* జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం దుర్మార్గం
* అసలు ఏ రూల్ ప్రకారం చేశారో చెప్పాలేని పరిస్ధితి
* అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ను నీలదీస్తారని సస్సెండ్
* ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ కు శిక్ష తప్పదు
* తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిపక్షం గొంతు నొక్కే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ మండిపడ్డారు. కావాలనే ఏకపక్షంగా జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుంచి ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా మేడే రాజీవ్ సాగర్ మాట్లాడుతూ ప్రజా పాలన అని చెప్పి రాష్ట్రంలో ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ సర్కార్ చూస్తోందని విమర్శించారు. అసెంబ్లీ అనేది అందరూ సభ్యులది స్పీకర్ అందరికీ పెద్దలా వ్యవహరించాలని చెప్పడం తప్పా అని ప్రశ్నించారు. అసలు ఏ రూల్ ప్రకారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. సస్పెన్షన్ పై మాట్లాడేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎందుకు అసెంబ్లీలో అవకాశం ఇవ్వలేదన్నారు. అసెంబ్లీ స్పీకర్ నిష్పాక్షపాతంగా వ్యవహరించాల్సింది పోయి సర్కార్ కే వత్తాసు పలుకుతున్నారని దుయ్యబట్టారు.
కావాలనే కాంగ్రెస్ పార్టీ కక్ష రాజకీయాలకు పాల్పడుతుందన్నారు. గత అసెంబ్లీ సెషన్ లో కాంగ్రెస్ సర్కార్ తప్పిదాలను అవినీతిని తప్పుడు ప్రచారాలను గట్టిగా తిప్పి కొట్టిన జగదీష్ రెడ్డిని కావాలనే సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు సస్పెండ్ చేశారని దుయ్యబట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపినందుకే ఇలా కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిందన్నారు. ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే ఇలాంటి చర్యలకు పూనుకుంటుందని స్పష్టం చేశారు.
ప్రజా పాలన అని చెప్పి రాష్ట్రంలో సర్కార్ ను ప్రశ్నించే ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తున్నారని అలాగే కాంగ్రెస్ సర్కార్ పై ప్రజల అభిప్రాయాన్ని చెబితే జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలపై ఎక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తారోనని కాంగ్రెస్ పార్టీకి భయం పట్టుకుందన్నారు. ఇలాంటి నీతిమాలిన పనులకు పూనుకుంటే ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి శిక్ష తప్పదని వివరించారు.