Suryaa.co.in

Features

ఈ నేల మనదిరో..ఊరు మనదిరో..!

తెలంగాణ విమోచనమొక
చరిత్ర అయితే
అందులో రాయని పుటలెన్నో..
ఆలపించని పాటలెన్నో..
తెలియని యోధులెందరో..
నిజాము కర్కసాల నెత్తుటి మడుగుల మాటున
చెరిగిపోయిన నిజాలెన్నెన్నో!

ఆకృత్యాలే నిత్యకృత్యాలై
నలిగిన నేలపై..
పడే ప్రతి చినుకు
రుధిర ప్రవాహంలో కలిసిపోయే ఎర్రటి చిత్తడిలో
కంటిపై కునుకు లేని రాత్రులు..
ఊరూరా క్షతగాత్రులు…!

భయం గుప్పిట్లో బ్రతుకులు..
పొద్దు పొడిస్తే నైజాము పోట్లు
పొద్దు గుంకితే
రజాకార్ల తూట్లు…
ఈరోజున్న పేనం రేపటికి
ఉంటదో లేదో…
మరో పొద్దు చూసేమా..
పురుగు కంటే
హీనమైన ప్రాణమా..!

తెల్లదొరల దుష్టపాలన నుంచి దేశానికి విముక్తి
పంద్రాగస్టు..
ఆపై ఏడాది గడిచినా
నైజాము దుర్మార్గ పాలనకు
చరమగీతం లేదే..
మానభంగాలకు..
మానవ హననాలకు
అంతే లేదే..!

నీ బాంచన్ దొరా..
అలవాటైపోయిన పిలుపు..
ఇక రాదా మలుపు..
ఎప్పుడో సరికొత్త
వెలుగుల పొద్దు పొడుపు…
దొరకి ఎదురెళ్తే తప్పు…
ఎదురు ప్రశ్నిస్తే ముప్పు..
కాలు మొక్కకంటే కోపం..
మొక్కేటపుడు తాకితే
దొర గౌరవానికి లోపం..
ఇక బ్రతుకే శాపం..!

నేల నీది కాదు..
ఊరిలో చోటు లేదు..
పనికి ఠికానా ఉండదు..
బువ్వ దొరకదు..
పీల్చే గాలీ దొరల అనుమతితోనే…
ఆడపిల్ల కంటబడిటే
మానహరణమే..
కాదంటే మరణమే..!

బ్రిటీషోడిని మించిన దాష్టీకం
మృగాలు సైతం
సిగ్గుపడే పైశాచికం..
తెల్లోడి రాజ్యంలో బానిసలు
నైజాము ఏలుబడిలో హీనసలు..
ప్రాణం తృణప్రాయం..
నైజాము నైజామే హేయం..
అలాంటి నేలపై
ఒకనాటికి మహోదయం..
వేలాది అమరవీరుల పోరాటాలు,ప్రాణత్యాగాలు..
ఒక్క రూపమై..
మహోగ్ర యుద్ధమై..
పటేలు ఎంతకైనా సిద్ధమై
తెగపడితే భీకరపోరుకు..
తలవంచింది రాక్షసత్వం..
దుష్టనైజాము పాలన నశించి
తెలంగాణ చూసింది
అందమైన ఓ వేకువజాము!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE