పవన్ ‘కాపు’ కాస్తారా?

– కుల నేతగా అవతరిస్తారా? రాజకీయనేతగా రాణిస్తారా?
– బందరు సభతో తేలిన గందరగోళ వైఖరి
– స్పష్టత ఇవ్వకపోతే నష్టమే
– పార్టీ నిర్మాణం లేకపోతే ఎదగడం కష్టమే
– ఎమ్మెల్యే స్థాయి అభ్యర్ధులేరీ?
– అంతా ఆయనే అయితే ఎలా?
– పొత్తు ప్రకటనపై మొహమాటమెందుకు?
– పదేళ్లయినా రాజకీయ పరిణతి లేని జనసేన
( మార్తి సుబ్రహ్మణ్యం)

పవన్ కల్యాణ్. జనసేనకు కర్త-కర్మ-క్రియ అంతా ఆయనే. పవన్ ఫిలాసఫీనే జనసేనకు ఇరుసు, ఇంధనం. ఇంకా చెప్పాలంటే పవన్ కల్యాణ్ ..తెలుగునేలపై ఏకైక క్రౌడ్‌పుల్లర్. జగన్-చంద్రబాబు-కేసీఆర్ సభలకు జనం రావాలంటే, వారికి బోలెడు తాయిలాలివ్వాలి. కార్లు పెట్టాలి. మందు బాటిళ్లు ఇవ్వాలి. బిర్యానీ పొటాల్లివ్వాలి. కానీ పవన్ వస్తున్నారంటే అదే ఓ ప్రభ ం‘జనం’. సొంత ఖర్చులతో తోసుకుని మరీ చూసి తరించిపోతారు.

పవన్ మాట్లాడుతుంటే మధ్యలోనే సీఎం సీఎం అని పిచ్చి కేకలు వేస్తారు. తలకు కర్చీఫ్ కట్టుకుని, జీన్స్ ఫ్యాంట్‌ను మోకాలి వద్ద చింపేసుకుని, రెండు చొక్కా బటన్లు విప్పేసుకుని, మధ్యలో గుట్కాలు ఉమ్మేస్తూ, పవన్ జిందాబాదులంటూ పూనకం వచ్చినట్లు రోడ్డుమీద పడి నినాదాలు చేస్తారు. ఆయనంటే అదో పిచ్చి. వేలం వెర్రి.

కానీ వారంతా ఆయన పార్టీకి ససేమిరా ఓటేయరు. స్వయంగా ఆయననే రెండు నియోజకవర్గాల్లో విజయవంతంగా ఓడించారు. ఆ విషయం పవన్ కూడా నిజాయితీగా ఒప్పుకుంటారు. మీరు నన్ను సీఎం అని అంటారు. కానీ ఓట్లు మాత్రం వాళ్లకి వేస్తారు అని ఉన్నమాట చెబుతుంటారు. రాజకీయాలు-అభిమానం వేర్వేరని, పవన్ ఆలస్యంగానయినా గ్రహించారు. అది వేరే విషయం.

సూటిగా చెప్పాలంటే.. ఇప్పుడున్న రాజకీయ నేతల్లో.. నిజాయితీపాలు ఎక్కువగా కనిపించే ఒకరిద్దరు నేతల్లో, పవన్ ఒకరన్నది నిర్వివాదం. నిస్సందేహం. ఎందుకంటే ఆయన సినిమాలో నటించడం ద్వారా సంపాదించే, సొంత డబ్బుతో రాజకీయం చేస్తున్నారు. రైతులకు డబ్బులిస్తున్నారు. తనను చలింపచేసిన వ్యక్తులను పెద్ద మనుసుతో ఆదుకుంటున్నారు. ఈ తరహా రాజకీయాలు చేసేవాళ్లు బహుశా భారతదేశంలోనే ఎవరూ ఉండకపోవచ్చు. అదొక్కటి చాలు. ఆయన నిజాయితీ ఎంతన్నది చెప్పడానికి.

అయితే రాజకీయాల్లో నిజాయితీ ఒక్కటే సరిపోదు. స్పష్టత కావాలి. విశ్వసనీయుడు అనిపించుకోవాలి. నిలకడ నిరూపించుకోవాలి. జనాలకు ఏం కావాలో గ్రహించాలి. తాను చెప్పే మాటలు వారు నమ్ముతున్నారా? లేదా అని కనిపెట్టాలి. తనకు అన్ని అంశాల్లోనూ స్పష్టత ఉందన్న విషయాన్ని చెప్పగలగాలి.

