క్షేత్రమూ..హోమమూ..

“బాబూ..రేపు ఇక్కడ హోమం చేస్తున్నారట కదా..మేము కూడా పాల్గొంటాము..మేము ఉంటున్న గదిని మాకోసం రేపటికి కూడా కేటాయించండి..రేపటి హోమములో మేము కూడా పాల్గొంటాము..దానికొఱకు అయ్యే ఖర్చు ఎంతో చెపితే..ఇప్పుడే ఇచ్చేస్తాము..” అని ఆ దంపతులు పోయిన సంవత్సరం భాద్రపద పౌర్ణమికి ముందురోజు అడిగారు..పౌర్ణమి సోమవారం నాడు వచ్చింది కనుక..ఆదివారం నాడు ఉన్నంత మంది భక్తులు వుండరు..కేవలం హోమంలో పాల్గొనే వాళ్ళు..మరి కొద్దిమంది మాత్రమే వుంటారు కనుక..ఆ దంపతులకు గది గురించి పెద్దగా ఆలోచించలేదు..పైగా వాళ్లిద్దరూ శనివారం నాడే వచ్చారు..పల్లకీసేవ లో పాల్గొన్నారు..ఆదివారం నాటి ప్రభాతసేవ పూర్తి శ్రద్ధతో చూసారు..

“ఇప్పుడు శ్రీ స్వామివారి సమాధి దర్శనానికి వెళ్ళినప్పుడు..మీ అర్చకస్వామి రేపటి హోమం గురించి చెప్పారు..ఇంతదూరం ఎలాగూ వచ్చి ఉన్నాము కనుక..రేపొక్కరోజూ ఇక్కడే వుండి..ఆ హోమం లో కూడా పాల్గొని..తిరిగి మా ఊరు వెళతాము..” అన్నారు..సరే అన్నాను కానీ..వాళ్ళిద్దరినీ చూస్తే…ఈ వయసులో వీళ్ళిద్దరూ అంతసేపు..అంటే..దాదాపు నాలుగు గంటల పైగా..హోమం దగ్గర కూర్చోగలరా..సాధారణంగా హోమం లో పాల్గొనే వారు..ఆ హోమం పూర్తయ్యేదాకా నిరాహారంగా వుంటారు..ఈ దంపతులిద్దరూ డెబ్భై ఏళ్ళ పై బడిన వారే..ఆ మాటే వాళ్ళను అడిగాను..ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు..

“బాబూ..నీ సందేహం సరైనదే..అంతసేపు కూర్చోవడం మాకు కష్టమే..కానీ మేము ఒక కోరికతో ఈ మందిరానికి వచ్చాము..నాపేరు ధనంజయ రావు..ఈమె వెంకటలక్ష్మి..మాకు ఒక్కడే కుమారుడు..నేను ఒక బాంక్ కు మేనేజర్ గా పని చేసి రిటైర్ అయ్యాను..నేను రిటైర్ అయ్యే నాటికే మావాడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు..ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసాము..కోడలు కూడా ఉద్యోగం చేస్తున్నది..ఇద్దరూ చక్కగా కాపురం చేసుకుంటున్నారు.

.మూడేళ్లు వాళ్ళ కాపురం సవ్యంగా ఉంది..ఆ తరువాత ఏమైందో తెలీదు..ఇద్దరూ తరచూ గొడవ పడటం మొదలు పెట్టారు..కళ్ళముందు కొడుకూ కోడలు ఎడముఖం పెడముఖం గా ఉంటే..మేము చూస్తూ వుండలేము..అట్లని వాళ్లకు సలహా ఇవ్వలేము..నలిగి పోతున్నాము..ఈలోపల ఈ క్షేత్రం గురించి చదవడం జరిగింది..ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే..వాళ్ళ సంసారం బాగు పడుతుందేమో ననే ఆశతో వచ్చాము..రేపు భాద్రపద పౌర్ణమికి మీరు అదేదో..లక్ష్మీగణపతి హోమము నిర్వహిస్తారట కదా..అందులో కూడా పాల్గొందామని అనుకున్నాము..ఎన్ని మొక్కులు మొక్కినా..ఎన్ని హోమాలు చేసినా..మా వాడి కాపురం బాగు పడితే చాలు..అదొక్కటే మా కోరిక..అందుకోసం కొద్దిగా కష్టపడ్డా పర్వాలేదు..” అన్నారు.. వాళ్ళిద్దరి తాపత్రయానికి నాకు కొద్దిగా బాధ వేసింది..మీ ఇష్టం అన్నాను..

