Suryaa.co.in

Telangana

దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ పోలీస్ వ్యవస్థ

-రాష్ట్ర హోం శాఖామాత్యులు మహమూద్ అలీ
శాంతి భద్రతలకు తెలంగాణ నిలయం
– మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
బాల్కొండ పోలీస్ స్టేషన్ నూతన భవనం ప్రారంభోత్సవం చేసిన మంత్రులు
పాల్గొన్న డీ.జీ. పీ, జోనల్ ఐ.జీ, కలెక్టర్

నిజామాబాద్: ప్రభుత్వ దార్శనిక పాలన, ఇతోధిక తోడ్పాటుతో తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశంలోనే అగ్రగామిగా మారిందని రాష్ట్ర హోం శాఖామాత్యులు మొహమ్మద్ మహమూద్ అలీ అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రం లో అధునాతన హంగులతో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి హోం మంత్రి మహమూద్ అలీ సోమవారం ప్రారంభోత్సవం చేశారు. రాష్ట్ర డీ జీ పీ అంజనీ కుమార్, జోనల్ ఐ. జీ చంద్రశేఖర్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తదితరులు పాల్గొన్నారు. మంత్రులకు పోలీసులు గౌరవ వందనం సమర్పించగా, స్థానికులు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ, తెలంగాణ పోలీసులు దేశం లోనే నెంబర్ వన్ గా నిలవటం ఎంతో గర్వకారణం అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత పోలీసుల పనితీరులో గణనీయమైన మార్పులు వచ్చాయని, పోలీసు శాఖ పనితీరు ఎంతగానో మెరుగుపడిందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో కొనసాగిన నక్సలిజం, రైతు ఆత్మహత్యలు కనుమరుగై, నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని, ఈ వినూత్న మార్పును చూసి దేశమంతా ఆశ్చర్యపోతోందని పేర్కొన్నారు. శాంతి భద్రతలతోనే అభివృద్ధి సాధ్యమని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసు శాఖకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, అవసరమైన అన్ని సదుపాయాలు సమకూరుస్తున్నారని అన్నారు.

జిల్లాల పునర్విభజన చేపట్టి ప్రజలకు పోలీసింగ్ ను మరింత చేరువ చేశారని చెప్పారు. పోలీస్ స్టేషన్ లకు కార్పొరేట్ హంగులు సమకూరుస్తూ, వాటి నిర్వహణ కోసం దేశంలోని మరే ఇతర రాష్ట్రాల్లో లేనివిధంగా తెలంగాణలో ప్రతీ నెల అర్బన్ ఏరియా లో 75 వేల రూపాయలు, రూరల్ ఠాణాకు 50 వేల రూపాయల చొప్పున ప్రభుత్వం నిధులు సమకూరుస్తోందని తెలిపారు. ప్రభుత్వ తోడ్పాటుతో పోలీసు శాఖ పనితీరులో గణనీయమైన మార్పు వచ్చిందని, మతఘర్షణలు, అల్లర్లు, నేరాలను నియంత్రిస్తూ, ప్రజలకు భద్రతా కల్పించడంలో తెలంగాణ పోలీసులు ముందంజలో నిలుస్తున్నారని అన్నారు.

తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఉమ్మడి రాష్ట్రంలో పోలీస్ శాఖకు బడ్జెట్లో కేవలం 5384 కోట్ల రూపాయల నిధులు కేటాయించగా, ప్రస్తుతం కేవలం తెలంగాణ ప్రాంతానికే తమ ప్రభుత్వం 9598 కోట్ల రూపాయలను కేటాయించిందని గుర్తు చేశారు. ఇతర ఏ రాష్ట్రాల్లో లేని విధంగా తెలంగాణాలో మహిళల భద్రతకు భరోసాను అందిస్తూ ప్రత్యేకంగా 333 షీ-టీమ్ లు పని చేస్తున్నాయని, అర్ధరాత్రి సైతం మహిళలు ధైర్యంగా తిరగగలుగుతున్నారని అన్నారు. పోలీస్ నియామకాల్లోనూ మహిళలకు ప్రాధాన్యతనిస్తూ 33 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నది తెలంగాణ రాష్ట్రంలో మాత్రమేనని పేర్కొన్నారు. పెట్రోలింగ్ పోలీస్ విభాగానికి 700 కోట్ల రూపాయలను ప్రభుత్వం సమకూర్చిందని, ఎక్కడైనా ప్రమాద సమాచారం అందిన వెంటనే ఐదారు నిమిషాల వ్యవధిలో పెట్రోలింగ్ పోలీసుకు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారని, ప్రయోగాత్మకంగా కూడా ఇది నిరూపితమయ్యిందని హోంమంత్రి స్పష్టం చేశారు.

అన్ని రకాల నేరాలను నియంత్రించడమే ధ్యేయంగా పెద్ద ఎత్తున రూ. 585 కోట్లతో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోలీస్ శాఖ పరంగానే కాకుండా అన్ని వర్గాల సంక్షేమం, అన్ని రంగాల అభివృద్ధి లో తెలంగాణ యావత్ దేశానికే మార్గదర్శకంగా మారిందన్నారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందిస్తూ, కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా జల వనరులను ఒడిసిపట్టి రైతులను లక్షాధికారులు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, పోలీసు వ్యవస్థను ప్రభుత్వం పటిష్టపర్చడం వల్ల తెలంగాణ రాష్ట్రం శాంతి భద్రతలకు నిలయంగా మారిందన్నారు. పోలీసులకు, ప్రజలకు మధ్య స్నేహపూరిత వాతావరణం నెలకొనాలన్నదే ప్రభుత్వ అభిమతమని పేర్కొన్నారు. శాంతి భద్రతలు సజావుగా ఉన్నప్పుడే పెట్టుబడులు పెట్టేందుకు బహుళ జాతి కంపెనీలు ముందుకు వస్తాయని, ఈ దిశగా ప్రభుత్వం పోలీసు శాఖలో సమూల మార్పులు తెచ్చేందుకు విశేషంగా కృషి చేసిందన్నారు.

