-మాజీ ప్రధాని నెహ్రూ ఫోటో లేకుండా అజాది కా అమృత్ ఉత్సవాలు నిర్వహించడం తగదు
-నెహ్రూ స్థానంలో సావర్కర్ ఫోటో పెట్టినంత మాత్రాన చరిత్ర మారదు
-చదువు రాని ప్రధాని ఉంటే చరిత్రను ఇట్లనే వక్రీకరిస్తారు
-త్యాగాలు చేసిన మహనీయులకి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ బిజెపీ పై ఫైర్
-విద్యార్థి, యువజన కాంగ్రెస్ నాయకుల అరెస్టుల పట్ల ఖండన
-సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
స్వాతంత్ర సంగ్రామ చరిత్రను వక్రీకరించే విధంగా బీజేపీ సర్కార్ అజాది కా అమృత్ పేరిట ఉత్సవాలు నిర్వహించడాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రంగా తప్పుబట్టారు. శనివారం హైదరాబాద్ అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దశాబ్ద కాలం పైగా జైలు జీవితం గడిపి, దేశ స్వాతంత్రం కోసం పోరాడి, నవ భారత నిర్మాణం చేసిన మహనీయుడు మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఫోటో లేకుండా అజాది కా అమృత్ ఉత్సవాలు ఏలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల చరిత్రను వక్రీకరించే విధంగా హైదరాబాద్ సాలర్జంగ్ మ్యూజియంలో అజాది కా అమృత్ ఉత్సవాల పేరిట నిర్వహించిన ప్రదర్శనలోదేశం కోసం పోరాడిన మాజీ ప్రధాని నెహ్రూ ఫోటో పెట్టాలని అడగడానికి వెళ్లిన యువజన కాంగ్రెస్ నేతలు 12 మందిని అరెస్ట్ చేసి కాంచన్ బాగ్ పోలీస్ స్టేషన్లో బంధించడం దుర్మార్గమన్నారు.
అదేవిధంగా జూన్ 12న కేంద్ర ప్రభుత్వం నిర్వహించే రైల్వే బోర్డు రిక్రూట్మెంట్ పరీక్షలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే టెట్ పరీక్ష ఒకే రోజు ఉండటం వల్ల నిరుద్యోగులు ఏదో ఒక దానికి మాత్రమే హాజరుకావాల్సిన పరిస్థితి ఉండటంతో టెట్ పరీక్షలను వాయిదా వేయాలని ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని కలిసి వినతి పత్రం ఇవ్వడానికి వెళుతున్న వెంకట్ తో పాటు మరో 21 మందిని అరెస్టు చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించడాన్ని తీవ్రంగా ఖండించారు.
అరెస్టు చేసిన విద్యార్ధి, యువజన కాంగ్రెస్ నేతలను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పరిపాలనలో భావ స్వేచ్ఛను హరించే విధంగా గా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. జాతిపిత మహాత్మా గాంధీ, ప్రధాని నెహ్రూ లేకుండా స్వాతంత్ర సంగ్రామ చరిత్ర లేదన్నారు. 1947 ఆగస్టు15 స్వాతంత్రం వచ్చే వరకు జరిగిన అనేక దశల్లో జరిగిన పోరాటంలో చాచా నెహ్రూ కీలకంగా వ్యవహరించారని వివరించారు.
దేశ స్వాతంత్రం కోసం జాతిని మేల్కొల్పి ఉత్తేజం నింపిన అనేక పోరాటాలకు నాయకత్వం వహించడమే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాల్లో పర్యటించి దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ పాలకులపై ఒత్తిడి పెంచేందుకు వివిధ దేశాల మద్దతు కూడగట్టిన మహనీయుడు చాచా నెహ్రూ అని అన్నారు. స్వాతంత్రం సిద్ధించిన తర్వాత పంచవర్ష ప్రణాళికలు ఏర్పాటు చేసిన భారత్ నిర్మాణం చేసిన గొప్ప దార్శనికుడు అని పేర్కొన్నారు. ఇంతటి చరిత్ర కలిగిన చాచా నెహ్రూ ఫోటో లేకుండా బిజెపి అజాది కా అమృత్ ఉత్సవాలు నిర్వహించడం మహనీయులను అవమానించడమేనని బిజెపిపై ఫైర్ అయ్యారు. స్వాతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ పాలకుల అడుగులకు మడుగులొత్తి క్షమాభిక్ష కోరిన సావర్కర్ ఫోటోను ఆజాది కా అమృత మహోత్సవాల్లో ప్రదర్శిస్తూ చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీని ప్రజలు క్షమించరని తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. దేశ చరిత్ర పైన అవగాహన లేకుండా ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి రావాలన్న ఆలోచన తప్ప జాతి నిర్మాణం కోసం బిజెపి ఆలోచన చేస్తున్నట్టు కనిపించడం లేదన్నారు. నెహ్రూ స్థానంలో సావర్కర్ బొమ్మ పెట్టి కుట్రపూరితంగా ప్రభుత్వ సొమ్ముతో తప్పుడు ప్రచారం చేసినంత మాత్రాన చరిత్ర మారదని అన్నారు. దేశ స్వాతంత్రం కోసం తమ ప్రాణాలను లెక్క చేయకుండా అనేక పోరాటాలు చేసి ఆస్తులను, వయసును, కుటుంబాన్ని కోల్పోయి త్యాగాలు చేసిన వారికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రధాని మోడీ, బిజెపి నాయకులను నిలదీశారు. చదువుకోని వారు ప్రధానులు అయితే, ఎవరో రాసి ఇచ్చిన స్క్రిప్టును చదివితే ఇలాగే చరిత్రను వక్రీకరిస్తారని ఎద్దేవా చేశారు.
ఎన్టీఆర్ కు నివాళి
దేశ రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. సామాజిక మార్పుకు కృషి చేసిన మహా నేత నందమూరి తారక రామారావు అని కొనియాడారు.