Suryaa.co.in

Features

మహోత్సవం అని మురిసిపోమంటావా?.. మనస్సాక్షిని చంపుకోమంటావా?

– పాఠాలు నేర్పేవాడు గుణపాఠాలు నేర్చుకోలేడా?
– సన్మానాలూ సత్కారాలు సరే.. సేలరీ సంగతేంటి?..
– నిమిషమే మాష్టారూ నీకు ఈ ‘హ్యాపీ టీచర్స్ డే’లు
– గురుపూజోత్సవ నవరత్నాలు

గురువంటే చీదరింపు
గురువంటే చిన్నచూపు
గురుపూజోత్సవానికి మాత్రం
ఘనమైన ఏర్పాటు
ఇదంతా
గురువుకోసమేనంటావా
గురువా?…

సంవత్సరమంతా షోకాజులు
స్టేజి మీద సోకేజీలు
గురుపూజోత్సవ శుభాకాంక్షలు

“పని దొంగవి నీవు” అని
ప్రచారం చేస్తారొక
ప్రిన్సిపల్ సెక్రటరీగారు
“పనిలేదు నీతో” అన్నట్లు
ప్రకటనలిచ్చేస్తారు మరో
ప్రిన్సిపల్ సెక్రటరీగారు
పని గట్టుకొని మరీ
పూజోత్సవాలు జరిపిస్తారు
ప్రభుత్వంవారు
ప్రేమే అంటారా
మేష్టారూ ఇదంతా?

నిత్యం తనిఖీలు
నిత్యం తాఖీదులూ
నిత్యం అరెస్టులు
నిత్యం బైండోవర్లు
నిత్యం తిట్లు
నిత్యం చీవాట్లు
నిమిషమే మాష్టారూ
నీకు
ఈ ‘హ్యాపీ టీచర్స్ డే’లు

అడ్డదారి బదిలీలు
అడ్డుగోలు సిఫార్సులు
ఆత్మ సాక్షిని అమ్ముకున్నోళ్ళకే
అవార్డుల ఆహ్వానాలు

గుడ్డ శాలువా ముక్కకోసం
గురువు
గడ్డి తినడం మొదలుపెట్టాడు
మహోత్సవం అని
మురిసిపోమంటావా?
మనస్సాక్షిని
చంపుకోమంటావా?

మెడలో పడుతున్న
మెడల్ ని చూసి
మురిసిపోకు
మూడు నెలలుగా
జీతం లేదన్న సంగతి
మర్చిపోకు

సన్మానాలూ సత్కారాలు సరే
సేలరీ సంగతేంటి?..
సగం నెల ఎదురుచూపుల్లోనే
సాగిపోతోంది..

ముందు నుండి
ముత్యాల హారాలు
వెనక నుండి
వెన్నుపోట్లు
చీకటి వెలుగులేవో
చితి మంటల సెగలేవో
గుర్తించలేనంత
గుడ్డితనంలో ఉన్నారా
గురువులు?
పాఠాలు నేర్పేవాడు
గుణపాఠాలు నేర్చుకోలేడా?

గురు పూజోత్సవ శుభాకాంక్షలతో

– వేణుమాధవ్ ఎస్

LEAVE A RESPONSE