• గాయాల పాలైనవారికి… చేయి విరిగిన రైతుకు వైద్యం బాధ్యత ప్రభుత్వానిదే
– జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్
రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు చేపట్టిన పాదయాత్రకు సంఘీభావం తెలియచేసేందుకు వచ్చిన వారిపై ప్రకాశం జిల్లాలో పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడం దురదృష్టకరం. మద్దతు చెప్పడం, సంఘీభావం తెలియచేయడం ప్రజాస్వామ్యంలో భాగమే. అదేమీ నేరం కాదు. రైతులు చేపట్టిన కార్యక్రమానికి సంఘీభావాన్ని చెప్పేవారిని అడ్డుకోవడం అప్రజాస్వామిక చర్యే. పలువురికి గాయాలయ్యాయని, ఓ రైతుకు చేయి విరిగిందని సమాచారం అందింది.
వీరికి అవసరమైన వైద్యం అందించే బాధ్యత ప్రభుత్వానిదే. ఈ యాత్ర వార్తల కోసం వెళ్ళిన పాత్రికేయులను సైతం పోలీసులు నియంత్రిస్తుండటం మీడియా సిబ్బంది విధులకు ఆటంకం కలిగించడమే. పోలీసులు ఈ యాత్రపై ఆంక్షలు పెంచడం, అడ్డంకులు కల్పించడంలో అసలు ఉద్దేశం ఏమిటో రాష్ట్ర ప్రజానీకానికి స్పష్టంగా అర్థం అవుతూనే ఉంది. రోడ్లను దిగ్బంధించి, చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కట్టడి చేయాల్సిన అవసరం ఏమిటి? ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడంతోపాటు రైతుల యాత్రను విఫలం చేయడానికే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగుతోంది.