-
మా ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు తీసుకోవడం లేదంటూ తెలంగాణ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సీఎం చంద్రబాబుకు లేఖ
-
మీ ఆదేశాలు కూడా చెల్లుబాటు కావడం లేదని ఆవేదన
-
తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలు తీసుకోవాలని గతంలోనే ఆదేశించిన సీఎం చంద్రబాబు
-
డిసెంబర్‌లో ఆదేశిస్తే ఇప్పటివరకూ గతిలేని దుస్థితి
-
అయినా ఇప్పటికీ బాబు ఆదేశాలు పాటించని టీటీడీ బాబులు
-
ఏఐ పేరుతో బాబును మెప్పించే తెలివి
-
మంత్రి కొండా లేఖలో టీటీడీ బాసుల నిర్లక్ష్యం బట్టబయలు
-
మా లేఖలకూ కతె్తర వేశారని ఐఏఎస్, ఐపిఎస్‌ల గుర్రు
-
ఏఈఓ చౌదరి ఫోన్లు తీయడం లేదన్న ఫిర్యాదులు
-
టీటీడీ అధికారుల ధిక్కారంపై ప్రజాప్రతినిధుల ఆగ్రహం
( మార్తి సుబ్రహ్మణ్యం)
సీఎం ఆదేశాలంటే శిలాశాసనం. ఆయన ఆదేశించారంటే ఆగమేఘాలపై జరిగిపోవాలంతే. సీఎం ఆదేశాలు ఎలా అమలుచేయాలో యుద్ధప్రాతిపదికపై చర్చించి, అధికారులు కార్యాచరణలోకి దిగిపోవాలి. అప్పుడే సీఎం ఆదేశాలకు విలువ, గౌరవం. కానీ ఆయన ఆదేశాలు నెలల తరబడి అమలుకాకుండా పెండింగ్‌లో పెట్టారంటే.. ఎవరి అధికారాలు అధికం? ఆదేశించిన సీఎందా? దానిని అమలుచేయని అధికారులదా? టీటీడీ విషయంలో మాత్రం నిస్సందేహంగా అధికారులదే పైచేయి. ఎలా అంటారా? మీరే చూడండి.
‘ముఖ్యమంత్రి ఆదేశాలతతో భక్తులకు అన్నదానంలో వడ కూడా నేటి నుంచి ఇస్తున్నాం’
– టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
– ‘ ముఖ్యమంత్రి ఆదేశాలతో శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తున్నాం. రాజధాని రైతులందరినీ ఆహ్వానించాం’
తాజా ప్రెస్‌మీట్‌లో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ శ్యామలరావు.
మరి వడ, శ్రీనివాస కల్యాణం సీఎం ఆదేశాల మేరకు చేస్తున్నామన్న టీటీడీ బాసులు.. అదే సీఎం.. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను ఎందుకు ఆమోదించడం లేదన్నది ఇప్పుడు తెరపైకి వస్తున్న చర్చ. ముఖ్యమంత్రి ఆదేశాలిస్తే తప్ప, టీటీడీ బాసులు తమ సొంత మెదళ్లు వాడరా? ప్రతిదీ ముఖ్యమంత్రి ఆదేశిస్తే ఇక వీళ్లు అక్కడ చేసేది ఏంటి? అంతోటి దానికి అంత పెద్ద పెద్ద పదవులెందుకు? అన్నది మరో చర్చ. చివరకు అధికారులకు ఇస్తున్న అపరిమిత స్వేచ్ఛ, ఇప్పుడు సీఎం చంద్రబాబు పరువు తీసేందుకు కారణమయిందన్నది ఇప్పటి హాట్ టాపిక్.
తెలంగాణ నుంచి అసంఖ్యాకంగా భక్తులు వస్తున్నందున, తమ ప్రజాప్రతినిధులు ఇచ్చే సిఫారసు లేఖలను ఆమోదించాలని.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తమను కలసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును కోరారు. రేవంత్‌రెడ్డి అయితే మరో అడుగుముందుకేసి.. తిరుమలలో తమ రాష్ట్ర భక్తుల సౌకర్యార్ధం భూమి కేటాయిస్తే, తాము గదులు నిర్మిస్తామన్న ప్రతిపాదనను స్వయంగా సీఎం చంద్రబాబునాయుడు ముందు పెట్టారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా, తెలంగాణ భక్తుల కోసం తమ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు ఆమోదించాలని బాబు నివాసానికి వెళ్లి అభ్యర్ధించారు.
