– కాంగ్రెస్ ప్రభుత్వ సత్కారాన్ని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చిన ప్రముఖ కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ నందినీ సిద్దారెడ్డికి ధన్యవాదాలు తెలిపిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల మనోభావాలను నందినీ సిద్దారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజెప్పారు.అబద్దాలతో అధికారంలోకి వచ్చి అహంకారంతో తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీస్తున్నారు. వైభవంగా ఉన్న తెలంగాణ తల్లిని ఏడాది పాలనతో బోసిపోయిన తెలంగాణ మాదిరిగా కాంగ్రెస్ పాలనకు ప్రతిరూపంగా నిలిపారు.
తెలంగాణ తల్లిని మార్చడం ముమ్మాటికీ మూర్ఖత్వమే. ఏడాది పాలనతో అన్నివర్గాల ప్రజలను నిలువునా వంచించారు.కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు కాదు ఏడో గ్యారంటీ ఉంది .. అదే పైన చెప్పిన ఆరు గ్యారంటీల్లో ఏదీ అమలు చేయకపోవడం అని ఆ రోజే చెప్పాం. చరిత్రను నిర్మించలేని వారే చరిత్ర ఆనవాలు చెరిపేసే ప్రయత్నం చేస్తారు.
తెలంగాణ వెనకబాటులో పెద్ద చేయి కాంగ్రెస్ పార్టీదే.1956లో హైదరాబాద్ రాష్ట్ర విలీనం నుండి 1969లో విద్యార్థుల కాల్చివేత, కాంగ్రెస్ పాలనలో అసమానతలు, వివక్షకు వ్యతిరేకంగా తెలంగాణ యువత అడవుల బాట పట్టడం, ఆ తర్వాత బూటకపు ఎన్కౌంటర్లు, మలిదశ తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది యువకుల బలిదానాలకు కారణం కాంగ్రెస్. తెలంగాణకు కాంగ్రెస్ చేసిన మోసాలకు లక్ష పుష్కరాల్లో మునిగినా పోదు. తల్లిని మారిస్తేనో, టీఎస్ టీజీగా చేస్తేనో, చార్మినార్, కాకతీయుల తోరణాలను మారిస్తేనో కాంగ్రెస్ పాపాలు, మోసాలను ప్రజలు మరిచిపోరు.