– నిబంధనలు పాటించని ఏపీ సీఐడీ
– సుప్రీం ఆదేశాలు పాటించని పోలీసులను ఉద్యోగాల నుంచి తొలగించండి
– మేధావులు ఏకం కాకపోతే ప్రజాస్వామ్యం పతనం
– ఎంపీ రఘురామకృష్ణంరాజు
74 ఏళ్ల సీనియర్ జర్నలిస్టు అంకబాబును సీఐడీ పోలీసులు నిబంధనలు పాటించకుండా రాత్రి వేళ అరెస్టు చేయడం అమానుషం, అనాగరికమని నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఖండించారు. 41 ఏ నిబంధన ప్రకారం నోటీసు ఇవ్వకుండా, ఇంట్లో భార్యకు సమాచారం ఇవ్వకుండా తీసుకువెళ్లడం సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనన్నారు.
‘‘ముందు అరెస్టు చేసి తీసుకువెళ్లడం, తర్వాత కోర్టు ఆదేశాలతో వారు బయటకు రావడం వంటి చర్యలన్నీ ప్రభుత్వాన్ని ఎదిరించే వారికి, జగన్ ప్రభుత్వం చేసే హెచ్చరికల సంకేతమే. చట్టాలను ప్రత్యర్థులను బెదిరించేందుకు వాడుతున్న జగన్ ప్రభుత్వ ధోరణులపై మేధావులు ఏకమై ప్రశ్నించకపోతే ప్రజాస్వామ్యం సమాధి అవుతుంద’’ని రాజు హెచ్చరించారు.
కనీసం వయసును కూడా చూడకుండా అంకబాబును అరెస్టు చేయడం అనాగకరిమన్నారు. కనీస మర్యాద, సంస్కారం కూడా పాటించిన సీఐడీ పోలీసులపై కోర్టులు చర్యలు తీసుకుంటాయని ఆశిస్తున్నామన్నారు. ‘41ఏ నిబంధనలు పాటించని పోలీసులను తక్షణం ఉద్యోగాల నుంచి తొలగించడమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం. లేకపోతే పోలీసులు ఇళ్లకు వెళ్లి అరెస్టు చే యడం, తర్వాత న్యాయమూర్తులు పోలీసులను మందలించి వారిని పంపించటం ఏపీలో సాధారణంగా మారిపోతుంది. అదే సుప్రీంకోర్టు ఆదేశాలు ఉల్లంఘించిన పోలీసులను ఉద్యోగాలనుంచి తొలగిస్తే, మరొకసారి అలాంటి తొందరపాటు చర్యలకు పాల్పడ్డారు. అసలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని భావించేవారిని భయభ్రాంతులను చేయడమే సీఐడీ లక్ష్యం. ఇప్పుడు జరుగుతున్నది అదేన’ని ఎంపీ రాజు వ్యాఖ్యానించారు.