ఎన్నో చదువులు చదివా..
డిగ్రీలు..పీజీలు..పీహెచ్డీలు..
కుప్పల కొద్ది మెడల్సు..
కట్టల కొద్ది సర్టిఫికెట్లు..
నేనే రాజును..
మహరాజును..
అనుకున్నా..
అమ్మ దగ్గరికి వచ్చాను..
సాధించిన పట్టాలన్నీ చూపించి గొప్పలు పోదామనుకునుకున్నా..
చిన్నప్పుడు ఎన్నిసార్లు నన్ను దండించావు..
చదవడం లేదని
ఎంత తిట్టావు..
నాలుగు అక్షరాలు నేర్పావేమో…
కొన్ని తప్పులు దిద్దావేమో..
తప్పటడుగులు సరిచేసావేమో..
తిన్నానా లేదా అని సరిచూసావేమో..
హోం వర్క్ చేస్తుంటే
సాయపడ్డావేమో..
చదువుకుంటూనే
నిద్రలోకి జోగేస్తుంటే
తట్టి లేపావేమో..
అలా జోగి జోగి
నేలపై పుస్తకాల మీదే
తలపెట్టి పడుకుండిపోతే
నిద్ర చెదరిపోకుందా
పక్కపైకి చేర్చి విసురుతూ కూర్చున్నావేమో..
మళ్లీ ఉదయాన్నే నా కంటే ముందుగా నిద్రలేచి రాత్రి వదిలేసిన పుస్తకాన్ని తెచ్చి తెచ్చి నాకిచ్చావేమో..
ఆ మాత్రానికే
అంత గొప్పా నువ్వు…
ఇలా ఆలోచిస్తూ
అమ్మని చేరా..
ఇంత చదువులు చదివి అలసిపోయాను కదా అంటూ నాపై నేనే జాలిపడుతూ
అమ్మను చూసాను..
అమ్మ నన్ను చూసి
ఒకటే బాధ..
చిక్కిపోయావురా బాబూ అని..
చేసింది ఒకే బోధ..
ఎంత సాధించినా గర్వం వద్దురా నాన్నా అంటూ…
అప్పుడు చూసాను
ఆమ్మ మొహంలోకి..
అరె..ఇన్ని చేసిన..చేస్తున్న ఆమె మోమున
అలసట లేదే..
పొద్దు పొడవక ముందే మెలకువ…
అర్ధరాత్రి మలిజాము
నాటికి నిద్ర..
దినమంతా పరుగు..
ఎన్ని పనులు..ఎందరికి సేవలు
వంట,వార్పు..ఏర్పు..కూర్పు..
ఓర్పు..ఓదార్పు..నేర్పు..
ఎంత చేసినా ఎంత సాధించినా
అదే అమ్మ..అదే నవ్వు..
అదే ప్రేమ..అదే లాలన..
నన్నే మురిపెంగా చూస్తూ..
అల్లరి చేసినప్పుడూ
అదే చూపు..
ఇప్పుడు ఇంత చదువుకుని
వచ్చినప్పుడూ అదే చూపు..
అమ్మ మారలేదు..
తన కొంగుతో నా ముఖంపై పట్టిన చెమటను తుడిచింది..
నుదుటిపై ఓ ముద్దు..
చిన్నప్పుడు అల్లరి చేసినప్పుడు ఇచ్చిన గుద్దు..
ఈ ముద్దు..
రెండింటిలో అదే లాలిత్యం..
అమ్మ ఎప్పటికీ స్వాతిముత్యం..!
అప్పుడు తెలిసింది
సకల విద్యల సారం
అమ్మ ప్రేమని..
ఆమె మనసు లోతు తెలుసుకోవడం
క్షీరసాగర మధనమని..
నేను విశ్వవిద్యాలయమైతే
ఆమ్మ మహా గ్రంధాలయమని..
నా ఈ జ్ఞానానికి మూలాధారం
ఆమె గర్భాలయమని..
నా ప్రతి అడుగు
ఆమె లయమని..
ఆమె సన్నిధి దేవాలయమని..
ఆమె మనసు ప్రేమాలయమని..
నేను ఎంత ఎత్తు ఎదిగినా
తను హిమాలయమని..!
ఆ క్షణమే
మనసులో అనుకున్నా..
అమ్మా..
thanks for everything
అని..
బిడ్డల ఉన్నతి కోసం అహరహం పాటుపడుతూ..
తాను కరిగిపోయి బిడ్డలకు వెలుగులు పంచే మాతృమూర్తులకు అంకితం
– ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286