తనను గెలిపిస్తే మాకు నిశ్చింత అన్న భావన జనాలకు కలిగించాలి. నేను మీ వాడినని.. అందరివాడినని.. అన్ని వర్గాలకూ భరోసా కల్పించాలి. లేకపోతే ఆ నాయకుడికి ప్రసంగాలకు ఈలలు, గోలలు, జిందాబాదులు, పూలవానలు తప్ప, ఓట్లు రాలవు. పవన్ విషయంలో ఇప్పటివరకూ జరిగింది, జరుగుతోందీ ఇదే.

పదేళ్ల పార్టీ ప్రస్థానంలో అటు పవన్, ఇటు నాదెండ్ల మనోహర్, అప్పుడప్పుడు మెరుపుతీగలా మెరిసి మాయమయ్యే, అన్నయ్య నాగేంద్రబాబు తప్ప.. జనసేనలో ఇంకెవరూ కనిపించిన దాఖలాలు లేవు. మధ్య మధ్యలో పార్టీని అడ్డంగా ఇరికించే అన్నయ్య గారి వివాదాస్పద వ్యాఖ్యలు. పవన్‌కు తప్ప ఆ ఇద్దరికీ ఏమాత్రం ఇమేజ్ లేదు. ఒకరిది నియోజకవర్గానికి ఎక్కువ- జిల్లాకు తక్కువ స్థాయి. మరొకరిది ప్రెస్‌మీట్లు, యూట్యూబ్ స్థాయి. ఈ ఇద్దరి వ్యక్తిగత చరిష్మాతో, పార్టీకి పట్టుమని పదొందల ఓట్లు కూడా పడవన్నది మనం మనుషులం అన్నంత నిజం.

ఇక పవన్‌ను కాపు మంత్రులు తిట్టినప్పుడు, వాటికి జిల్లా నేతల ఎదురుదాడులు. మీడియాలో వచ్చే కథనాలు- సంఘటన ఆధారంగా వెల్లువెత్తే పత్రికాప్రకటనలు. పదేళ్లలో పార్టీ వేసిన అడుగులు ఇవే.
కారణం పార్టీకి సంస్థాగత నిర్మాణం లేకపోవడం. వన్ నుంచి టెన్ వరకూ పవనే కనిపిస్తారు. బహుశా ప్రజారాజ్యం పార్టీలో తన చేదు అనుభవాలే దానికి కారణం కావచ్చు. ముదురు నాయకులే ‘అన్నయ్య పార్టీ’ని ముంచేశారన్న కోపమూ కావచ్చు. దానితో ‘ఎవరినీ నమ్మకూడదు-ఎవరితోనూ అభిప్రాయాలు పంచుకోకూడద’న్న సిద్ధాంతం నాటుకుపోయి ఉండవచ్చు.

దానితో ఓటు హక్కులేని అభిమానులే పార్టీకి ఆశ, శ్వాస అవుతున్న పరిస్థితి. కానీ అది రాజకీయ పార్టీ మనుగడకు పనికిరాని సిద్ధాంతం. అందరినీ నమ్మాలి. లేకపోతే నమ్మినట్లు నటించి, చివరాఖరకు తాను అనుకున్న నిర్ణయం తీసుకోవాలి. ప్రజాసామ్యవాదిగా కనిపించడం కూడా ఒక కళ. పవన్ దగ్గర ఈ రెండూ కనిపించవు. అందుకే బహుశా జనసేనలో, అనుభవం ఉన్న నాయకులెవరూ కనిపించరు. అంటే తనకు సలహాలు ఇచ్చే వారికంటే.. తాను చెబితే వినేవాళ్లనే పవన్ ఎంపిక చేసుకుని ఉండవచ్చని ఆయన సైకాలజీ స్పష్టం చేస్తోంది.

