Suryaa.co.in

Editorial

సీట్లపై ‘కమలం’లో కుస్తీ

– బీజేపీలో కుదరని సీట్ల ఎంపిక
– బలమైన అభ్యర్ధులు కరవు
– మార్పు చేర్పులపై మల్లగుల్లాలు
– మధ్యలో ఫిర్యాదులు, పంచాయితీలు
– విజయనగరం బదులు రాజంపేట?
– హిందూపురం బదులు అనంతపరం?
– అనకాపల్లి బదులు విశాఖపై పట్టు?
– రాజమండ్రిలో పురందేశ్వరి వద్దంటూ లేఖలు?
– స్థానికులకే ఇవ్వాలని మాజీ నేత అనుచరుల డిమాండ్
– రాష్ట్ర నేతల సమీకరణలపై ఢిల్లీ సీరియస్?
– గెలుపు గ్యారంటీ ఇచ్చేదెవరన్న అమిత్‌షా
– తెల్లముఖం వేసిన రాష్ట్ర నేతలు?
– 23న ఎంపీ అభ్యర్ధుల ప్రకటన?
– ఆలోగా మరోసారి బాబు-పవన్‌తో భేటీ?
– రాజంపేటకు తెరపై కొత్తగా సాయి లోకేష్?
– కిరణ్‌కుమార్ ను తెరవెనక్కి నెట్టేసిన కీలక నేత
– అనంతపురం సీనులో కాపు రామచంద్రారెడ్డి?
– ఆయనతో ఢిల్లీ అగ్రనేతల వద్దకు ప్రదక్షణలు?
– మైలవరం, ఎచ్చెర్ల కావాలంటున్న కీలక నేత?
– ఏపీ బీజేపీలో సీట్ల సిగపట్లు
( మార్తి సుబ్రహ్మణ్యం)

లేని బలాన్ని ఊహించుకుని.. పక్క పార్టీ బలంతో అప్పనంగా గెలుద్దామని.. ఉత్తి పుణ్యానికి వచ్చిన సీట్లలో కూడా సమర్ధులను నిలబెట్టలేని నిస్సహాయ పరిస్థితి. పార్టీలో ఉన్న కొద్దిమంది బలమైన నేతలకు సీట్లు ఇచ్చి.. సీరియస్‌గా యుద్ధం చేయాల్సిన ఏపీ బీజేపీ.. ఇప్పుడు వారిని వదిలేసి, తమను సంతృప్తి పరిచిన వారికి సీట్లు ఇవ్వాలంటూ చేస్తున్న ఒత్తిడి రాజకీయంపై, ఢిల్లీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. రోజుకో పేరు- మారుతున్న నియోజకవర్గాల సిఫార్సులను తెరపైకి తెస్తున్న రాష్ట్ర నేతల వైఖరిపై, అమిత్‌షా వంటి అగ్రనేతలు కూడా చికాకుపడ్డారట.

లేని గొప్పలు ప్రదర్శించి 10 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాలు తీసుకున్న బీజేపీ.. ఇప్పటిదాకా ఆయా స్థానాల్లో సరైన అభ్యర్ధులు దొరక్క మల్లగుల్లాలు పడుతోంది. పక్కనే ఉన్న తమిళనాడులో 9 మంది అభ్యర్ధులను ఒకేసారి ప్రకటించగా.. ఏపీలో మాత్రం ఇప్పటిదాకా అభ్యర్ధులను తలపట్టుకోవడం విస్మయపరుస్తోంది.

మూడురోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, మరికొందరు అగ్రనేతల వద్ద రాష్ట్ర నేతలతో కీలక భేటీ జరిగిందట. ఆ సందర్భంగా రాష్ట్ర నేతలు ఇచ్చిన జాబితా, మార్పులు కోరుకుంటున్న నియోజకవర్గాల చిట్టాపై, అమిత్‌షా ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. ‘చంద్రబాబు మాకు గతంలో 4 ఎంపీ, 4 అసెంబ్లీ సీట్లను గెలిపించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు మీరు ఇన్నిసార్లు జాబితా ఇచ్చారు. వారిని గెలిపించే బాధ్యత మీరు తీసుకుంటారా? ఆ హామీ మీరు ఇస్తారా? వారి గెలుపు గ్యారంటీ మీరిస్తారా?’’ అని ప్రశ్నల వర్షం కురిపిస్తే.. సద రు నేతలు తెల్లముఖం వేసినట్లు పార్టీ వర్గాల సమాచారం.

కాగా కొత్తగా మరికొందరు అభ్యర్ధుల పేర్లను, రాష్ట్ర కీలక నేత తెరపైకి తీసుకువచ్చినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గతంలో విజయనగరం ఎంపీ సీటు అడిగిన రాష్ట్ర నేత, ఇప్పుడు దాని బదులు మళ్లీ రాజంపేట తీసుకోవాలని కేంద్ర పార్టీకి సూచించారట. ఆ ప్రకారంగా అక్కడ రాజంపేట మాజీ ఎంపి సాయిప్రతాప్ అల్లుడు సాయి లోకేష్‌ను బరిలోకి దింపాలన్నది, సదరు నేత లక్ష్యమని చెబుతున్నారు. అయితే వ్యాపారస్తుడైన ఆయన ఎక్కువ సమయం బెంగళూరులోన గడుపుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ ప్రకారంగా మాజీ సీఎం కిరణ్‌ను వ్యూహాత్మకంగా పక్కకుతప్పించాలన్నది సదరు నేత లక్ష్యమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇక హిందూపురం బదులు అనంతపురం ఎంపీ సీటు కావాలని, కొత్తగా కోరుతున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితమే వైసీపీకి రాజీనామా చేసిన ఆ పార్టీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి, అనంతపురం సీటు ఇప్పించాలన్న పట్టుదల సదరు నేతలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చె బుతున్నాయి. కాపు రామచంద్రారెడ్డిని వెంటబెట్టుకుని, ఢిల్లీలో అగ్రనేతల చుట్టూ తిరుగుతున్న వైనం చర్చనీయాంశమయింది. అయితే ఆ కుటుంబానికి అక్కడ మంచి పేరు లేదని, ఇప్పటికే అనేక ఆరోపణలున్నందున, ఆయన అభ్యర్ధిత్వం సరైంది కాదని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు.

