– సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటో
విశాఖ పోర్టులో సీబీఐ రెడ్‌స్యాండెండ్‌గా పట్టుకున్న 23 వేల కిలోల డ్రగ్స్ కంటైనర్‌ను బుక్ చేసింది అధికార వైసీపీ నాయకుడి కంపెనీయేనన్న ప్రచారం సోషల్‌మీడియాలో గుప్పుమంటోంది. కూనం వీరభద్రరావుకు చెందిన కంపెనీ ఆక్వా ఎక్స్‌పోర్టు కంపెనీదంటూ, సోషల్‌మీడియాలో ఫొటోలతో సహా వస్తున్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంలో బీజేపీ కీలక నేత బంధువు కంపెనీ కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నా, ఇప్పటివరకూ దానికి సంబంధించిన ఆధారం బయటకు రాలేదు.
సదరు కూనం వీరభద్రరావుకు సంక్రాంతి, భోగి శుభాకాంక్షలు అందిస్తూ విశాఖ వైసీపీ నేతలు ఇచ్చిన ప్రకటన, ఇప్పుడు సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ‘ప్రముఖ వ్యాపారవేత్త, విద్యాదాత, సంఘసంస్కర్త, మానవాతా మూర్తి, గ్రామాభివృద్ధి ప్రదాత, సంధ్య ఆక్వా అధిపతులు శ్రీ కూనం వీరభద్రరావు దంపతులకు భోగి,సంక్రాంతి శుభాకాంక్షలు’’ అని రెండు పత్రికల్లో ఇచ్చిన ప్రకటన .. డ్రగ్స్‌కేసు తర్వాత సోషల్‌మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.
అందులో వైసీపీ అధినేత జగన్, ఎంపి విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపి నందిగం సురేష్, మంత్రి సురేష్, ఎంపి మాగుంట, ఎమ్మెల్యే కరణం బలరాం ఫొటోలు కూడా పెట్టారు.
కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ కూనం హరికృష్ణ మాత్రం.. తాము డ్రై ఈస్ట్ ముడిసరుకు కోసం బ్రెజిల్ నుంచి ఇవి తెప్పించామని, అయితే అందులో డ్రగ్స్ ఉన్నట్లు సీబీఐ అధికారులు సరుకు పరీక్షకు తీసుకువెళ్లారని చెప్పారు. ‘అది రొయ్యల మేతకు ఇచ్చిన ఆర్డర్. మళ్లీ సీబీఐ చెకింగ్ ఉంటుంది. అయినా ఇది ప్రభుత్వాలకు సంబంధించిన అంశమ’ని చెప్పడం విశేషం.