ఆదర్శాలే ఆస్తిపాస్తులు.. సగం జీవితం పస్తులు!

Spread the love

ఖాదీ బట్టలు కట్టి
ఆదర్శాలు ఒంటబట్టి..
బాపూ సూత్రాలు బట్టీపట్టి..
జీవితాలు త్యాగం చేసి..
చందాలు దండి..
సమరయోధులకు వండి..
చచ్చీచెడీ మీరు సాధించిన
స్వరాజ్యం..
మీరు కోరుకున్న సురాజ్యం
ఇప్పుడు ఎవరి భోజ్యం..
ఇంకెవరి ఇష్టారాజ్యం..
మొత్తంగా దోపిడీరాజ్యం..
ఇక్కడ విలువలు పూజ్యం!

బాపూ..పటేల్..
తిలక్..టంగుటూరి..
అదే కోవలో వావిలాల..
వీరి ఆత్మలన్నీ పైనుంచి
ఒకటే గోల..
ఏమనుకున్నాం..
ఏం జరిగిందని..
ఎవరి కష్టాన్ని
ఎవరికి ధారపోసామని..
మా పోరాటాలు..ఆరాటాలు
ఇలా రాబందుల పాలాయెనని..!

వావిలాల..
నడిచే స్ఫూర్తి..
విజ్ఞాన ఖని..
స్వరాజ్యం వచ్చాక
కారణజన్ముడై బాపూ
తనువు చాలిస్తే..
పోరాటాలు చాలవని
తుది శ్వాస వరకు
తిథి చూడకుండా..
విధిగా…వీధి వీధి
తిరిగి సమరాలు సాగించిన
మరో అమరజీవి..
గ్రంథాలయాల్లో బ్రతికుండే
చిరంజీవి…!

స్వరాజ్యం వచ్చింది కదాని
ఆగిపోక..ఆలసిపోక..
ఉద్యమాల వెంటే పరుగు..
ఆంధ్ర…విశాలాంధ్ర ఉద్యమాలు….
గ్రంథాలయ మాధ్యమాలు..
శిస్తు పెంచితే..
అన్నదాతకు
సమస్య వస్తే..
కస్సుబుస్సు..
నిరంతర పోరాటాలే
ఈ వావిలాల
సిలబస్సు..
అవే ఆయన యశస్సు!

గాంధీ బాటలోనే గమనం..
ఆ గాంధీ క్లాసులోనే పయనం
జైల్లోనే సగం జీవనం..
సమాజంలో కలుపు
మొక్కలు పీకేస్తూ
వావిలాల ఎక్కడుంటే
అక్కడే తులసివనం!

 

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

Leave a Reply