ఇదిలాఉండగా.. టీడీపీకి కంచుకోట వంటి మైలవరం, ఎచ్చెర్ల అసెంబ్లీ కావాలన్న కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చినట్లు చెబుతున్నారు. మైలవరంలో రాష్ట్ర ముఖ్య నేత అనుచరుడైన బాల, ఎచ్చెర్లలో విద్యాసంస్థల అధిపతి ఈశ్వర్‌కు సీటు ఇవ్వాలని ఆ నేత సిఫార్సు చేస్తున్నటు,్ల పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అసలు టీడీపీకి బలమైన ఎచ్చెర్ల, మైలవరం వంటి నియోజకవర్గాలను కోరడంపైనే పార్టీ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ఇలాంటి ప్రతిపాదనలతో పార్టీ నాయకత్వానికి సహజంగానే అనుమానం వస్తుందని చెబుతున్నారు.

‘ఈ ఐదేళ్లలో మా పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలు ఎంచుకోకుండా, టీడీపీ సీట్లను కోరుకుంటే అక్కడ ఓటు బదిలీ ఎలా అవుతుందన్న ఆలోచన కూడా మా వాళ్లకు లేదు. కేవలం తమను సంతృప్తి పరచడమే ప్రాతిపదికగా సీట్లు, వ్యక్తులను అడగడం మంచిదికాదు. దీనివల్ల పేరుకు అన్ని సీట్లలో పోటీ చేసి, చివరకు గెలవకపోతే పార్టీ అప్రతిష్ఠ పాలవుతుంది’’ అని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

కాగా ఉత్తరాంధ్రలో అనకాపల్లి బదులు విశాఖ కావాలని పార్టీలోని ఒకవర్గం ఒత్తిడి చేస్తోంది. రాజ్యసభ ఎంపి జీవీఎల్ నరసింహారావు గత ఏడాది నుంచీ అక్కడ సీరియస్‌గా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, వాటికి పలువురు కేంద్రమంత్రులను కూడా ఆహ్వానించిన విషయాన్ని ఇటీవల అమిత్‌షా, సంతోష్‌జీ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. విశాఖలో గతేడాది నుంచి జీవీఎల్.. పలు కులసంఘాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారని అమిత్‌షాకు చెప్పారట.

జీవీఎల్ సైతం రాజ్యసభ సభ్యులు ఒక్కో ఎంపీ నియోజకర్గాన్ని ఎంపిక చేసుకోవాలని నాయకత్వం సూచించిన తర్వాతనే, తాను విశాఖను ఎంపిక చేసుకున్నట్లు అమిత్‌షాతో చెప్పినట్లు సమాచారం. అనకాపల్లిలో పార్టీకి ఏమాత్రం బలం లేదని, అదే విశాఖలో గతంలో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మేయర్ స్థానాలు గెలిచిన చరిత్ర ఉందని గుర్తు చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలాఉండగా.. రాజమండ్రి ఎంపీ సీటు కోరుకుంటున్న రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి అక్కడ సీటు ఇవ్వవద్దంటూ, స్థానిక నేతలు కొందరు ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలిసింది. స్థానికేతరురాలైన ఆమెకు అక్కడ ఎలా సీటు ఇస్తారని ప్రశ్నించినట్లు సమాచారం. గతంలో రాష్ట్ర పార్టీని వెలిగించిన ఓ అగ్రనేత అనుచరులు, ఆమేరకు సోషల్‌మీడియాలో ప్రచారం ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఆ సీటును ఆయన ఆశిస్తున్నారట. ఆయనకు గతంలో సంఘటనా మంత్రిగా పనిచేసిన ఓ కీలక నేత మద్దతునిస్తున్నట్లు, పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఇక ఎవరికి సీట్లు ఇచ్చినా.. దశాబ్దాల నుంచి పనిచేస్తున్న వారికే ఇవ్వాలంటూ కాకినాడకు చెందిన సీనియర్ నేత విశ్వేశ్వర్‌రావు, ఇటీవల పార్టీ నాయకత్వానికి లేఖ రాయడం చర్చనీయాంశమయింది. గెలిచినా-ఓడినా పార్టీకి అనాదిగా పనిచేసే వారికే సీట్లు ఇవ్వాలని ఆయన అభ్యర్ధించారు. వారసత్వాన్ని ప్రొత్సహించవద్దని ఆయన నాయకత్వానికి లేఖ రాశారు. ఆయన పరోక్షంగా పురందేశ్వరి గురించే లేఖ రాశారన్న చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఆయన లేఖ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

అయితే ఈనెల 23 రాత్రికి, అభ్యర్ధుల ప్రకటన ఉండవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈలోగా పార్టీ నాయకత్వం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు-జనసేన దళపతి పవన్‌కల్యాణ్‌తో చర్చించి, అభ్యర్ధుల జాబితాను ప్రకటిస్తారని చెబుతున్నారు.

LEAVE A RESPONSE