* మతిభ్రమించి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు
*వైసీపీ ఎన్ని కుయుక్తులు పన్నినా వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి తథ్యం
*తాడేపల్లి ప్యాలెస్ నుంచి లోటస్ పాండ్ కో, బెంగళూరు ప్యాలెస్ కో పారిపోవడం ఖాయం
*విజయవాడ మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించిన నాటి నుంచి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి నిద్రపట్టడం లేదని, ఓటమి భయంతో మతిభ్రమించి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని పార్టీ అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ వ్యాఖ్యానించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తథ్యమని, ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ వదిలి హైదరాబాద్ లోటస్ పాండ్ కో… లేకపోతే బెంగళూరు ప్యాలెస్ కో వెళ్లిపోవడం ఖాయమన్నారు.
మంగళవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పోతిన మహేష్ మాట్లాడుతూ “పవన్ కళ్యాణ్ పేరు వినగానే ముఖ్యమంత్రి ఆందోళన చెందుతున్నారు. ఓటమి భయంతో జ్వరంపట్టుకొంది. అలాగే ప్రతిపక్షాలు ఒక్క తాటిపైకి వస్తునందుకు కడుపుమంటతో బాధపడుతున్నారు. ముఖ్యమంత్రి జ్వరం తగ్గడానికి డోలో, కడుపు మంట తగ్గడానికి ఈనో వాడితే మంచింది.
సీఎం కాల్ షీట్ల కోసం సీబీఐ ఎదురు చూస్తోంది
బాబాయ్ హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదన్న వార్తలతో ముఖ్యమంత్రికి మనశ్శాంతి లేకుండా పోయింది. అవినీతి కేసులో అరెస్టు అయి బెయిల్ మీద బయటకు వచ్చిన ముఖ్యమంత్రికి ఎప్పుడు బెయిల్ రద్దవుతుందో అనే భయం ఉంది. వీళ్లిద్దరి కాల్ షీట్ల కోసం సీబీఐ ఎదురు చూస్తోంది. అతి తొందరలోనే అరెస్టులు తప్పవు. గత ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు చేసి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఓడించారు. ఈసారి ఆయన భారీ మెజార్టీతో గెలవడంతోపాటు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ సాధించడం ఖాయం.
జగన్ మాదిరి కుట్రలు, కుతంత్రాలు చేయడం చేతకాదు
అధికారాన్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి వేలకోట్లు దోచుకుంటున్నారు. ఇసుక, మద్యం, మట్టి మాఫియాలతో కోట్లు వెనకేసుకుంటున్న ఆయన పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది. జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తో పాటు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను వైసీపీలో చేర్చుకున్నారు. వారికి ఎంత ప్యాకేజీ ఇచ్చి తీసుకున్నారో ప్రజలకు సీఎం సమాధానం చెప్పాలి. రాష్ట్రాన్ని దోపిడి దొంగలకు అడ్డాగా మార్చేశారు. కడపలో వందల సంఖ్యలో కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే వారి కుటుంబాలకు అండగా నిలబడి ఆర్థిక సాయం చేసింది పవన్ కళ్యాణ్ .
కనీసం సొంత నియోజకవర్గమైన పులివెందులలో చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలకు కూడా జగన్ భరోసా కల్పించలేకపోయారు. అందరూ ఆయన మాదిరి మాయలు, మోసాలు, కుట్రలు, కుతంత్రాలు చేస్తారని అనుకోవడం పొరపాటు. ఆయనలా కోడి కత్తి డ్రామాలు, బాబాయ్ ను గొడ్డలితో చంపించడం అందరికి చేతకాదు. గెలుపు కోసం పని చేసిన తల్లిని, చెల్లిని గెంటేసిన జగన్ కూడా పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తున్నారు అని జనం నవ్వుతున్నారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు సీపీఐ అడిగితే… ఒక బీసీ అయిన నాకు మాటిచ్చినందుకు కుదరదు అని చెప్పారు. సీపీఐకి మంగళగిరి సీటు కేటాయించి, పశ్చిమ సీటును నాకిచ్చారు. ఇచ్చిన మాట కోసం బీసీలకు అండగా ఉన్నందుకు ఆయనపై విషప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పై బురద జల్లాలని చూస్తే ముఖ్యమంత్రి ని బీసీలు ఉపేక్షించరు” అని హెచ్చరించారు.