– రౌండ్ టేబుల్ సదస్సులో మేధావుల ఆరోపణ
ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణలో డ్రగ్స్, మత్తు పదార్థాలు, మద్యపానానికి కేంద్రంగా తయారైందని మేధావులు ఆరోపించారు. ఆదివారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన రౌండ్ టేబుల్ సదస్సులో పలువురు మేధావులు పాల్గొని మాట్లాడారు.
ఈ సదస్సులో పాల్గొన్న తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొ. కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి మత్తుపదార్థాల వినియోగం తీవ్రంగా పెరిగిపోయిందని, గ్రామీణ ప్రాంతాలలో వీధి వీధికీ బెల్టు షాపులు కూడా పెరిగిపోయాయని, చాలా మంది పిల్లలు మత్తుకు బానిసలయ్యారని అన్నారు.
ప్రపంచ మత్తు పదార్థాల వ్యతిరేక దినం సందర్భంగా తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ డాక్టర్ బి. కేశవులు అధ్యక్షతన ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సదస్సులో సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి, ప్రజా పక్షం ఎడిటర్ జర్నలిస్ట్ శ్రీనివాస రెడ్డి, ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త శోభా ఇంద్రన్, తెలంగాణ సోషల్ మీడియా ఫోరం అధ్యక్షులు కర్ణాకర్ దేశాయ్, తెలంగాణ బహుజన ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ బాల క్రిష్ణ, అమీర్ పేట కార్పొరేటర్ కేతినేని సరళ, బి.సి స్టడీ ఫోరం రాష్ట్ర చైర్మన్ సాయిని నరేందర్, ప్రైవేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఇండ్ల శ్రీలత, సోషల్ లాయర్స్ ఫోరమ్ చైర్మెన్ శ్రీనివాస్ యాదవ్, టి జే ఎస్ వైస్ ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డీ, సామాజిక వేత్త వెంకట్ రెడ్డీ, బి.సి సంక్షేమ సంఘం నాయకులు దాసు సురేష్, గవర్నమెంట్ డాక్టర్ల జేఏసీ చైర్మన్ డాక్టర్ రమేష్, ప్రభుత్వ రంగ సంస్థల అసోసియేషన్ చైర్మన్, బి రాజేశం. మాజీ జాయింట్ కమిషనర్ రవీంద్ర. సంగీత దర్శకులు విష్ణు కిషోర్, సామాజిక వేత్త ప్రొఫెసర్ దొంతి నరసింహారెడ్డి బహుజన జాగృతి నాయకురాలు శారద, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం నాయకులు విటల్ జర్నలిస్ట్ పార్థసారధి రెడ్డి, రాజ్యాంగ పరిరక్షణ వేదిక కన్వీనర్ కామేశ్వర రావు, డాక్టర్ షోయబ్, సాగ్రా బేగం, దయాకర్ రెడ్డి, న్యాయవాది శారద, పి.జె సూరే, దయకర్ రెడ్డి, శ్రీకాంత్ గౌడ్, పిట్టల రవి, ఫణికుమార్ తదితరులు పాల్గొని మాట్లాడారు.
తెలంగాణ మేధావుల చైర్మెన్ డాక్టర్ బి కేశవులు మాట్లాడుతూ పిల్లలు, యువతను అనారోగ్యాన్ని కల్గించే మత్తు పదార్థాల నుంచి మన ఆరోగ్య హక్కును కాపాడవలసిన అవసరం ఉందన్నారు. మాదక ద్రవ్యాలు అనగా మానవ శరీరానికి మిక్కిలి హాని కలిగించే పదార్ధాలనీ, మాదక ద్రవ్యాల వాడకం అత్యంత ప్రమాదకరమైన వ్యసనమనీ ఈనాటి యువతరాన్ని దారి మళ్ళించిన ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాల కన్నా డ్రగ్స్ తీవ్రమైనవని, ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 5.6 శాతం జనాభా అలవాటు పడగా. ఇండియా లో 2.1 % శాతానికి పైగా మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు చెప్పారు.
ప్రజా పక్షం ఎడిటర్, జర్నలిస్ట్ శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ మత్తుపదార్థాల వ్యవహారము దేశంలో అతి పెద్ద భయంకరమైన సమస్యగా మారిపోయిందని రాష్ట్రం మొత్తం మద్యం ఏరులై పారిపోతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బి.సి స్టడీ ఫోరం రాష్ట్ర చైర్మన్ మాట్లాడుతూ మద్యపాన వ్యసనాన్ని, మత్తు పదార్థాల వాడకాన్ని ప్రభుత్వాలు సామాజిక సమస్యగా చూడాలని, ప్రజల ఆరోగ్యాలను నాశనం చేస్తున్న మద్యపానాన్ని నిషేధించాల్సిన ప్రభుత్వం వాడ వాడలా బెల్ట్ షాపులు పెట్టు ప్రజల చేత మద్యం తాగిస్తూ ఆర్ధికంగా, ఆరోగ్యంగా తీవ్ర నష్టం చేస్తున్నారని అన్నారు. దేశంలోని బీహార్, గుజరాత్ రాష్ట్రాల్లో మధ్య నిషేధం ఎందుకు సాధ్యం కాదని అన్నారు. ప్రభుత్వం మధ్యపాన్నాని ప్రధాన ఆర్ధిక వనరుగా చూడడం దుర్మార్గమని అన్నారు.
మద్యపానం పట్ల వివిధ రాజకీయ పార్టీలు వారి వైఖరిని తెలపాలని డిమాండ్ చేశారు. 1993 లాగా మరోసారి మద్యపాన నిషేధ ఉద్యమం చేయడానికి మేధావులు, ఉద్యమకారులు ప్రజలను సిద్ధం చేయాలని అన్నారు.