-సంజయ్ వ్యాఖ్యలు మధ్యయుగం నాటి రాచరిక వ్యవస్థకు అద్దం పడుతున్నాయి
-సంజయ్ వ్యాఖ్యలను కట్టడి చేయాల్సిన అవసరం ప్రభుత్వంపైన ఉంది
“రాష్ట్రంలోని మసీదులను తవ్విచూద్దాం… శవాలు వస్తే అది మీది, శివాలు (శివలింగం) వస్తే అది మాది… అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ చేసిన వ్యాఖ్యలను” సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఆనాటి రాచరిక, మధ్యయుగం కాలంలో జరిగిన అరాచకాలకు అద్దం పట్టే విధంగా ఉన్నాయన్నారు. నాటి రాచరిక, మధ్యయుగంనాటి వ్యవస్థ బాగాలేదని దేశ ప్రజలు పోరాడి ప్రజాస్వామ్య పరిపాలన తెచ్చుకున్నారని తెలిపారు. నవభారత నిర్మాణం చేసుకుంటూ… భారతదేశం శాస్త్రీయంగా అభివృద్ధి చెందుతూ ప్రపంచంతో పోటీ పడుతున్న క్రమంలో ఆశాస్త్రీయ ఆలోచనలకు అద్దం పట్టే విధంగా, మధ్యయుగం నాటి వ్యవస్థకు ఈ దేశాన్ని తీసుకువెళ్లే విధంగా సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఉండటం దురదృష్టకరమన్నారు.
ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో రాజకీయ లబ్ధి కోసం మతం పేరిట కలహాలను సృష్టించే బండి సంజయ్ ప్రవర్తనను ప్రభుత్వం కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలు మాట్లాడే వారున్న దేశములో అన్ని మతాలను గౌరవించాలన్నారు. కానీ, రాజకీయ లబ్దికోసం సమాజంలో మతాల మధ్య వైషమ్యాలను సృష్టించి విభజన తీసుకువచ్చి అధికారంలోకి రావడానికి బిజెపి కుట్రలు చేస్తుందని, బండి సంజయ్ వ్యాఖ్యలు కూడా అందులో భాగమేనని పేర్కొన్నారు.
ఉర్దూ భాష భారతీయ భాషగా గుర్తింపు పొందిందని, ఇప్పుడు దానిని రద్దు చేస్తామనడము అవివేకమన్నారు. మైనారిటీ రిజర్వేషనులను రద్దు చేస్తామని అంటున్న బిజెపి భవిష్యత్తులో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను కూడా రద్దు చేయాలనే వాదన తీసుకువచ్చే ప్రమాదం ఉందన్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి వారిని తెలంగాణలో తిరగకుండా కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సూచించారు.