– ఎమ్మెల్యేల గ్రాఫ్ బాగాలేదన్న ముఖ్యమంత్రి తన గ్రాఫ్ గురించి ఆత్మ విమర్శ చేసుకోవాలి
– సీఎంను కాల్చిచంపమన్నప్పుడు అప్పుడు మీకు 41ఏ నోటీసు ఇచ్చిందా?
– ప్రతిపక్షాలు విమర్శించకుండా పొగుడుతాయా జగన్ గారూ?
– ఎంతమందిని కేసులతో వేధిస్తారు?
– సాక్షికి యాడ్స్ కోసమే బటన్లు నొక్కుతున్నారా?
– వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ధ్వజం
ప్రత్యేక హోదా కోసం పోరాడాలని, పోరాడలేని పక్షంలో కేంద్రం ఏమిస్తుందో దాన్ని సాధించాలని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు హితవు పలికారు. ప్రత్యేక హోదా సాధన కోసం, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఉన్న ఆవేశం.. ఇప్పుడు ఏమైందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రపతి ఎన్నికల ముందు, హోదా గురించి చేతులు కట్టుకొనైన అడగవచ్చు కదా ? అని ఎద్దేవా చేశారు.
గతంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేసులకు భయపడే చేతులు కట్టుకొని, హోదాను తాకట్టు పెట్టారన్న జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు అస్సలు ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. తమ పార్టీ వారు వేసిన ఒకటి ,అర, కేసులు ఆ కేసులు కూడా కొట్టివేశాక, అసలు కేసులే లేని చంద్రబాబునాయుడు కేసులకు భయపడి హోదాను తాకట్టు పెడితే, 32 ఆర్థిక నేరాల కేసుల అభియోగాలను ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి, కేసులకు భయపడి నోరు విప్పడం లేదని ప్రజలు అనుకునే అవకాశం లేదా? అని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా వస్తే అది ఇది అని చెప్పి ప్రజలను రెచ్చగొట్టగా, హోదా తీసుకువస్తాడని నమ్మి ఓట్లు వేసిన ప్రజలను జగన్మోహన్ రెడ్డి నడి సముద్రంలో ముంచారని విమర్శించారు.
పార్లమెంట్లో గాంధీ బొమ్మ వద్ద అందరూ తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు చేస్తుంటారని, కానీ తమ పార్టీ వారు ఎప్పుడు ఆందోళనలు చేసిన దాఖలాలు లేవన్నారు. కేవలం ఒకే ఒక్కసారి తనపై అనర్హత వేయాలని కోరుతూ మాత్రమే ఆందోళన చేశారంటూ ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు, ప్రత్యేక హోదా, పోలవరంపై నిత్యానందరావు చాలా స్పష్టంగా ప్రకటన చేశారన్నారు. విభజన హామీలను వీలైనంతవరకు అమలు చేశామని, ప్రత్యేక హోదాను, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయం వల్ల ఇవ్వలేమని స్పష్టం చేశారని వెల్లడించారు. ప్రత్యేక హోదా గురించి తమ పార్టీ నాయకత్వం పోరాడకపోయినా, యుద్ధం చేసినట్లు అభినయించడం కూడా లేదని అపహాస్యం చేశారు.
బుధవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుందో , అర్థం కాని పరిస్థితి నెలకొన్నదని రఘురామకృష్ణంరాజు అన్నారు. రాష్ట్ర కేబినెట్లో గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి , 2021 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన వీడియోను ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులకు ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం 2024 జులై నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని పేర్కొంటే, రాష్ట్ర మంత్రి మాత్రం ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేమని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో ఇట్టే అర్థమవుతుందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల గురించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టించుకున్న దాఖలాలు లేవని విమర్శించారు. పోలవరం ఇప్పట్లో పూర్తి కాదని, గతంలోనే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డిని కచ్చితంగా అంచనా వేయడంలో ఉండవల్లి అరుణ్ కుమార్ విజయం సాధిస్తే, తాను మాత్రం అంచనాలను తప్పానని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలను చేసిందన్న ఆయన, కాంట్రాక్టర్లకు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పి పి ఏ) కు మధ్య అసలు సమన్వయమే కనిపించడం లేదన్నారు.
పోలవరం ప్రాజెక్టు పనుల కు సంబంధించి 20080 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ ఉన్నాయని, 6000 కోట్ల రూపాయలు అడ్వాన్స్ గా ఇవ్వాలని కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వం కోరిందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహార శైలి తెలిసినా కేంద్రం నిధుల మంజూరీకి సుముఖంగా లేదని చెప్పారు. కార్పొరేషన్, స్పెషల్ పర్పస్ వెహికల్ పేరిట రుణాలను తీసుకున్న, అది రాష్ట్ర ప్రభుత్వ అప్పుగానే పరిగణించబడుతుందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఎఫ్ ఆర్ బి ఎం పరిమితికి లోబడి రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత అయితే రుణ పరిమితిని విధిస్తారో, ఆ రుణ పరిమితి పరిధిలోకి కార్పొరేషన్ అప్పులు వస్తాయన్నారు.