నిజానికి ఒక రాజకీయ పార్టీ పదేళ్ల ప్రస్థానంలో జనహృదయాల్లో నిలిచిపోవాలి. అధికార పార్టీకి ప్రత్యామ్నాయం అనిపించేలా ఉండాలి. కనీసం జనం సమస్యల పరిష్కారం కోసం, నిరంతరం పోరాడే పార్టీ అన్న పేరయినా దక్కించుకోవాలి. జనసేన పదేళ్ల ప్రస్థానంలో ఇవి భూతద్దం వేసినా కనిపించలేదన్నది నిష్ఠుర నిజం.

చివరకు ఓ 50 నియోజకవర్గాల్లో , అసెంబ్లీకి పోటీ చేసే ఎమ్మెల్యే స్థాయి నేతలను కూడా తయారుచేయలేకపోయారు. అందుకే పవన్ పార్టీకి ఇప్పటికీ సరైన అభ్యర్ధులంటూ ఎవరూ కనిపించరు. ప్రజారాజ్యం తొలినాళ్లలో కనిపించిన వాతావరణమే, పదేళ్ల జనసేనలో కనిపిస్తోంది.

రోడ్లపై గుంతల వంటి ఒకటి రెండు ఫొటో ప్రోగ్రామ్స్ తప్ప, పోలవరం-ప్రత్యేక హోదా-కాపు రిజర్వేషన్లు- ఉద్యోగులకు జీతాలు-మహిళలపై అత్యాచారాలు- లిక్కర్-ఇసుక-గంజాయి వంటి అంశాలపై… ఒక రాజకీయ పార్టీగా జనసేన ఉద్యమించినట్లు లేదు. కేవలం పవన్ మంగళగిరికి వచ్చి పెట్టే ప్రెస్‌మీట్లు, అప్పుడప్పుడు నిర్వహించే బహిరంగసభలప్పుడే.. ‘జనసేన అనే పార్టీ ఉంది’ అనిపించేలా, ఆ పార్టీ అడుగులు ఉంటాయన్నది జనాభిప్రాయం.

వైఎస్సార్‌టీపీ పేరుతో తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల, సమయం వచ్చినప్పుడల్లా కేసీఆర్ సర్కారును ఉతికి ఆరేస్తున్నారు. పాదయాత్రలతో హల్‌చల్ చేస్తున్నారు. ప్రజాసమస్యలపై ప్రత్యక్ష పోరాటం చేస్తున్నారు. వెళ్లిన ప్రతిచోటా, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అవినీతి చిట్టా విప్పుతున్నారు.

ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతికి వ్యతిరేకంగా, ఢిల్లీకి వెళ్లి మరీ ఫిర్యాదు చేశారు. తెలంగాణలో షర్మిల పార్టీ ప్రభావం ఎంతన్నది పక్కకుపెడితే, ఆమె ఎంచుకున్న మార్గాన్ని అభినందించాల్సిందే. ఆ పార్టీలో ఆమె కూడా పవన్ మాదిరిగానే వన్‌మ్యాన్ ఆర్మీనే. అయినా ఆ పాటి తెగింపు-వ్యూహం, పదేళ్ల జనసేన పార్టీకి లేకపోవడమే ఆశ్చర్యం.

ఈ పదేళ్లలో పవన్ కల్యాణ్.. ప్రజలలో తనకు సంబంధించి పాతుకుపోయిన కొన్ని అనుమానాలకు, తన చర్యల ద్వారా తెరదించలేకపోయారు. బీజేపీతో తన సంబంధాలు మినహాయించి, మరే అంశంలోనూ ఇంకా స్పష్టత ఇవ్వలేకపోవడమే ఆశ్చర్యం. బంద రు సభలో పొత్తులపై పెదవి విప్పిన పవన్.. కనీసం దానిపైనా సూటిగా చెప్పలేకపోయారు.

‘అత్తారింటికి దారేదీ సినిమా’లో ‘చెట్టు దగ్గర నిలబడి నువ్వు మనుసులో ఏం కోరుకుంటున్నావో అది జరుగుతుంది బద్దం’ అని డైలాగు చెప్పినట్లు.. పొత్తుపై మీరేం కోరుకుంటున్నారో అదే జరుగుతుంది అని అస్పష్టంగా చెప్పడమే వింత. నిజంగా జనసేనలో పొత్తుపై భిన్నాభిప్రాయాలున్నాయి. మెజారిటీ శాతం టీడీపీతో కలసి వెళ్లాలని కోరుకుంటోంది. కమ్మ వర్గ పెత్తనాన్ని తొలి నుంచీ వ్యతిరేకించే కాపు కుల ప్రభావిత జనసైనికులు మాత్రం ఒంటరిగా పోటీ చేద్దామంటున్నారు. మరి ఆ లెక్కన ఏకకాలంలో వారిద్దరూ కోరుకుంటున్న కోరిక ఎలా నెరవేరుతుందన్నది ప్రశ్న.

