– దివ్యాంగుల పెన్షన్లపై కూటమి సర్కార్ కర్కశత్వం
– సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా గ్రీవెన్స్‌లో పాల్గొంటున్నాం
– అర్హతలుండీ పింఛన్లు కోల్పోయిన బాధితులతో వస్తాం
– మంత్రి డోలా వీరాంజనేయస్వామి రాగలరా?
– పింఛన్లు తొలగించి దివ్యాంగులను వేధిస్తున్నారు
– దివ్యాంగులకు అండగా వైయస్ఆర్సీపీ నిలబడుతుంది
– వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, బాపట్ల జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షుడు మేరుగు నాగార్జున
తాడేపల్లి: దివ్యాంగుల పట్ల ఈ ప్రభుత్వం జాలి దయ లేకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, వెరిఫికేషన్ పేరుతో లబ్ధిదారులను అనర్హులుగా ప్రకటించి వారి పొట్టకొడుతున్నారని వైయస్సార్సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాడేపల్లి లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… పింఛన్లపై ఆధారపడి జీవిస్తున్న వితంతులు, వృద్ధులు, వికలాంగుల పట్ల ఈ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఉద్దేశపూర్వకంగా అన్ని అర్హతలు ఉన్నా కూడా దివ్యాంగుల పట్ల మానవత్వం లేకుండా పెన్షన్లను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ వైయస్ఆర్సీపీ వారికి పోరాటానికి అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
దివ్యాంగులనే జాలి కూడా లేకుండా వారిని కూడా కూటమి ప్రభుత్వం వేధిస్తోంది. గత వైయస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో అర్హతే ప్రామాణింగా పింఛన్లు పంపిణీ చేస్తే, ఇప్పుడు తొలగించే కార్యక్రమం జరుగుతోంది. చనిపోయిన వారివే తీస్తున్నామని చెప్పుకుంటూ వాటి ముసుగులో రూ.15వేలు పింఛన్లు పొందుతున్న దివ్యాంగులను అనర్హుల కింద పేర్కొంటూ తొలగించేస్తున్నారు.
గడిచిన 14 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఏకంగా 5 లక్షలకు పైగా పింఛన్లు పీకేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎవరైనా చనిపోతేనే కొత్తవారికి పింఛన్లు వచ్చేవి. 2014-19 మధ్య సీఎం చంద్రబాబు కేవలం 30 లక్షల పింఛన్లు మాత్రమే పంపిణీ చేస్తే, వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 66 లక్షలకుపైగా పింఛన్లు పంపిణీ చేసి రికార్డు సృష్టించింది. అప్లికేషన్ పెట్టిన ఐదు రోజుల్లో వెరిఫికేషన్ చేసి పంపిణీ చేశాం.
మా ప్రభుత్వంలో 171 సదరం క్యాంపులు ఏర్పాటు చేసి త్వరితగతిన పింఛన్ల పంపిణీ చేశాం. పండగ, ఆదివారం, సెలవు రోజు అని లేకుండా లబ్ధిదారులకు వలంటీర్ల ద్వారా ఉదయాన్నే 6 గంటల నుంచే పింఛన్ల పంపిణీ మొదలు పెట్టిన ఘన చరిత్ర వైయస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కుతుంది. సదరం క్యాంపుల సంఖ్యను కూటమి ప్రభుత్వం 52కి తగ్గించేసింది. పేదలకు మేలు చేయాలన్న ఆలోచన ఉన్న వ్యక్తి కాబట్టే వైయస్ జగన్ ఇవన్నీ చేయగలిగారు. కానీ సీఎం చంద్రబాబు మాత్రం పింఛన్ల పంపిణీని బాధ్యతగా కాకుండా ప్రభుత్వానికి భారంగా భావిస్తున్నాడు.
వారం రోజులుగా పింఛన్లు తొలగిస్తున్నారనే బాధతో రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నా ఈ ప్రభుత్వం మనసు కరగడం లేదు. బాపట్ల జిల్లాలో రెండు కాళ్లు లేని చల్లా రామయ్య అనే దివ్యాంగుడు నిరసన తెలియజేడానికి సెల్ టవర్ ఎక్కితే అధికారులు కనీసం స్పందించలేదు.
దివ్యాంగుల విభాగం అధ్యక్షుడిగా ఉన్న చల్లా రామయ్య, జిల్లాలో 3860 దివ్యాంగుల పింఛన్లు తొలగించారని వారి తరఫున నిరసనకి దిగాడు. ఆర్డీవోకి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన చల్లా రామయ్యను పోలీసులు ఈడ్చుకుని వెళ్లి ఆస్పత్రిలో పడేశారు. వారికి అండగా నిలబడాలని వైయస్సార్సీపీ నాయకులు వెళితే 15 మంది మీద కేసులు పెట్టించారు. ఇదేనా ప్రజాస్వామ్యం. బాధితులకు అండగా నిలబడటం తప్పా? కాసులిస్తే వైకల్యం పెంచుతున్నారంటూ మీడియాలో వార్తలు రాయించి డాక్టర్లను దొంగలుగా, అవినీతిపరులుగా ఈ ప్రభుత్వం చిత్రీకరిస్తోంది. ఇంతకన్నా దిగజారుడుతనం ఇంకోటి ఉంటుందా?
సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగే గ్రీవెన్స్‌లో వైయస్సార్సీపీ నాయకులు పాల్గొని దివ్యాంగులకు జరుగుతున్న అన్యాయాలపై అధికారులతో మాట్లాడతారు. పార్టీ జిల్లా అధ్యక్షుల నేతృత్వంలో కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించడం జరుగుతుంది. అర్హత ఉండీ పింఛన్లు కోల్పొయిన దివ్యాంగులతో వైయస్సార్సీపీ నాయకులు వస్తారు. అన్ని జిల్లాల్లో మాదిరిగానే ప్రకాశం జిల్లాలో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. దీనికి సమాధానం చెప్పడానికి మంత్రి డోలా వీరాంజనేయస్వామి రాగలరా?
పింఛన్లు తీసేయలేదని చెప్పే కూటమి నాయకులు అదే నిజమని ఆధారాలతో నిరూపించాలి. దివ్యాంగ పింఛన్ల తొలగింపుపై బహిరంగ చర్చకు కూటమి నాయకులకు సిద్ధమా అని డిమాండ్ చేస్తున్నా. దివ్యాంగుల పింఛన్ల తొలగింపుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి. తొలగించిన పింఛన్లు పునరుద్ధరించాలి.