ఆంధ్రుల దశాబ్దాల కల.. కోట్లాది మంది రైతుల ఆశల పంట.. రాష్ట్రానికి జీవనాడి అయిన ‘పోలవరం’. ఈ మహాక్రతువు కోసం తమ పుట్టిన నేలను, చిన్ననాటి జ్ఞాపకాలను, ఆఖరికి కన్నతల్లి లాంటి ఇళ్లను వదిలిపెట్టి త్యాగం చేసిన వారు పోలవరం నిర్వాసితులు. రాష్ట్ర భవిష్యత్తు కోసం తమ సర్వస్వాన్ని ధారపోసిన ఆ త్యాగధనుల కన్నీళ్లకు గత ఐదేళ్లుగా విలువ లేకుండా పోయింది. కానీ, మళ్లీ ‘పోలవరం కూలీ’గా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు, ఆ త్యాగాలకు తగిన గౌరవాన్ని, న్యాయాన్ని చేకూరుస్తున్నారు.
చీకటి రోజులు.. అందని నీడ!
గత వైకాపా ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ప్రాజెక్టు వద్దకు రాజకీయ పక్షాలను, మీడియాను, కనీసం సమస్య చెప్పుకుందామనుకున్న బాధితులను కూడా రానివ్వలేదు. వరదల్లో ఇళ్లు మునిగిపోతున్నా, కనీస సాయం అందక నిర్వాసితులు పడ్డ ఆవేదన వర్ణనాతీతం. తమ ఆవేదన వినే నాథుడు లేక, హక్కుగా రావాల్సిన పరిహారం అందక వారు నాడు పడ్డ క్షోభ ఒక చీకటి అధ్యాయం.
బాధ్యతగా అక్కున చేర్చుకున్న ‘కూలీ’!
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ అశ్రువుల గాథలకు తెరపడింది. ప్రతీ సోమవారాన్ని ‘పోలవారం’లా భావిస్తూ.. ‘పోలవరం కూలీ’గా పనులు పర్యవేక్షించే చంద్రబాబు నాయుడు, నిర్వాసితులను కేవలం లబ్ధిదారులుగా చూడకుండా, రాష్ట్ర గౌరవాన్ని నిలబెట్టిన త్యాగమూర్తులుగా గౌరవిస్తున్నారు.
* భరోసా: కేవలం 21 నెలల వ్యవధిలోనే 26,149 మంది నిర్వాసితులకు రూ.1,943 కోట్ల భారీ పరిహారాన్ని ప్రభుత్వం నేరుగా వారి ఖాతాల్లోకి చేర్చింది.
* పండుగ కానుక: గత ఏడాది దీపావళికి, మొన్నటి సంక్రాంతికి పరిహారం ఇచ్చి అండగా నిలిచిన ప్రభుత్వం, ఇప్పుడు ఉగాది పండుగను పురస్కరించుకుని మూడో విడతగా రూ.226.61 కోట్లను అందజేసింది.
* నివాసం: 75 నిర్వాసిత కాలనీల్లో ఇప్పటికే 26 పూర్తి కాగా, మిగిలిన 49 కాలనీలను 2027 ఏప్రిల్ కల్లా పూర్తి చేసి, ప్రతీ కుటుంబానికి ఆత్మగౌరవంతో కూడిన నివాసం కల్పించాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉంది. ప్రతి ఇంటి నిర్మాణానికి 3.5 లక్షల వ్యయం, ఇంటి జాగా కోసం 2 లక్షల వరకు పెంచుతున్నామనే శుభవార్త అందించారు.
ఒక భావోద్వేగ ఆహ్వానం.. ఆత్మీయ సమావేశం!
ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశంలో నిర్వాసిత మహిళల స్పందన కళ్లు చెమర్చేలా చేసింది. “గతంలో మమ్మల్ని పట్టించుకున్న వారు లేరు.. ఇప్పుడు మా ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వస్తున్నాయి.. మా పిల్లల భవిష్యత్తుపై మాకు నమ్మకం కలిగింది” అంటూ వారు భావోద్వేగానికి లోనయ్యారు. నిర్వాసిత యువతకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఇచ్చి, వారి ఉపాధికి కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకోవడం గమనార్హం.
“మీరు మీ గూడును వదిలేసింది ఈ రాష్ట్రం బాగుండాలని.. మీ త్యాగాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మరువరు. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటాం” అని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు నిర్వాసితుల గుండెలకు కొండంత అండగా నిలిచాయి.
పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం అంటే కేవలం డ్యామ్ కట్టడం కాదు.. అది వేలాదిమంది నిర్వాసితుల కళ్లలో వెలుగు చూడడం కూడా. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు ఆలస్యమైనా, నష్టం జరిగినా.. ఇప్పుడు ‘పోలవరం కూలీ’ సారథ్యంలో ప్రాజెక్టుతో పాటు నిర్వాసితుల జీవితాల్లో కూడా కొత్త కాంతి విరజిమ్ముతోంది. రాష్ట్రం కోసం త్యాగం చేసిన ఆ మహానుభావుల రుణం తీర్చుకునే దిశగా ప్రభుత్వం వేస్తున్న ఈ అడుగులు చరిత్రలో నిలిచిపోతాయి.
రాజధాని కోసం గానీ, ప్రాజెక్టుల కోసం గానీ భూమి ఇచ్చిన వారు సంతోషంగా ఉంటేనే ఆ ప్రాంతానికి మేలు జరుగుతుందని.. వారి కన్నీరు ఆ ప్రాజెక్టుకు శాపం కాకూడదని మానవత్వంతో ఆలోచించే నాయకుడు చంద్రబాబు నాయుడి పేరు పోలవరం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.