బహుశా పవన్ దానిని వ్యూహం అనుకోవచ్చు. కానీ ప్రజలు దానిని వ్యూహం అనుకోరు. పొత్తుపై ఇంకా గందరగోళంలో ఉన్నారనుకుంటారు. పవన్‌లో ఇంకా స్పష్టత రాలేదనుకునే ప్రమాదం లేకపోలేదు. తనకు భయం లేదని.. ఎవరిపైనా ఎక్స్‌ట్రా ప్రేమలు లేవని.. చంద్రబాబుపై గౌరవం ఉందని చెప్పినప్పుడు… టీడీపీ-జనసేన పొత్తులో, మనకు 25 సీట్లు ఇస్తారన్న వైసీపీ సోషల్ మీడియా ప్రచారం నమ్మవద్దని చెప్పినప్పుడు… వైసీపేయుల రెండు తొడలు బద్దలు కొడతానని గద్దించినప్పుడు.. తాను ఎవరితో పొత్తు పెట్టుకుంటానో చెప్పకుండా, గుప్పిట బిగించడమే వింత.

బందరులో పవన్ ప్రసంగం విన్న మెడపై తల ఉన్న ఎవరికైనా.. జనసేన పార్టీ టీడీపీతో వెళ్లబోతోందనిపిస్తుంది. ఆ ముక్క చెప్పడానికి అంత డొంకదారి డైలాగులు వేస్టు కదా? దానివల్ల అపరిపక్వత- అస్పష్టత అంటూ తనపై ఉన్న బలమైన ముద్రలను కొనసాగించడం తప్ప.. అదనంగా వచ్చే లాభమేమీ లేదన్నది, పవన్‌ను అభిమానించే వారి వ్యాఖ్య.

బందరు సభలో పవన్ తన మొహమాటం చాలావరకూ విడిచిపెట్టి, కులనేతగా అవతరించే ప్రయత్నం చేసినట్లే కనిపించింది. పోనీ దానిలో కూడా స్పష్టత ఉంటే బాగుండేది. తాను ఒక కులం కోసం పనిచేసే నాయకుడిగా మిగలనని చెప్పినప్పుడు.. ఆయనే చెప్పినట్లు, కాపులు పవన్‌ను ఎందుకు ఓన్ చేసుకుంటారు? ఎందుకు ఓన్ చేసుకోవాలన్నది సహజంగా తెరపైకొచ్చే ప్రశ్న.

కాపులు పెద్దన్న పాత్ర పోషించాలన్న ఆయన వ్యక్తిగత కోరిక మంచిదే అయినప్పటికీ, అందుకు మిగిలిన కులాలు అంగీకరిస్తాయా? అన్నది ఇంకో ప్రశ్న. అసలు ఆంధ్రా ప్రజలు కులాల రొంపిలో కూరుకుపోయారని తరచూ వాపోయే పవనే.. మళ్లీ కులాల ప్రస్తావన, పెద్దన్న పాత్ర లాంటి పదాలు వాడితే, దానిని సమాజం హర్షిస్తుందా అన్నది మరో ప్రశ్న.

అసలు ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి గానీ.. తెలంగాణ సీఎం కేసీఆర్ గానీ.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గానీ.. ఏనాడూ రెడ్డి-వెలమ-కమ్మ నేతలుగా చెలామణి అయ్యే ప్రయత్నాలు చేయలేదు. వారు ఆయా కులాల సభలకు హాజరయిన సందర్భాలూ లేవు. వాటికి వారి పార్టీల్లోని ఆయా కులనేతలు హాజరయి ఉండవచ్చు. అది వేరే విషయం. కానీ ఆ ముగ్గురూ తమ పార్టీని ప్రజాక్షేత్రంలో ఉంచి, రాజకీయ పోరాటాలు చేశారే తప్ప, తమ కులం కోసం పోరాడిన దాఖలాలు లేవు.

