Suryaa.co.in

Andhra Pradesh

ఎవరి ధీమా వారిదే

– టెన్షన్.. అ ‘టెన్షన్’
(ఏ.బాబు)

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలపై గతంలో ఎన్నడూ లేనంత ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలు నువ్వా నేనా అన్నట్టుగా సాగడమే ఇందుకు ప్రధాన కారణం. పోలింగ్ ముగిసిన వెంటనే విజేతలు ఎవరనే దానిపై మొదలైన సస్పెన్స్‌.. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎగ్జిట్ పోల్స్‌తో దీనిపై ఓ స్పష్టత వస్తుందని భావించినా.. అందులోనూ సేమ్ సీన్ కనిపించడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.

పలు ఎగ్జిట్ పోల్స్ వైసీపీదే విజయం అంటుంటే.. మరికొన్ని మాత్రం ఏపీలో కింగ్ కూటమే అని అంచనా వేశాయి. దీంతో గత 20 రోజులుగా ఫలితాలపై కొనసాగుతున్న ఉత్కంఠ మరింత పెరిగిపోయింది.

భిన్నమైన అంచనాలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్‌ రాజకీయ పార్టీ శ్రేణులను కన్ఫ్యూజన్‌లో పడేశాయి. తమకు అనుకూలంగా ఉన్న ఎగ్జిట్ పోల్స్‌ నిజమవుతాయని.. ప్రత్యర్థులకు అనుకూలంగా ఉన్న ఎగ్జిట్ పోల్స్ ఫేక్ అంటూ నేతలు విమర్శలు గుప్పించారు. ఎగ్జిట్‌పోల్స్‌ గందరగోళంగా ఉన్నాయని.. లోకల్‌ సర్వేలు తమకు పాజిటివ్‌గా ఉన్నాయని వైసీపీ తెలిపింది. ఓట్ల లెక్కింపు సమయంలో ప్రతీక్షణం అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.

ఇక కూటమి అభ్యర్థులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూటమికే సానుకూలంగా ఉన్నాయని తెలిపారు. ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించబోతున్నామన్నారు. వైసీపీ అల్లర్లకు పాల్పడే అవకాశం ఉందని.. కౌంటింగ్‌ రోజు అప్రమత్తంగా ఉండాలని నేతలకు సూచించారు. రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీఏ విజయం ఖాయమన్నారు బీజేపీ నేత సీఎం రమేష్. కౌంటింగ్‌లో కూటమి ఏజెంట్లు ఎవరు సహనం కోల్పోవద్దని సూచించారు.

మొత్తానికి తుది ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్‌ క్లియర్ పిక్చర్ ఇవ్వకపోవడంతో.. ఫలితాలు వెలువడే (జూన్ 4) వరకు నేతలంతా ఉత్కంఠగా వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

LEAVE A RESPONSE