ఇతర ఖాతాల నుంచి సొమ్మును మళ్లించి బటన్ నొక్కే కార్యక్రమం, అప్పులు చేసి సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టడం తప్పని తాను గతంలోనే చెప్పానని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంకెల క్రమంలోనే కాకుండా, అప్పులలో కూడా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్నదని, నొక్కేసిన అప్పులను కూడా చెబితే బాహుబలి రికార్డులను కూడా రాష్ట్రం బద్దలు కొడుతుందని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఆదాయాన్ని సమకూర్చుకోకుండా, అప్పులు చేస్తే శ్రీలంక దారిలో పయనించక తప్పదని జయశంకర్ ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పేర్కొనడం జరిగిందని, ఈ విషయాన్ని తాను గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. అప్పులు చేసి, బటన్ నొక్కుతూ, సాక్షి దినపత్రికకు అడ్వర్టైజ్మెంట్లను ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు.
హరీష్ సాల్వే వాదనలు పూర్తిగా వినండి
ప్రభుత్వంలో జరుగుతున్న లోపాలను ఎత్తిచూపితే, సభ్యుడిపై అనర్హత వేటు వేసే అవకాశాలు లేవని, అదే పార్టీకి రాజీనామా చేసి ప్రశ్నిస్తే అనర్హత కిందకు వస్తుందని ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు చేశారని, హరీష్ సాల్వే పూర్తి వాదనల కాపీ చదవాలని ప్రభుత్వ పెద్దలకు ప్రభురామకృష్ణంరాజు సూచించారు. తాను పార్టీ వీడలేదని, బలహీన పడుతున్న తన పార్టీని చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు. తమకు పార్టీ నాయకత్వం ఎప్పుడూ విప్ జారీ చేయలేదని, తాను విప్ ను ఉల్లంఘించింది లేదన్నారు. తాను పార్టీకి రాజీనామా చేసి మరొక పార్టీలో చేరింది లేదన్నారు. అటువంటప్పుడు తనపై అనర్హత గురించి మాట్లాడడం అవివేకం అవుతుందన్నారు. తన అర్హత గురించి మాట్లాడితే, మాట్లాడుకోవచ్చునని తనకు భయం లేదన్నారు.
ఒంగోలు సభ చూసి డిప్రెషన్ లోకి వెళ్లొద్దు
ముఖ్యమంత్రి పాల్గొన్న ఒంగోలు సభ ను చూసి పార్టీ శ్రేణులు డిప్రెషన్ లోకి వెళ్లొద్దనీ రఘురామకృష్ణం రాజు అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సభలను మరిన్ని చూడవలసి వస్తుందని పేర్కొన్నారు. ఈ సభను చూసిన తర్వాత ముఖ్యమంత్రి గ్రాఫ్ పడిపోతున్నట్లు స్పష్టమవుతుందని చెప్పారు.. తన గ్రాఫ్ మాత్రమే బాగున్నదని, ఎమ్మెల్యేల గ్రాఫ్ బాగాలేదన్న ముఖ్యమంత్రి తన గ్రాఫ్ గురించి ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు.
రానున్న ఎన్నికల్లో 175 స్థానాలు గెలుస్తాం అంటున్నారని, అయితే ఒకటి ప్లస్ ఏడు ప్లస్ ఐదు కలిపి మొత్తం 13 స్థానాలకు పరిమితం అవుతామేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. అసలు ఎన్నికల ముందు మనం చెప్పింది ఏమిటి, చేస్తున్నది ఏమిటన్న ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. రాజకీయాలలో విమర్శలు సహజమని, ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్ష నేతగా మీరు ఎన్ని విమర్శలు చేయలేదని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని పట్టుకొని రోడ్డుమీదే కాల్చండి… బంగాళాఖాతంలో కలపండి… చెప్పులతో కొట్టండి అని మీరన్నప్పుడు, టిడిపి ప్రభుత్వం ఎన్నిసార్లు 41ఏ నోటీసులను జారీ చేసిందని ప్రశ్నించారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి పట్టాభికి 41ఏ కింద నోటీసులు జారీ చేయడం పట్ల ఆయన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు విమర్శించకుంటే ముఖ్యమంత్రిని పొగుడుతారా అంటూ ప్రశ్నించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగినన్ని రోజులు బలహీనపడుతున్న పార్టీ బలోపేతానికి పనిచేస్తానన్న ఆయన, ఈ సభకు మూడు వేలకు మించి ప్రజలు హాజరు కాలేదన్నారు. వరదలు తగ్గినప్పటికీ, సహాయక కార్యక్రమాలు మాత్రం సక్రమంగా జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వరద బాధితులకు నాలుగు బంగాళాదుంపలు, టమోటోలు, వంకాయలను ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. వరద బాధితుల పట్ల మానవత్వాన్ని ప్రదర్శించాలని సూచించారు. పట్టాభి, మహాసేన రాజేష్ పై ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు పెట్టాలన్న న్యాయస్థానాలు ఉన్నాయని చెప్పారు.