అయినా సరే.. వైసీపీ రెడ్డి పార్టీ, టీడీపీ కమ్మ పార్టీ, బీఆర్‌ఎస్ వెలమ పార్టీగానే భావిస్తారు. ఇప్పుడు పవన్ తనకు కులాలు లేవని, తనకు అన్ని కులాలు సమానమేనని ఎంత చెప్పినా.. జనసేనను కాపు పార్టీగానే చూస్తున్నారు. మరి మళ్లీ ప్రత్యేకంగా కుల ముద్ర వల్ల, నష్టమే తప్ప లాభమేమిటన్నది ప్రశ్న.

కాపు ఉద్యమాలకు శ్రీకారం చుట్టిన వంగవీటి మోహనరంగా-కన్నా లక్ష్మీనారాయణ ఇద్దరూ కాంగ్రెస్‌లో ఉండి, కాపు నేతలుగా గుర్తింపబడ్డారే తప్ప… కాపు నేతలుగా కాంగ్రెస్‌లో రాణించలేదు. ఆ అజెండాతో ఎన్నికల్లో గెలవలేదు. వారికి పార్టీ బలం మాత్రమే అక్కరకు వచ్చింది. సహజంగా కులం సహకరించింది.

వంగవీటి రంగా ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో, బ్రాహ్మణుల సంఖ్య ఎక్కువ. ఆ ప్రకారం రంగా అక్కడ గెలవకూడదు. బ్రాహ్మణులు మాత్రమే గెలవాలి. కానీ ఆయన బ్రాహ్మణులు, కమ్మ వర్గంతో కలసిపోయారు. అదే ఆయన విజయరహస్యం.

ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కన్నా లక్ష్మీనారాయణ ప్రాతినిధ్యం వహించిన కన్నాను, పెదకూరపాడులో గెలిపించింది కమ్మ వర్గం వారంటే ఆశ్చర్యపడక తప్పదు. అక్కడ కమ్మ వర్గం సంఖ్య ఎక్కువకాబట్టి, ఆ ప్రకారం ఆయన అక్కడ గెలవకూడదు. గుంటూరులో బ్రాహ్మణులు, వైశ్యులు, క్రైస్తవులు కన్నాలక్ష్మీనారాయణ గెలుపులో కీలకపాత్ర పోషించారు. అక్కడ కాపులు ఆయనకు అదనపు బలంగా నిలిచారంతే.

ఓ యజ్ఞంలో కన్నా లక్ష్మీనారాయణకు బ్రాహ్మణులు జంద్యం వేసి, కొద్దికాలం బ్రాహ్మణుడిగా మార్చిన వైనం ఎంతమందికి తెలుసు? ఓ లబ్ధప్రతిష్ఠుడైన కాపు నేత, ఆవిధంగా బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం, జంద్యం వేసుకుంటారని ఎవరైనా ఊహిస్తారా? ఇవన్నీ.. ఒక నాయకుడికి, పార్టీకి కులమే కొలమానం కాదని చెప్పే సంకేతాలు.

కాంగ్రెస్-టీడీపీలో ఉన్నప్పుడు గెలిచిన ముద్రగడ పద్మనాభం, ఆ తర్వాత ఏ ఎన్నికల్లోనూ కనిపించలేదు. సహజంగా అయితే కాపునేతగా లబద్ధ ప్రతిష్ణుడైన ముద్రగడ, కాపుకార్డుతో సొంతంగా పోటీ చేసి గెలవాలి. కాపు సంక్షేమసంఘం తెరిచిన హరిరామజోగయ్యదీ అదే దారి. వీళ్లిద్దరే కాదు. కులం పేరుతో మనుగడ సాగించే ఏ నాయకుడైనా సొంతంగా పోటీ చేసి, వారి కులాల ఓట్లతో గెలవాలి. కానీ వారంతా ఆ సాహసం ఎందుకు చేయరు?

పవన్ కల్యాణ్ తన కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్న, రెండు నియోజకవర్గాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకుని పోటీ చేసినప్పటికీ.. అదే కాపులు ఆయనను జాగ్రత్తగా ఓడించడాన్ని విస్మరించలేం. పాలకొల్లులో చిరంజీవిని ఇప్పుడు పవన్ పంచన చేరిన ఓ కాపు ప్రముఖుడే దగ్గరుండి మరీ ఓడించారు. అక్కడ చిరంజీవి గెలిస్తే, తన కుమారుడికి రాజకీయ భవితవ్యం ఉండదన్న ముందుచూపుతో, చిరంజీవిని దగ్గరుండి మరీ ఓడించారు.

