Suryaa.co.in

Andhra Pradesh

పెట్రోల్ తో వచ్చి పోలీసులపై దాడి చేశారంటూ 23 మంది రైతుల అరెస్టు దుర్మార్గం

అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య

ఆర్ ఫై జోన్ ను వ్యతిరేకిస్తూ రైతులు శాంతియుతంగా దొండపాడు లో చేస్తున్న ఆందోళనలను కూడా ప్రభుత్వం సహించలేకపోతుందని, పెట్రోల్ తో వచ్చి పోలీసులపై దాడికి పాల్పడ్డారంటూ 23 మంది రైతులపై నాన్ బెయిల్ సెక్షన్ల కింద కేసులు పెట్టి, అరెస్టు చేశారని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ఆరోపించారు.

సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సిఆర్డీఎ మాస్టర్ ప్లాన్ మార్చి, గతంలో పలు పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించిన 1138 ఎకరాలను సెంటు పట్టాలుగా ఇచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు నిరసన తెలపటంలో తప్పేముందన్నారు. ఒక ప్రక్క సుప్రీం కోర్టులో వాదనలు జరుగుతుంటే తొందరెందుకు? అన్నారు. రైతుల్ని వేధించేందుకు కాదా అని ప్రశ్నించారు.

రాజధానిలో రైతులు కాలు తీసి, కాలు కదిపితే కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. రాజధాని ఉద్యమంలో క్రియాశీలకంగా ఉంటున్న ఉద్యమకారులను గుర్తించి కేసులు పెట్టడం ద్వారా ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారన్నారు.

రైతులు పెట్రోల్ సీసాలతో వచ్చి పోలీసులపై దాడి చేసే పరిస్థితి రాజధాని ప్రాంతంలో ఉంటే, ముఖ్యమంత్రి చిద్విలాసంగా తాడేపల్లిలో ఉండేవారా? అని ప్రశ్నించారు.సిఎం ఫ్లెక్సీలు రాజధానిలోని అన్ని గ్రామాల్లో చెక్కుచెదరకుండా ఉండేవా? అని పేర్కొన్నారు.

పాపం పండే కాలం కోసం రాజధాని రైతులు ఎదురు చూస్తున్నారని అభిప్రాయ పడ్డారు. ఇలాంటి దమనకాండ తోనే న్యాయమైన రైతు ఉద్యమాన్ని అణచి పైశాచిక ఆనందం పొందుతున్నారని ధ్వజమెత్తారు.

ఇలాంటి కేసులు రాజధాని రైతులకు కొత్త కాదని, నియంత చర్యల ద్వారా ప్రభుత్వం తన గోతిని మరింత లోతుగా తవ్వుకుంటుందని మండిపడ్డారు. వెంటనే రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని బాలకోటయ్య డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE