Suryaa.co.in

Telangana

రాష్ట్రానికి ఆదర్శం తెలంగాణ విద్యుత్తు నియంత్రణ భవనం

– ప్రజలపై ఆర్థిక భారం పడకుండా విద్యుత్ నియంత్రణ మండలి పనిచేస్తుంది
– రాబోయే పది సంవత్సరాల్లో కావలసిన పిక్ డిమాండ్ ను అందుకునేలా ప్రణాళికలు
– అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసి దేశ జీడీపీని పెంచుతున్నాం
– రాష్ట్రంలో 20వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తికి ప్రణాళికలు
– రైతులకు పంటతోపాటు పవర్ పైన ఆదాయం వచ్చేలా ప్రణాళికలు
– తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కార్యాలయ నూతన భవన ప్రారంభోత్సవ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

హైదరాబాద్: కాలుష్యం, ఖర్చు అన్నీ పెరిగిపోతున్న నేపథ్యంలో వాటిని తగ్గించుకుంటూ సహజ వెలుతురు, జీరో నెట్ బిల్ వంటి సౌకర్యాలతో ఆధునిక దేశాలకు దీటుగా తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ విద్యుత్ నియంత్రణ భవన్ పేరిట కొత్త కార్యాలయాన్ని నిర్మించుకోవడం అభినందనీయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.

బుధవారం సాయంత్రం హైదరాబాద్ కళ్యాణ్ నగర్ లో TRC నిర్మించిన నూతన భవనాన్ని ప్రారంభించిన అనంతరం డిప్యూటీ సీఎం ప్రసంగించారు. ప్రజల డబ్బు ప్రతి రూపాయిని బాధ్యతగా ఆలోచించి ఖర్చు పెడితే సమాజానికి మంచిదని ప్రజా ప్రభుత్వ ప్రతినిధిగా స్పష్టం చేస్తున్నట్టు తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రైవేటీకరణ పెరుగుతున్న నేపథ్యంలో అవగాహన లేకుండా ప్రాజెక్టులు నిర్మించి ఉత్పత్తి వ్యయం పెంచి ప్రజలపై భారం మోపుతున్న తరుణంలో..TRC పెట్టుబడిని లెక్కించి ప్రజలపై భారం పడకుండా నియంత్రిస్తుందన్నారు.

రాష్ట్రంలో అందుబాటులో ఉన్న సహజ వనరులను వినియోగించుకొని 20వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలిపారు. సాధించగలమని సంకల్పించుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదని ఇప్పటికే JENCO , TRANSCO అధికారులు, ఉద్యోగులు, పాలకులు సాధించి చూపారని తెలిపారు.

విద్యుత్ శక్తి లేకుండా ప్రస్తుతం ఈ కార్యక్రమం జరిగే పరిస్థితి లేదన్నారు. తక్కువ ధరకే గ్రీన్ పవర్ ఉత్పత్తి చేసి ప్రజలకు అందిస్తామని ఇప్పటికే కేంద్రానికి హామీ ఇచ్చామని వివరించారు.

పేద కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. మన రైతులు పంట ద్వారా మాత్రమే ఆదాయం పొందడమే కాదు.. పవర్ ద్వారా ఆదాయం పొందేందుకు రాష్ట్రవ్యాప్తంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు పైలెట్ ప్రాజెక్టు ద్వారా ముందుకు పోతున్నట్టు తెలిపారు.

మన ప్రభుత్వ విద్యాసంస్థలు ఉన్నతంగా ఎదిగేందుకు వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా భవిష్యత్తు తరాలకు తాము పెడుతున్న పెట్టుబడిగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందని వివరించారు.

పరిశ్రమలు, ఐటీ రంగం, మల్టీ నేషనల్ కంపెనీలకు సమృద్ధిగా విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రణాళికలు రచించినట్టు వివరించారు.
రెగ్యులేటరీ కమిషన్ కు సిబ్బంది కొరత, ఇతర అవసరాలు ఉన్నట్టు తెలియజేశారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , తాను కూర్చుని మాట్లాడినట్టు వివరించారు. Trc కి కావలసిన సౌకర్యాలు సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

LEAVE A RESPONSE