ఆ ప్రక్కరోజు సోమవారం ఉదయం ఎనిమిది గంటలకల్లా ఆ దంపతులు శుచిగా తయారయ్యి మందిరం లోకి వచ్చారు..ముందుగా శ్రీ స్వామివారి సమాధి దర్శనం చేసుకొని వచ్చారు..హోమం లో పాల్గొనే ఇతర భక్తులు కూడా ఈలోపల వచ్చేసారు..ఈ దంపతులు కూర్చోవడం కోసం కొద్దిగా ఎత్తుగా ఉన్న చిన్న బల్లలను ఏర్పాటు చేసాము..ఉదయం తొమ్మిది గంటల నుంచి..మధ్యాహ్నం ఒకటిన్నర వరకూ హోమం తాలూకు క్రతువు..పూర్ణాహుతి జరిగాయి..అందరూ శ్రద్ధగా పాల్గొన్నారు..ఆ తరువాత భోజనాలు చేసి వచ్చారు..మరో రెండు మూడు గంటలకల్లా..దాదాపు అందరూ వెళ్లిపోయారు..

ఈ దంపతులు మాత్రం తమ గదికి వెళ్లి మళ్లీ మందిరం లోకి వచ్చారు..”బాబూ ప్రసాద్..నీ సహకారంతో హోమం లో పాల్గొన్నాము..మరొక్కసారి స్వామివారి సమాధిని దర్శించుకొని..మా ఊరు వెళ్లిపోతాము..” అన్నారు అలాగే అన్నాను..స్వామివారి సమాధిని దర్శించుకొని వచ్చి..”మావాడి కాపురం బాగుపడి..పరిస్థితులు చక్కబడితే..మళ్లీ ఈ స్వామివారి దర్శనానికి వస్తాము బాబూ..వెళ్ళొస్తాము..”అని చెప్పి తమ కార్లో వెళ్లిపోయారు..

ఆ దంపతులు రెండు వారాల క్రితం ఒక ఆదివారం నాడు మళ్లీ మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చారు..స్వామివారి సమాధిని దర్శించుకొని..నేరుగా నా వద్దకు వచ్చి..”బాబూ ప్రసాద్..మేము గుర్తున్నామా..నేను ధనంజయరావు ను..” అన్నారు..బాగా గుర్తు వున్నారు అన్నాను..”ఇక్కడ మొక్కుకొని వెళ్లిన తరువాత..వెంటనే మా వాడి కాపురం చక్కబడలేదు..క్రమంగా ఆరు నెలలు పట్టింది వాళ్లిద్దరూ సర్దుకోవడానికి..ప్రస్తుతం ఇద్దరూ సఖ్యత తో వుంటున్నారు..కోడలుకు ప్రస్తుతం మూడో నెల..మాకు మనోవేదన తగ్గింది..అందుకే స్వామివారిని దర్శించుకొని..కృతజ్ఞతలు చెప్పుకుందామని వచ్చాము.

ఈసారి పౌర్ణమి కి కూడా హోమం నిర్వహిస్తున్నారట కదా..మేము ఈసారి పాల్గొనలేము..మా తరఫున మీరే మా గోత్రనామాలతో క్రతువు జరిపించండి..అందుకు అయ్యే ఖర్చు ఇస్తాము..ఈ క్షేత్రం లో మీరు జరిపే హోమాలు చాలా ప్రభావం చూపుతాయి..మాకు అనుభవం లోకి వచ్చింది కదా..” అన్నారు..ఆ దంపతుల ముఖాల్లో చాలా ప్రశాంతత కనిపించింది..సరే అన్నాను..
క్షేత్ర మహిమో..హోమ ప్రభావమో..స్వామివారి అనుగ్రహమో..ఏదైతేనేం..ఆ వృద్ధ దంపతుల మనోవేదన తీరిపోయింది..

పవని నాగేంద్ర ప్రసాద్
శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..
మొగలిచెర్ల గ్రామం,
94402 66380 & 99089 73699).

Leave a Reply