దానికి స్పందించిన సీఎం చంద్రబాబునాయుడు.. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను వారంలో నాలుగుసార్లు ఆమోదించాలని, సుపధం 300 రూపాయల టికెట్లను వారానికి రెండుసార్లు ఇవ్వాలని టీటీడీ అధికారులను ఆదేశించారు. ఆ ప్రకారంగా తెలంగాణ ఎమ్మెల్యే, ఎంపి, ఎమ్మెల్సీలకు సోమవారం నుంచి గురువారం వరకూ ఏదైనా రెండురోజులు వీఐపీ బ్రేక్ దర్శనం.. మరో రెండురోజులు 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి సిఫార్సు లేఖలు తీసుకోవాలని టీటీడీ డిసెంబర్‌లో నిర్ణయించింది.
అయితే ఇది ఇప్పటివరకూ అమలుకాకపోవడం విమర్శలకు దారితీసింది. ప్రధానంగా తెలంగాణ ప్రజాప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డి, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖప, ఈ అంశానికి సంబంధించి ఒత్తిళ్లు చేస్తున్నారు.‘ టీటీడీ ఆస్తులు మన తెలంగాణలో కూడా ఉన్నాయి. అయినా మనల్ని పట్టించుకోవటం లేదు. మీరు ఒత్తిడి తీసుకురాకుండా ఎందుకు మౌనంగా ఉన్నార’ని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
దీనితో మంత్రి కొండా సురేఖ రంగంలోకి దిగి.. టీటీడీ లేఖలకు సంబంధించి నేరుగా సీఎం చంద్రబాబునాయుడుకే లేఖ రాయడం, అది మీడియాలో ప్రముఖంగా రావడంతో చర్చనీయాంశంగా మారింది. ‘‘ తెలంగాణ భక్తుల కోసం మా ప్రజాప్రతినిధులు ఇచ్చే సిఫార్సు లేఖలు ఆమోదించాలన్న మీ నిర్ణయానికి కృతజ్ఞతలు. తెలంగాణ నుంచి గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తున్నారు. దానితో మా ప్రజాప్రతినిధులపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. అయితే మీరు మా ప్రజాప్రతినిధుల లేఖలు ఆమోదించాలని ఆదేశించినా, టీటీడీ అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రజాప్రతినిధులను అవమానిస్తున్నారు. మీ ఆదేశాలనే అమలుచేయకపోవడం విచారకరం. ఇప్పుడైనా మీ ఆదేశాలు అమలుచేయాలని టీటీడీ అధికారులను మరోసారి ఆదేశించాల్సిందిగా అభ్యర్ధిస్తున్నాం’ అని తన లేఖలో కోరారు.
అయినా ఇప్పటివరకూ సిఫార్సు లేఖలపై, టీటీడీ బాసుల నుంచి చలనం లేకపోవడమే ఆశ్చర్యం. స్వయంగా సీఎం ఆదేశించినా టీటీడీ బాసులు లెక్కచేయడం లేదంటే వారికి ఆ ధైర్యం ఎక్కడ నుంచి వచ్చింది? అది ప్రభుత్వ బలహీనతా? లేక అధికారుల బలమా? టీటీడీ అధికారులకు ఇచ్చిన అపరిమతమైన స్వేచ్ఛనా? అన్న చర్చకు తెరలేచింది. నిజానికి సీఎం ఒక అంశంపై ఆదే శాలు జారీ చేసిన తర్వాత.. దాని సాధ్యాసాధ్యాలు, అందుబాటులో ఉన్న మార్గాలు, దర్శనాల కట్టడి, నియంత్రణ, కొత్త విధానాలపై చర్చించేందుకు టీటీడీ బోర్డును ఏర్పాటుచేసి, వారి అభిప్రాయాల మేరకు ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
కనిపించని కార్యాచరణ
ఎందుకంటే సీఎం ఆదేశాలు అమలుచేస్తే.. తెలంగాణ ప్రజాప్రతినిధులకు రోజుకు 1100 టికెట్లు అదనంగా పెరుగుతాయి. ఇప్పటికే రోజుకు 7500 దర్శనాలు వీఐపీలకు ఇస్తున్నారు. ఇక ప్రజాప్రతినిధుల లేఖలకు 2 వేల వీఐపీబేక్ దర్శనాలు ఇస్తున్నారు. ప్రస్తుతం రోజూ 75 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. కాబట్టి సహజంగా టీటీడీపై ఒత్తిడి అధికంగా ఉంటుంది అయితే క్రౌడ్ మేనేజ్‌మెంట్‌లో అనుభవం ఉన్న టీటీడీ, దానిపై ఇప్పటిదాకా దృష్టి పెట్టకపోవటమే ఆశ్చర్యం. పైగా ఇటీవల సీఎం చంద్రబాబు సమక్షంలో ఏఐ ఆధారంగా భక్తుల నియంత్రణపై అధికారులు పెద్ద బిల్డప్ ఇచ్చారు. ప్రెజేంటేషన్ హడావిడి చేశారు. అది ఇప్పటివరకూ కార్యరూపం దాల్చింది లేదు. సీఎం చ ంద్రబాబుకు ఏఐ లాంటి కొత్త టెక్నాలజీ అంటే ఇష్టం కాబట్టి.. ఆయనను మెప్పించేందుకే అధికారులు, ఏఐ అంటూ హడావిడి చేశారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
