. రాయితీపై అందించే సూక్ష్మిపోషకాలు, ఎరువులు పంపిణీని నిలిపేశారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికే తంటాలు పడుతున్న జగన్ రెడ్డి.. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తే.. రైతులకు బిల్లులు ఏ విధంగా చెల్లిస్తారు ? మధ్యలో చెల్లించడం మానేస్తే వారి గతేంటి? చంద్రన్న పాలనలో రైతు రుణమాఫీ కింద 58.29 లక్షల మందికి రూ. 15,279 కోట్లు చెల్లింపులు చేస్తే. జగన్ రెడ్డి పాలనలో రైతు రుణమాఫీ పథకాన్ని రద్దు చేశారు. చంద్రన్న పాలనలో అన్నదాత సుఖీభవ కింద రూ. 15 వేలు ఒకే విడత చెల్లింపులు చేస్తే.. జగన్ రెడ్డి పాలనలో రూ. 13,500 ఇస్తామని చెప్పి 3 దఫాలుగా రూ. 7,500 మాత్రమే చెల్లిస్తున్నారు. రైతు భరోసా లబ్ధిదారులను కుదించేందుకు ప్రయత్నిస్తున్నారు
అనంతపురం జిల్లా
రాయదుర్గంలో పార్లమెంట్ అధ్యక్షులు కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిరసనలు చేశారు. రాయదుర్గం టీడీపీ కార్యాలయం నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు రైతులు, కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో రైతులకు మద్దతు ధర కల్పించాలని కోరుతూ ఎద్దుల బండిపై ర్యాలీ నిర్వహించి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. టీడీపీ కార్యాలయం నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసిల్దార్‌కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ ర్యాలీలో పెద్దఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెనుగొండలో టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు బి.కె పార్ధసారధి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. రైతులతో కలిసి పంటల గిట్టుబాటు ధరలు, వ్యవసాయ మోటార్లకు మీటర్లు వంటి సమస్యలపై పెనుగొండ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. హిందూపురంలో నియోజకవర్గ నాయకులు రైతు సమస్యలు పరిష్కరించాలని కూరగాయలు రోడ్డుపై పడవేసి, నాగలి చేతపట్టి ఎడ్ల బండితో ర్యాలీగా వెళ్ళి తహశీల్దార్ కు వినతిపత్రం ఇచ్చారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇన్‌చార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు ఆద్వర్యంలో నిరసనలు చేపట్టారు. ఎడ్లబండిపై ర్యాలీగా వెళ్ళి తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. శింగనమల నియోజకవర్గంలో ఇన్‌చార్జ్ బండారు శ్రావణీ శ్రీ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ముందు బైటాయించారు. పుట్టపర్తిలో ఇంచార్జి పల్లె రఘునాద్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యలయం నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్ళి వినతిపత్రం ఇచ్చారు , అనంతపురం రూరల్ టిడిపి నాయకుల ఆధ్వర్యంలో రూరల్ తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. మడకశిర ఇన్‌చార్జ్ ఈరన్న ఆధ్వర్యంలో టీడీపీ నేతలు ర్యాలీగా వెళ్ళి తహశీల్దార్ కు వినతపత్రం ఇచ్చారు. తాడిపత్రి పార్లమెంట్ రైతు ప్రధాన కార్యదర్శి యుగంధర్, కౌన్సిలర్లు ర్యాలీ నిర్వహించారు.
కర్నూలు జిల్లా:
కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు మండల కేంద్రంలో “రైతు కోసం తెలుగుదేశం” పేరుతో తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడు గౌరు వెంకట రెడ్డి, పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డిల ఆధ్వర్యంలో ఆందోళనలు చేశారు. ర్యాలీ ప్రదర్శన నిర్వహించి రైతుల పట్ల ప్రభుత్వ తీరును ఖండించారు. పత్తికొండ నియోజకవర్గంలో పార్లమెంట్ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ముందు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ కూరగాయలను నేలపై పోసి నిరసన తెలిపారు. ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తన నివాసం నుండి రైతులతో కలసి ట్రాక్టర్లలతో తహశీల్దార్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి వినతిపత్రం అందించారు. బనగానపల్లెలో మాజీ ఎమ్మెల్యే బి.సి జనార్థన్ రెడ్డి సంజామల గ్రామంలో మూడు రోజుల క్రితం కురిసిన వర్షాలకు దెబ్బతిన్న వరి పొలాలను సందర్శించారు. డోన్‌లో ఎమ్మెల్సీ, ఇన్‌చార్జ్ కే.ఈ ప్రభాకర్ కార్యకర్తలు, రైతులతో కలసి డోన్ పాత బస్టాండు నుంచి తహశీల్దార్ కార్యాలయానికి భారీ ర్యాలీగా వెళ్లారు. రైతు సమస్యలు పరిష్కారం కోరుతూ ఎమ్మిగనూరు శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో టీడీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సద్బుద్ధి ప్రసాదించి రైతులను వెంటనే ఆదుకోవాలని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా చూడాలని దేవుడిని కోరుకున్నారు. ఆలూరు ఇన్‌చార్జ్ కోట్ల సుజాతమ్మ ఆధ్వర్యంలో రైతులు, కార్యకర్తలు ర్యాలీగా వెళ్ళి అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు.
కడప జిల్లా :
కమలాపురం నియోజకవర్గం, చెన్నూరు మండలం, చెన్నూరు గ్రామంలో కేసీ కెనాల్ ఆయకట్టు కింద సమృద్ధిగా నీరు ఉన్నప్పటికీ ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోవడం, పెట్టుబడి అధికమవడంతో సుమారు 1200 ఎకరాలల్లో క్రాప్ హాలిడే ప్రకటించారు. ఆయా వ్యవసాయ భూములను పార్లమెంట్ అధ్యక్షులు మల్లెల లింగారెడ్డి.. రైతులతో కలిసి పరిశీలించారు. కడప నియోజకవర్గంలో ఇన్‌చార్జ్ అమీర్‌బాబు ఆధ్వర్యంలో అరటి గెలలు భుజం మీద పెట్టుకుని, చెవిలో పూలు పెట్టుకోని… రైతుల చెవుల్లో పూలు పెట్టిన జగన్ రెడ్డి అంటూ వినాదాలు చేశారు. సెవన్ రోడ్ సర్కిల్ నుంచి తహశీల్దార్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్ళి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. బద్వేల్‌లో టీడీపీ నాయకులు రెడ్యం వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నేలపై కూరగాయలు పోసి నిరసన తెలిపారు. పులివెందులలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో రైతు సమస్యలను పరిష్కరించాలని పడా కార్యాలయంలో కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.