– ఎలక్ట్రిక్ వాహనాలకు పన్ను మినహాయింపు ఇచ్చిందే బీఆర్ఎస్ ప్రభుత్వం
– ఆటోల రెట్రో ఫిట్మెంట్ కు అంకురార్పణ చేసిందే బీఆర్ఎస్ ప్రభుత్వం
– అయినా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు
– తీవ్ర ఆగ్రహం వ్యక్తి చేసిన తెలంగాణ రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీష్ రెడ్డి.
హైదరాబాద్: అసెంబ్లీలో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటిలాగే తన అబద్ధాల ప్రస్థానాన్న కొనసాగించారు. నిజం వైపు కన్నెత్తి చూడకుండా.. సభ సాక్షిగా రాష్ట్ర ప్రజలకు అబద్ధాలు చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో.. తాను ముఖ్యమంత్రి అయ్యాకే నిర్ణయాలు తీసుకున్నట్టుగా ఆయన చెప్పుకోవడం సిగ్గుచేటు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే.. రాష్ట్రంలో కాలుష్యం తగ్గించే ఉద్దేశంతో.. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించింది. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసిన వారికి ఎలాంటి రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ చార్జీలు ఉండబోవని.. ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. ప్రజలను ప్రోత్సహించేందుకు, ఉత్సాహ పరిచేందుకు గాను.. మొదటి 2 లక్షల ద్విచక్రవాహనాలు, 20వేల ఆటోలు, 5 వేల కార్లు, 5 వేల ట్యాక్సీలు, 10 వేల ట్రాలీలు, 500 ఎలక్ట్రిక్ బస్సుల రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ చార్జీలు లేకుండా ఉచితం చేశారు.
అంతేకాదు ఎవరైనా ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు కొంటే వాటికి సంఖ్యతో సంబంధం లేకుండా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని ప్రకటించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో.. 2019లో 900 ఎలక్ట్రిక్ వాహనాలు, 2020లో 1295, 2021లో 9632, 2022లో 48,040 ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. వీటికి పైసా కూడా ట్యాక్స్ తీసుకోకుండా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చాక దాన్ని కొనసాగిస్తోంది తప్ప.. వాళ్లు కొత్తగా తీసుకొచ్చింది కాదు.
అలాగే హైదరాబాద్ లో కాలుష్య నియంత్రణలో భాగంగా.. డీజిల్, పెట్రోల్ ఆటోలకు రెట్రో ఫిట్ మెంట్ చేయాలనేది కూడా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయమే. దీనికోసం అనేక సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది. ఆటో యూనియన్లకు అవగాహన కల్పించేందుకు.. రెట్రో ఫిట్మెంట్ కంపెనీల ప్రతినిధులతో రెడ్కో సంస్థ ఆధ్వర్యంలో 2022లోనే సమావేశాలు నిర్వహించాము. అంతేకాదు.. ఆటోలకు ఎలక్ట్రిక్ కిట్ లు బిగుంచుకుంటే దానికయ్యే వ్యయంలో 15 శాతం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని వారికి వివరించాము. తీసుకోవాల్సిన చర్యలతపై అధికారులతో కూడా సమావేశాలు నిర్వహించాము.
అయినా కూడా ఇవాళ అసెంబ్లీలో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం.. ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జీలు లేకుండా రిజిస్ట్రేషన్ చేసే విధానం, ఆటోలకు రెట్రో ఫిట్మెంట్ ప్రక్రియ.. అన్నీ తామే చేశామని చెప్పుకున్నారు. ఉద్యోగాలు, బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో చేసిన మంచి పనులన్నింటిని తానే చేసినట్టుగా గొప్పగా చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలను కూడా వదిలిపెట్టలేదు.
ఇవే కాదు.. ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి, అందులో భాగంగా ఫార్ములా ఈ రేస్ కూడా నిర్వహించాము. దాని ద్వారా అనేక ఎలక్ట్రిక్ వాహన కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. వందల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. కానీ స్కాములకు అలవాటు పడిన రేవంత్ రెడ్డికి.. ఈ మొబిలిటీ వీక్ లో భాగంగా నిర్వహించిన ఫార్ములా ఈ రేసు స్కాం లాగా కనిపించింది. ఇది ఆయన అవివేకానికి నిదర్శనం.