విమర్శలన్నీ వెంకయ్య చౌదరి పైనే
ఇక వెంకయ్యచౌదరి అడిషనల్ ఈఓగా వచ్చిన తర్వాత.. తమ కోటాకు సైతం కతె్తర వేశారంటూ ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు అసంతృప్తితో ఉన్నారు. గతంలో తమ లేఖలకు వెంటనే స్పందించేవారని, చౌదరి వచ్చిన తర్వాత తమకు వారానికి ఎన్ని ఇస్తున్నారో తమకే తెలియని గందరగోళ పరిస్థితి ఉందని వాపోతున్నారు. గతంలో కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఐపిఎస్-ఐఏఎస్‌లకు కోటా ఉండేది. అసలు వెంకయ్య చౌదరి ఎవరి ఫోన్లు తీయడం లేదని అటు ఉన్నతాధికారులు, ఇటు మంత్రులు-ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అదే హదాలో పనిచేసిన ధర్మారెడ్డిపై ఎన్ని విమర్శలున్నప్పటికీ, ఇలాంటి విషయాల్లో ఆయన శైలే బాగుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వెంకయ్య చౌదరి వ్యవహారశైలి బాగోలేదని, ఎవరినీ లెక్కచేయకుండా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వె ల్లువెత్తుతున్నాయి.
పార్టీ నేతలకు దొరకని బోర్డు సభ్యులు
ఇక బోర్డు సభ్యుల తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ కోసం కష్టపడినందుకు నాయకత్వం టీటీడీ బోర్డు సభ్యత్వాలు ఇచ్చింది. అయితే చాలామంది సభ్యులు అసలు ఫోన్లు తీయడం లేదని, మెసేజ్‌లు పెట్టినా స్పందించడం లేదని పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది సభ్యులు కొండపై కొందరిని నియమించుకుని, వారి ద్వారానే వ్యవహారాలు నడిపిస్తున్నారన్న విమర్శలు కూడా లేకపోలేదు. పార్టీ ద్వారా వచ్చిన పదవిని పార్టీ నేతల కోసం వినియోగించాల్సిన సభ్యులు, అదేదో తమ సొంత ప్రతిభ చూసే పదవులిచ్చారన్న భ్రమల్లో ఉన్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీలో బోర్డు మెంబర్ల పదవులు ఇచ్చిన వారి కోటా లేఖలను, పార్టీ ఆఫీసుకు అటాచ్ చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
తెలంగాణ తమ్ముళ్ల అయోమయం
తెలంగాణ టీడీపీ నేతల పరిస్థితి అయోమయంగా తయారయింది. తెలంగాణ నుంచి టీడీపీ సీనియర్ నేత నర్శిరెడ్డితోపాటు, కొంతమంది పారిశ్రామికవేత్తలు, జనసేన నాయకులను టీటీడీ బోర్డులో తీసుకున్నారు. అయితే వారిలో నర్శిరెడ్డి తప్ప, మిగిలిన వారితో ఎవరికీ పరిచయాలు లేవు. పోనీ నర్శిరెడ్డి అయినా ఫోన్లు తీస్తారా అంటే అదీ లేదని పార్టీ నేతలు వాపోతున్నారు. నర్శిరెడ్డి ఫోన్ మెసేజీలకూ స్పందించడం లేదంటున్నారు. ఆయన టీటీడీ బోర్డు సభ్యుడైన తర్వాత, ఎవరి ఫోన్లు తీయడం లేదన్న విమర్శలున్నాయి. కాబట్టి ఆయన కోటాలో ఇచ్చే లెటర్లను, పార్టీ ఆఫీసుకు అటాచ్ చేయాలని సీనియర్ నేతలు సూచిస్తున్నారు. అదే విధంగా తెలంగాణ కోటాలో ఇచ్చిన పారిశ్రామికవేత్తల నుంచి కూడా.. పార్టీ కోటాలో లెటర్లను పార్టీ కార్యాలయం తీసుకునే వ్యవస్థను ఏర్పాటుచేయాలని సీనియర్లు సూచిస్తున్నారు.
1 COMMENTS