– జగన్ పై చెల్లెమ్మల జంగ్
– హంతకులను జగనన్న కాపాడుతున్నాడంటూ ఆరోపణ
– అవినాష్ హంతకుడంటూ ఫైర్
– రోజూ అదే ఆరోపణల ప్రచారం
-హంతకులు కావాలా? వైఎస్ బిడ్డ కావాలా అని ప్రశ్నలు
– కొంగుపట్టుకుని అడుగుతున్నానని షర్మిల, సునీత అభ్యర్థన
– మాకు న్యాయం చేయాలని ప్రజలకు అర్ధింపు
– సునీత,షర్మిల సెంటిమెంట్ డైలాగులకు కరిగిపోతున్న మహిళలు
– ఆడబిడ్డల ఆక్రోశంతో మహిళల కంట కన్నీరు
– ఆడబిడ్డలు రోడ్డెక్కారంటూ సానుభూతి
– షర్మిల సభకు పోటెత్తుతున్న మహిళాలోకం
– ఫలిస్తున్న జగన్-అవినాష్ పై చెల్లెమ్మల విమర్శలు
– వైసీపీ కొంపముంచుతున్న షర్మిల, సునీత ప్రచారం
– కడప, పులివెందుల, జమ్మలమడుగులో షర్మిలకు క్రాస్‌ఓటింగ్
– జగన్ కోట బద్దలవుతుందా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
కడప.. ఆ గడపలో వైఎస్ కుటుంబానికి తప్ప మరొకరికి చోటుండదు. ఎవరైనా వైఎస్-వివేకా ద్వయం ముందు ఓడిపోవల్సిందే. ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రులైనప్పటికీ.. కడపను మాత్రం టచ్ చేయలేకపోయారు. అది కడప ఎంపీ అయినా, పులివెందుల అసెంబ్లీ అయినా సరే! టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ.. అంటే వైఎస్ కుటుంబానిదే హవా.
అలా తిరుగులేని కోట నిర్మించుకున్న, వైఎస్ ఫ్యామిలీ నుంచి బయలుదేరిన ఇద్దరు సివంగులు.. ఇప్పుడు స్వయంగా వైసీపీ అధినేత జగన్ తన అధికార బలంతో నిర్మించుకున్న కోటను బద్దలు కొట్టేందుకు మండుటెండల్లో బయలుదేరారు. అన్నయ్యను విమర్శల వర్షంతో చెమటలు పట్టిస్తున్నారు. జగనన్న మేం సిద్ధం పేరుతో ఏసీ బస్సులో తిరుగుతుంటే.. చెల్మెమ్మలయిన షర్మిల-సునీత మాత్రం మండుటెండలో చ మటలు కారుస్తూ దీనంగా ఓట్లు అభ్యర్థించడమే విశేషం.
పేలుతున్న సెంటిమెంట్ డైలాగులు
మీ రాజశేఖర రెడ్డి, వివేకానందరెడ్డి బిడ్డలం… మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం…మీరే న్యాయం చేయండి….!. బాబాయ్‌ను చంపిన అవినాష్‌రెడ్డి, అతనిని కాపాడుతున్న జగన్ అన్నయ్య పార్టీ కావాలా? చెల్లెళ్లను వెళ్లగొట్టిన అన్నయ్య వైసీపీ కావాలా? న్యాయం కోసం నడిరోడ్డులో నిలబడ్డ ఈ వైఎస్ బిడ్డ కావాలా? న్యాయం
కావాలా?గొడ్డలితో నరికేసే హంతకులు కావాలా? అంటూ పేలుస్తున్న భారీ సెంటిమెంటు డైలాగులకు, కడప గడపలోని మహిళాలోకం కన్నీరుకారుస్తోంది. మా మద్దతు మీకేనంటూ చేయెత్తి జై కొడుతోంది. షర్మిల-సునీత జమిలిగా బయలుదేరిన ఎన్నికల జైత్రయాత్రకు, మహిళాలోకం హారతులు పడుతోంది. ఫలితంగా వైఎస్-వివేకా దశాబ్దాల నుంచి కష్టపడి నిర్మించిన కడప కోట.. బద్దలయ్యే ప్రమాదఘంటిక స్పష్టంగా కనిపిస్తోంది. వినిపిస్తోంది. ఇదీ ఇప్పుడు కడప జిల్లాలో ఎన్నికల మహిళా సెంటిమెంటు దృశ్యం.
కడపను కంచుకోటగా మార్చిన వైఎస్ బ్రదర్స్ కుటుంబమే, ఇప్పుడు ఆ కోటను బద్దలు చేసేందుకు బరిలోకి దిగింది. కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న వైఎస్ బిడ్డ, పీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి, తన జగనన్న నిలబెట్టిన వైసీపీ సిట్టింగ్ ఎంపీ అవినాష్‌రెడ్డి ఓటమి ధ్యేయంగా ‘శ్రమ’టోడుస్తున్నారు. షర్మిల ఎన్నికల ప్రచారంలో వివేకా బిడ్డ డాక్టర్ సునీత కూడా ఉండటంతో సెంటిమెంట్ పండుతోంది. ఇద్దరి సెంటిమెంటు డైలాగులు మహిళల హృదయాలను తాకుతున్నాయి. తండ్రి లేని ఇద్దరు ఆడబిడ్డల ప్రసంగానికి మహిళలు విపరీతంగా స్పందిస్తున్నారు. వారి సభలకు పురుషులకంటే మహిళలే ఎక్కువ సంఖ్యలో రావడం గమనార్హం.
హంతకులు కావాలా? వైఎస్ బిడ్డ కావాలా?
