Suryaa.co.in

Telangana

22న ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు

– మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఈ నెల 22 వ తేదీన ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం ట్యాంక్ బండ్ వద్ద గల 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, DGP అంజనీ కుమార్, ఆర్ అండ్ బి కార్యదర్శి శ్రీనివాసరాజు లతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్బంగా మంత్రి ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్బవించి 10 వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్బంగా ఈ నెల 2 నుండి 22 వ తేదీ వరకు దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 22 వ తేదీన నగరంలోని అన్ని నియోజకవర్గాల నుండి పెద్ద సంఖ్యలో బైక్ ల పై ర్యాలీగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుంటారని చెప్పారు. అనంతరం వేలాదిమంది కళాకారులు నృత్యాలు, డప్పు చప్పుళ్ళు, వివిధ వేష ధారణలతో ర్యాలీగా వేలాదిమంది ప్రజలతో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదురుగా నిర్మించిన అమరవీరుల స్మారక కేంద్రం వద్దకు చేరుకోవడం జరుగుతుందని వివరించారు.

ర్యాలీ చేరుకున్న అనంతరం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్మారక కేంద్రాన్ని ప్రారంభించి అక్కడే ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారని తెలిపారు. తదనంతరం గడిచిన 9 సంవత్సరాలలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయాలు, అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించే విధంగా 750 డ్రోన్ లతో భారీ డ్రోన్ షో నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.

ప్రజలు డ్రోన్ షోను వీక్షించే విధంగా ట్యాంక్ బండ్ పై ఆరోజు సాయంత్రం రాకపోకలు నిలిపివేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అమయ్ కుమార్, సమాచార శాఖ కమిషనర్ అశోక్ రెడ్డి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ, పలువురు DCP లు, ACP లు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE