-ముఖ్య అతిధిగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
మెల్‌బోర్న్‌లో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ మాజీ మంత్రి, ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నేత తలసాని శ్రీనివాస యాదవ్ హాజరై వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన కెసిఆర్ పాలన గురించి సుదీర్ఘంగా వివరించారు. “నాడు తెలంగాణలో జరిపిన అభివృద్ధి, రైతులకు మద్దతుగా అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి నిరోధక చర్యలు, ప్రజలను నిరాశకు గురిచేస్తున్న పాలన కొనసాగుతోంది. రైతులు, యువత, ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రజలు ఇప్పుడు కెసిఆర్ పాలన నాటి రోజులను గుర్తు చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరుగులేని విజయం సాధించనుంది” అని ఆశాభావంగా పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కెసిఆర్ గారి పాత్ర అపారమైంది. ఆ తరువాత రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ దేశంలోనే ఒక నమూనా రాష్ట్రంగా తీర్చిదిద్దారు. కానీ ప్రస్తుతం రాష్ట్రం తిరోగమన దిశలో పోతోంది. ప్రజలు దీనిని గమనిస్తున్నారు” అని పేర్కొన్నారు.
యువ నాయకుడు సాయి కిరణ్ యాదవ్ మాట్లాడుతూ, “దేశంలో రెండే రెండు ప్రాంతీయ పార్టీలు 25 ఏళ్లకు పైగా బలంగా కొనసాగాయి. ఆలోచన, సిద్ధాంతాలతో ఏర్పడిన బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ జాబితాలో స్థానం సంపాదించుకుంది. NRI లు రాష్ట్రానికి సహకరించాల్సిన సమయం ఇది. వచ్చే ఎన్నికల్లో ప్రతి NRI లు స్వదేశానికి వచ్చి బీఆర్ఎస్ విజయంలో భాగస్వాములు కావాలి” అని పిలుపునిచ్చారు.
కార్యక్రమానికి ముందు మెల్‌బోర్న్ విమానాశ్రయంలో తలసాని శ్రీనివాస యాదవ్ గారికి ఘన స్వాగతం పలికారు. బీఆర్ఎస్ యూత్ వింగ్ నాయకుడు వినయ్ సన్నీ ఆధ్వర్యంలో జరిగిన ఈ స్వాగత కార్యక్రమం ఎంతో ఉత్సాహభరితంగా జరిగింది.
ఈ వేడుకల్లో బీఆర్ఎస్ నాయకులు ఉదయ్ సింహా రెడ్డి, సతీష్ పులిపాక, కత్తుల వినోద్, హర్ష, సాయికృష్ణ కల్వకుంట్ల, అశోక్ ఈగ, అలాగే స్థానిక సంఘాల నాయకులు, తెలుగు NRIs భారీ సంఖ్యలో పాల్గొన్నారు.