షర్మిల-సునీత తమ ప్రచారంలో నేరుగా అవినాష్‌రెడ్డిని హంతకుడనే సంబోధిస్తున్నారు. ఇది మహిళలల్లో బలంగా నాటుకుపోతున్న అస్త్రంగా కనిపిస్తోంది. హంతకుడికి జగనన్న మద్దతునిస్తున్నాడని దుమ్మెత్తిపోస్తున్నారు. ‘‘నేను మీ రాజన్న బిడ్డను. మీ కడప ఆడబిడ్డగా కొంగుచాచి అర్ధిస్తున్నా. మాకు మీరే న్యాయం చేయండి. చిన్నాన్న వివేకా హంతకులు కావాలా? న్యాయం కోసం మీ ముందు నిలబడ్డ మీ ఆడబిడ్డలు కావాలా? నేను వైఎస్‌కు నిజమైన వారసురాలిని. జగనన్న కాదు. వైఎస్ చివరివరకూ ఉన్న కాంగ్రెస్‌లో నేనుంటే, నాన్న పేరుతో పార్టీ పెట్టుకుని, ఆయన ఆశయాలను సమాధి చేసిన జగన్ వైఎస్‌కు ఎలా వారసుడవుతాడు?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తోన్న షర్మిల ప్రసంగానికి, మహిళల నుంచి సానుభూతి-స్పందన వెల్లువెత్తుతోంది.
ఆడబిడ్డలకు మహిళల సానుభూతి
షర్మిల-సునీత ఇద్దరూ తండ్రి లేని బిడ్డలు కావడం, మాకు మీరే న్యాయం చేయాలంటూ దీనంగా కొంగుచాచి ఓట్లు అడుగుతున్న దృశ్యాలు, మహిళలకు కన్నీరు తెప్పిస్తున్నాయి. షర్మిల వాహనం దిగిన సమయంలో.. ఆమెను మహిళలే ఎక్కువగా కలిసి, మద్దతు ప్రకటిస్తున్నారు. మీ వెనుక మేమున్నామని భరోసా ఇస్తున్నారు. వృద్ధులయితే షర్మిలకు ముద్దులు పెట్టి ఆశీర్వదిస్తున్నారు.
షర్మిల-సునీత ప్రచారాంశాలు, వివేకా హంతకుడు అవినాషేనన్న వారి ఆరోపణలు ఈపాటికే కడప గడపకు చేరి, చర్చనీయాంశంగా మారాయి. తాజా పరిణామాల బట్టి కడప ఎంపీ పరిథిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో.. కాంగ్రెస్‌కు పెద్దగా బలం లేకపోయినా, వ్యక్తిగతంగా.. అంటే వైఎస్ బిడ్డగా ఆమెకు మహిళల ఓట్లు మాత్రం భారీ సంఖ్యలో పోలవడ ం ఖాయంగా కనిపిస్తోంది. ఇది వైసీపీ అభ్యర్ధి అవినాష్‌రెడ్డికి ప్రత్యక్షంగా , అన్న జగన్‌కు పరోక్షంగా చెమటలు పట్టించే అంశమేనని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
క్రాస్ ఓటింగ్‌తో కొంపమునిగేదెవరికి?
కాగా తాజా సమాచారం ప్రకారం.. పులివెందుల అసెంబ్లీలో భారీగా క్రాస్‌ఓటింగ్ జరిగే అవకాశం కనిపిస్తోంది. అది ఎంపీకి షర్మిల వైపే ఉండేలా స్పష్టమవుతోంది. ఇక కడప అసెంబ్లీలో కూడా భారీ స్థాయిలో క్రాస్‌ఓటింగ్ జరగవచ్చు. ఇక్కడ ముస్లింలు షర్మిల వైపే ఉన్నారు. అంజాద్‌బాషాపై వ్యతిరేకత కూడా దానికి ఒక కారణమంటున్నారు. ఇక వైఎస్ కుటుంబానికి బలం ఉన్న జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎంపీ షర్మిల వైపు మొగ్గు కనిపిస్తోంది. ప్రొద్దుటూరు, బద్వేలులో మాత్రం అవినాష్‌కు మొగ్గు కనిపిస్తోంద ంటున్నారు.
అయితే ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యేపై విపరీతమైన ఆరోపణలుండటం, సీనియర్ నేత వరదరాజులు రెడ్డికి ప్రజాభిమానం పోటెత్తుతుండటం, మైదుకూరులో మాజీ మంత్రి డీఎల్ టీడీపీకి మద్దతు ప్రకటిస్తుండటంతో ఆ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ బలంగా కనిపిస్తోంది. అక్కడ టీడీపీ గెలుపు ఖాయమంటున్నారు. కమలాపురం నియోజకవర్గంలో కూడా ఎంపీకి మాత్రం షర్మిల వైపే మొగ్గు కనిపిస్తోంది. కానీ అసెంబ్లీలో టీడీపీ-వైసీపీ పోటాపోటీగా ఉన్నాయి.
ప్రస్తుతానికి కడప పార్లమెంటు పరిధిలో.. షర్మిలకు పులివెందుల, జమ్మలమడుగు, కడప అసెంబ్లీ నియోజకవర్గాలు పూర్తి అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరులో ఆమెకు పెద్దగా ఓట్లు పడే అవకాశాలు లేవంటున్నారు. మొత్తంగా కడప పార్లమెంటు పరిథిలో ముస్లిం-క్రైస్తవులు షర్మిలకు ఏకపక్షంగా ఓటు వేసే అవకాశాలు లేకపోలేదు.
ప్రధానంగా కడప, పులివెందుల, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో ఆమెపక్షాన భారీ స్థాయిలో క్రాస్‌ఓటింగ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే నిజమైతే టీడీపీ-వైసీపీ-కాంగ్రెస్ మధ్య పోరులో.. కాంగ్రెస్ లేదా టీడీపీ మాత్రమే గెలిచే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.