మాదిగ రిజర్వేషన్ ఉద్యమంతో భూకంపం పుట్టించిన మందకృష్ణమాదిగకు.. పవన్ మాదిరిగానే, ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్. మాదిగ వర్గంలో ఆయన పిలుపే ప్రభంజనం. పాదయాత్రలు, ఆమరణ నిరాహారదీక్షలు, అరెస్టులు ఆయనకు కొత్తేమీ కాదు. అలాంటి ఇమేజ్ ఉన్న మందకృష్ణ.. తన సామాజికవర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్న మధిరలో పోటీ చేసి ఓడిపోయారు. ఆయన వర్గమే కృష్ణను గెలిపించలేకపోయింది. కారణం ఏ రాజకీయ పార్టీ అండలేకపోవడం.

ఇక బీసీ వర్గాల్లో పేరున్న ఆర్.కృష్ణయ్య.. క్యాడర్ పార్టీ అయిన టీడీపీ అభ్యర్ధిగా, రెడ్లు-కమ్మ బలంగా ఉన్న ఎల్‌బీనగర్ నియోజకవర్గం నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకు అక్కడి బీసీలు అదనపు బలమయ్యారు. అదే కృష్ణయ్య నియోజకవర్గం- పార్టీ మారి పోటీచేసినప్పుడు ఓడిపోయారు. అక్కడ ఆయనకు బీసీ నేత కార్డు అక్కరకు రాలేదు. ఇలా కులాల గురించి రాస్తే రామాయణం. మాట్లాడితే మహాభారతం!

ఇన్ని అనుభవాలు కళ్లెదుట ఉండగా.. జనసేనాధిపతి పవన్ తనను తాను ఒక కులానికి పరిమితమయ్యే ప్రయత్నాలు, ఎందుకు చేస్తున్నారన్నదే ప్రశ్న. పవన్‌కు జనంలో ఇమేజ్, యూత్‌లో క్రేజ్ ఉన్నప్పుడు, ఆయన కూడా ఓ రాజకీయ నాయకుడిగానే ఎదగాలే తప్ప.. ఓ కులనేతగా అవతరించే ప్రయత్నాల వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. వైసీపీకయినా, టీడీపీకయినా అన్ని కులాలు సహకరిస్తేనే అధికారం దక్కింది. అయితే వాటిలో సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న రెండుమూడు కులాల తోడు గెలిచేందుకు దోహదపడి ఉండవచ్చు. కానీ తమ సొంత కులాల ఓట్లతోనే ఆ రెండు పార్టీలు గెలవలేదు.

కాపు-బీసీ-ఎస్సీ కలసి పనిచేయాలన్నది పవన్ కోరిక. సంకల్పం మంచిదే. అది మంచి ప్రయోగం కూడా. ఎక్కడో ఒకచోట మార్పు మొదలుకావాలి. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులున్నాయా అన్నది ఒక ప్రశ్నయితే.. అసలు రాజకీయ అజెండాతో ప్రజాక్షేత్రంలో యుద్ధం చేయాల్సిన పార్టీకి, కులాలను కలపడమనే అజెండా ఎందుకన్నది పవన్‌ను అభిమానించే వారి ప్రశ్న.

ప్రజలు పవన్ కల్యాణ్‌లో సంఘసంస్కర్త రాజారామ్మోహన్‌రాయ్, వీరేశలింగం పంతులును చూడటం లేదు. జనసేన పార్టీ అధ్యక్షుడిగానే చూస్తున్నారు. చూస్తారు కూడా. కాబట్టి నేలవిడిచి సాము చేయడం మాని, అక్కరకురాని అజెండాలు పక్కనపెట్టి, స్పష్టతతో కూడిన రాజకీయాలు చేస్తే పవన్.. ‘పొలిటికల్ పవర్ స్టార్’ కావడం పెద్ద కష్టం కాదు. అయితే అందుకు కావలసిందల్లా స్పష్టత, అంశాలపై అవగాహన, నిలకడ మాత్రమే!

Leave a Reply