ఫలితంగా ప్రజలకు, వారి ఆస్తులకు పూర్తి రక్షణ ఉన్నదనే భరోసా కల్పించడంలో కృతకృత్యులయ్యామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మేధోమధనం జరిపిన మీదట తీకుసున్న సాహసోపేత నిర్ణయాలతో పోలీస్ వ్యవస్థ పనితీరు ఎంతగానో మెరుగుపడిందని, పోలీసులపై సమాజం లో గౌరవభావం పెరిగిందన్నారు. గతంలో పోలిష్టేషన్ లకు కనీసం స్టేషనరీ కి కూడా నిధులు అందుబాటులో ఉండేవి కావని, కాలం చెల్లిన వాహనాలలో పోలీసులు వెళ్లాల్సి వచ్చేదని, చివరకు వాహనాలకు ఇంధనం సమకూర్చుకునేందుకు కూడా ఇబ్బందులు పడేవారని అన్నారు. ప్రజల కోసం పనిచేసే పోలీసు వ్యవస్థకు ఈ దైన్య స్థితిని దూరం చేస్తూ, అధునాతన సదుపాయాలు, సరిపడా నిధులను సమకూరుస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందన్నారు. ఫలితంగా పోలీసు శాఖ పనితీరు దేశంలోనే నెంబర్ వన్ గా ఉందన్నారు. శాంతి భద్రతలు గొప్పగా ఉండడం వల్లే నేడు రాష్ట్రం లో ఫాక్స్ కన్ ద్వారా లక్ష ఉద్యోగాల కల్పన ఒప్పందం జరిగిందని మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటు తధ్యమని భావించిన సీ.ఎం కేసీఆర్ ఉద్యమ సమయంలోనే పరిశ్రమలు, ఐ.టీ రంగాల ద్వారా పెట్టుబడులను సమకూర్చుకునేందుకు శాంతి భద్రతలకు ఎనలేని ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారని అన్నారు.

అందుకు అనుగుణంగానే స్వరాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను బలోపేతం చేశారని పేర్కొన్నారు. నిజానికి తెలంగాణ ఉద్యమ సమయం లో తాము ఎన్నోసార్లు ముందస్తు అరెస్టులు చేయబడి పోలీస్ స్టేషన్ లలో గడిపాల్సి వచ్చిందని, ప్రజాస్వామ్య గొప్పతనంతో నేడు మంత్రి హోదాలో పోలీస్ స్టేషన్లను ప్రారంభించుకోవడం ఎంతో గొప్ప అనుభూతికి లోను చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ శాంతియుతంగా ,ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించడం వల్లే నేడు ఈ ఔన్నత్యం దక్కిందన్నారు. రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ, ఇదివరకు జిల్లాలో తాను 2005 నుండి 2007 వరకు డిఐజి గా విధులు నిర్వర్తించిన సమయంలో శాంతి భద్రతల పరంగా అనేక సవాళ్లు నెలకొని ఉండేవని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం నక్సల్స్ కదలికలు అంతరించిపోయి, దారి పొడుగునా పచ్చని పంట పొలాలతో ప్రశాంత వాతావరణం నెలకొని ఉందన్నారు. ప్రజల భద్రతా, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు.

ఈ దిశగా దేశంలోనే ఎక్కడా లేని రీతిలో రాష్ట్రంలో 18 వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తోందని, మరో మూడు,నాలుగు నెలల్లో అన్ని విభాగాల్లో నూతన సిబ్బంది సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. సాధారణ పౌరులు కూడా పోలీసులేనని, తమ చుట్టూ జరిగే అవాంఛనీయ, నేర సంఘటనలను నిలువరించేందుకు కృషి చేయాలని సూచించారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, అధునాతన హంగులతో పోలీస్ స్టేషన్లను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నారని అన్నారు. దీనివల్ల పోలీసులకు సౌకర్యాలు మెరుగుపడి, వారు మరింత సమర్ధవంతంగా ప్రజలకు సేవలందించగల్గుతున్నారని పేర్కొన్నారు. ఫిర్యాదులు చేసేందుకు వచ్చే వారికి కూడా ఎంతో వెసులుబాటు లభిస్తోందని, వారి పట్ల గౌరవభావం పెరిగిందన్నారు. గత ఇరవై సంవత్సరాల క్రితం నాటితో పోలిస్తే, నక్సలిజం వంటి సమస్యలు సద్దుమణిగి శాంతి భద్రతలు ఎంతగానో మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. ఫలితంగా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అత్యంత వేగంగా అభివృద్ధిని సంతరించుకుంటోందని, మారుమూల గ్రామీణ ప్రాంతాలకు సైతం రవాణా వ్యవస్థ ఏర్పాటయ్యిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ కే.ఆర్.నాగరాజు, అడిషనల్ సీ.పీ గిరిరాజు, డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE