Suryaa.co.in

Andhra Pradesh

చట్టం వినియోగానికి సాంకేతిక పరిజ్ఞానం జోడించాల్సి ఉంది

• వినియోగదారుల హక్కుల చట్టంపై ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాలి
• గ్రామ, పట్టణ స్థాయిల్లో విద్యార్థులకు చట్టంపై అవగాహన కల్పించాలి
• 24 గంటల్లోపే రైతు ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమ
• దిగ్విజయంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ
– నాదెండ్ల మనోహర్, ఆహారం, పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రి

విజయవాడ: వినియోగదారుల హక్కుల చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకుంటే జరిగే మోసాలను సులువుగా అరికట్టవచ్చని ఆహారం, పౌరసరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.. తుమ్మలపల్లి కళా క్షేత్రంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్బంగా వినియోగదారుల హక్కు చట్టంపై రాష్ట్రస్ధాయి అవగాహన సదస్సును మంగళవారం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ వినియోగదారుల హక్కులతోపాటు సౌకర్యాలు గురించి, అవగాహన తీసుకురావలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవ చట్టంలో ప్రతి ఏడాది అనేక మార్పులు తీసుకుంటున్నామన్నారు.

మారుతున్న పరిస్థితుల ధృష్ట్యా సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో ఈ చట్టం పై ప్రజల్లో అవగాహన లేదన్నారు. వినియోగదారులకు ఈ చట్టం పై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందన్నారు. ఈ ఏడాది వినియోగదారుల న్యాయపాలనకు వర్చువల్ విచారణలు మరియు డిజిటల్ సౌలభ్యం ఇతివృత్తంగా తీసుకున్నారన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ఇబ్బందులను గుర్తించి వాట్సాప్ ద్వారా రైతుల వద్ద నుండి 22,80,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి వారికి 48 గంటల్లో నగదు వారి ఖాతాల్లో జమ అయ్యే విధంగా ఏర్పాటు చేశామన్నారు. కాని అనుకున్న దానికన్నా ముందుగానే రైతుల ఖాతాల్లో 24 గంటల్లోనే రూ. 5,300 కోట్లు జమ చేసామన్నారు. అదేవిధంగా దీపం-2 పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ పంపిణీ చేసినప్పుడు అనేక ఇబ్బందులు ఉన్నా, వినియోగదారులకు అనుకున్న సమయానికే 75,00,000 ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తున్నామన్నారు.

ఫుడ్ కమీషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ పేద బలహీన వర్గాలను ఆదుకునే విధంగా వినియోగదారుల చట్టంలో మార్పులను పొందుపరిచారన్నారు. వినియోగదారుడికి నష్టం జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకువచ్చినాయన్నారు. ఏ చిన్న విషయంలో అయినా వినియోగదారుడు నష్టపోతే ఫిర్యాదు చేయవచ్చునన్నారు.

పౌర సరఫరాల శాఖ కమిషనర్ జి. వీరపాండ్యన్ మాట్లాడుతూ.. ప్రతీ ఏడాది వినియోగదారుల హక్కుల కోసం అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. వినియోగదారుల హక్కులపై అవగాహనా కోసం అనేక అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అనేకమైన పోటీలు నిర్వహించామన్నారు. వినియోగదారుల హక్కులను విరివిగా తీసుకువెళ్ళడానికి టెక్నాలజీని ఆయుధంగా వాడుకోవాలని, ప్రతీ ఒక్కరి భాగస్వామ్యం ఇందులో ఉండాలన్నారు.

జిల్లా వినియోగదారుల ఫోరమ్ చైర్మన్ చిరంజీవి మాట్లాడుతూ వినియోగదారులు హక్కులతో పాటుగా బాధ్యతలు కూడా తీసుకోవాలన్నారు. రెండున్నర సంవత్సరాల్లో జిల్లాలో రూ. 7 కోట్ల పరిహారాన్ని అందించామన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నిధి మీనన్, బిఐఎస్ జేడి రమాకాంత్, సివిల్ సప్లైస్ అధికారులు ప్రసాద్, పాపారావు, లక్ష్మీనారాయణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE