హౌసింగ్ సొసైటీకి భూములివ్వని కేసీఆర్ సర్కారును ఎందుకు నిలదీయరు?
జర్నలిస్ట్ సంఘ ముసుగులో కొత్త పెత్తందార్లు
త్వరలో జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు
– సి.ఆర్ ఎపి మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యలను పరిష్కరించే అవకాశం ఉందని సి.ఆర్.ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు.ఆయన ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. కొన్ని జర్నలిస్టు సంఘాల నేతలు డిమాండ్ల ముసుగులో కొత్త పెత్తందార్ల అవతారం ఎత్తినట్లు కనిపిస్తోందని, ప్రతిపక్ష రాజకీయ పార్టీలతో కలిసి సదస్సులు పెట్టడం ద్వారా వారి అసలు ఎజెండాను బయటపెట్టుకున్నట్లయిందని ఆయన వ్యాఖ్యానించారు.
జర్నలిస్టులకు సంబంధించి ఇప్పటికే కొన్ని సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం జరిగిందని, ఉదాహరణకు అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు వంటివి ఇందులో ఉన్నాయని ఆయన తెలిపారు.వీటిలో ఏవైనా ఇబ్బందులు ఉంటే సమాచారశాఖ కమిషనర్ ను సంప్రదించవచ్చని అన్నారు. ఇళ్ల స్థలాలకు సంబంధించి కూడా జగన్ త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోవచ్చని, తద్వారా జర్నలిస్టులకు శుభవార్త తెలపవచ్చని ఆశిస్తున్నానని కొమ్మినేని చెప్పారు.
ఇప్పటికే 98.5 శాతం హామీలు నెరవేర్చడమే కాకుండా, 31 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన జగన్ ప్రభుత్వం కొద్దివేల మంది జర్నలిస్టులకు స్థలాలు ఇవ్వకుండా ఉండదని, కాని దీనికి సంబంధించి విధి,విధానాలపై ఆలోచన చేస్తున్నారని ఆయన తెలిపారు.నిజానికి ఇప్పటికే పలు చోట్ల ప్రభుత్వ స్కీములలో ఇళ్ల స్థలాలు పొందిన జర్నలిస్టులు కూడా ఉన్నారన్న సంగతి తన పర్యటనలలో తెలిసిందని ఆయన అన్నారు.
ఇదే సమయంలో కొన్ని దుష్టశక్తులు ప్రభుత్వం చేసే ఏ పనిపైన అయినా విషం చిమ్ముతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.జర్నలిస్టుల కోసం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఈ దుష్టశక్తులే అడ్డంకిగా మారుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. కొందరు జర్నలిజంలో కూడా పెత్తందారులుగా మారి తమ జులుం ప్రదర్శించాలని చూస్తున్నారని ఆయన అన్నారు. కొన్ని పత్రికలు, టీవీ చానళ్లు అడ్డగోలుగా వార్తలు ఇస్తున్నా, ప్రభుత్వంపై నీచమైన స్థాయిలో అసత్యాలతో సంపాదకీయాలు రాస్తున్నా జర్నలిస్టు సంఘాలు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కొందరు మీడియా యజమానులు జర్నలిజం విలువలకు పాతర వేస్తూ నగ్నంగా తిరుగుతుంటే ఈ యూనియన్ల నేతలు, జర్నలిస్టులలో పెత్తందారులుగా తయారైనవారు కనీసం నోరెత్తలేకపోతున్నారని కొమ్మినేని మండిపడ్డారు. తెలంగాణ కు సంబంధించిన ఒక బూర్జువా విప్లవవీరుడు ఎపికి వచ్చి ఇక్కడ ప్రజాస్వామ్యం లేదని సుద్దులు చెబుతున్నారని, తెలంగాణలో ప్రభుత్వాన్ని విమర్శించిన కొందరు జర్నలిస్టులను అరెస్టు చేస్తే కనీసం ఖండించలేని ఈ విప్లవకారుడు ఎపిలో రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.
తెలంగాణలో సుప్రింకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా హౌసింగ్ సొసైటీకి అక్కడి ప్రభుత్వం తగు ఉత్తర్వులు ఇవ్వకపోవడంపై అసంతృప్తి ఉందని, మరి దాని గురించి ఈయన ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారని కొమ్మినేని అడిగారు. ఎపిలో ప్రజాస్వామ్యం , పత్రికా స్వేఛ్చ చాలా ఎక్కువగా ఉన్నాయి కనుకే కొన్ని పత్రికలు, టీవీలు, యధేచ్చగా నోటికి వచ్చిన దుష్టభాషతో వార్తాకధనాలు, సంపాదకీయాలు ఇవ్వగలుగుతున్నాయని , ప్రజల మనసులలో విషం నింపాలని చూస్తున్నాయన్న సంగతి గుర్తించాలని ఆయన అన్నారు.
తమ మీడియా సంస్థలలో జీతాలు ఇవ్వకపోయినా, ఉద్యోగులను ఇష్టారీతిన తొలగించినా కనీసం నోరు విప్పని కొందరు జర్నలిస్టు నేతలు, ప్రతిదానికి ఏపీ ప్రభుత్వంపై విమర్శలు మాత్రం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.చివరికి తమ సంస్థ యాజమాన్యాలు చేయవలసిన పనులు కూడా ప్రభుత్వమే చేయాలని వీరు కోరుకోవడంలోనే పరిస్థితి ఏమిటో అర్ధం అవుతుందని అన్నారు. చిన్న పత్రికలకైనా, పెద్ద పత్రికలకైనా కొన్ని నిబంధనలు పెట్టకపోతే ప్రభుత్వ రాయితీలు ఎలా దుర్వినియోగం అవుతాయో అందరికీ తెలుసునని అన్నారు.
కొన్ని ప్రతిపక్ష పార్టీల నేతలను తీసుకు వచ్చి ప్రభుత్వాన్ని తిట్టించడం ద్వారా ఈ సంఘాలు జర్నలిజం ముసుగులో టిడిపి ఎజెండా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉందని అన్నారు. చంద్రబాబు పాలనకు సర్టిఫికెట్ ఇచ్చిన ఆ బూర్జువా విప్లవకారుడు ఆ రోజుల్లో కొందరు జర్నలిస్టుల ఉద్యోగాలకు ఎసరు పెట్టినా ఖండించలేదని, కొన్ని టీవీ చానళ్లను చంద్రబాబు ప్రభుత్వం నిషేధించినా నోరెత్తలేదని, పైగా ఇప్పుడు అదే బాగుందని అంటున్నారని , ఇందులో ఉన్న రాజకీయ దురుద్దేశాన్ని అంతా అర్ధం చేసుకోవాలని కొమ్మినేని అన్నారు.
జర్నలిస్టు సంఘాలు తమ సమస్యలను ప్రభుత్వానికి చెప్పడం తప్పుకాదని, అదే సమయంలో సంయమనంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.. అలాకాకుండా ఏవో కొన్ని రాజకీయ పక్షాల ప్రయోజనం కోసం జర్నలిస్టు సంఘాలు ప్రయత్నిస్తే అది జర్నలిజానికి మరింత మచ్చ తెస్తుందని కొమ్మినేని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.