– రామచంద్రపురం కూటమి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మంత్రి సుభాష్ ను ప్రకటించిన రోజు సంబరాలు
– సీఎం, డిప్యూటీ సీఎం లకు కూటమి నాయకులకు కృతజ్ఞతలు.
రామచంద్రపురం : సాధారణంగా మనం పుట్టినరోజు, పెళ్లిరోజు, మహిళా దినోత్సవం, ఇలా అనేక దినోత్సవాలు జరుపుకుంటాం.. ఇది అందరికీ తెలిసిందే. కానీ రామచంద్రపురం నియోజవర్గం కూటమి నాయకులు, ప్రజలు ఓ కొత్త దినోత్సవాన్ని తెరపైకి తీసుకొచ్చారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు కూటమి పార్టీ రామచంద్రపురం నియోజవర్గం అభ్యర్థిగా ఖరారు చేసిన రోజును గురువారం సాయంత్రం కూటమి నాయకులు ఘనంగా జరుపుకున్నారు.
వైకాపా చీకటి పాలనలో విసిగి వేసారి ఉన్న రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకు ఊపిరి పోసిన రోజు..అదే మా సుభాష్ అన్నను నియోజవర్గానికి అభ్యర్థిగా ఖరారు చేసిన రోజు అంటూ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. గురువారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకున్న కూటమి నాయకులు, కార్యకర్తలు అభిమానుల ఆనందోత్సవాల మధ్య మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం చేతుల మీదుగా కేకు కోసి విజయోత్సవాలు జరుపుకున్నారు.
కూటమి పార్టీ తరఫున రామచంద్రపురం నియోజవర్గంలో బరిలో నిలిచిన వాసంశెట్టి సుభాష్ కూటమి నాయకుల సహకారంతో, నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో సుమారుగా 28 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అనంతరం కూటమి ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇదిలా ఉంటే ఎంతో నమ్మకంతో ఓటేసి గెలిపించినందుకు మంత్రి సుభాష్ తమ అంచనాలకు మించి, ప్రభుత్వపరంగా, వ్యక్తిగతంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటున్నారంటూ కొనియాడుతున్నారు.