Suryaa.co.in

Editorial

తెలంగాణ భక్తులపై బాబు కరుణ

  • తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలకు టీటీడీ దర్శనాలు

  • ‘సూర్య’కు తెలంగాణ ప్రజాప్రతినిధుల కృతజ్ఞతలు

  • తెలంగాణ ఎమ్మెల్యే, ఎంపీల లేఖల దర్శనాలపై ‘సూర్య’లో వరస కథనాలు

  • సీఎం చంద్రబాబు చెప్పినా పాటించని అధికారుల నిర్లక్ష్యంపై కథనాలు

  • చివరకు 24 నుంచి సిఫార్సు లేఖలకు ఆమోదం

  • ‘సూర్య’ కథనాలతో కదిలిన టీటీడీ అధికారులు

  • తెలంగాణలో మరోసారి పెరిగిన చంద్రబాబు ఇమేజ్

( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను ఇకపై గౌరవించాలని టీటీడీ తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇది టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఇమేజ్‌ను మరోసారి పెంచినట్టయింది. ఈనెల 24 నుంచి తెలంగాణ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీల లేఖలకు సంబంధించి వారానికి నాలుగు లేఖలు స్వీకరించాలని టీటీడీ నిర్ణయించడమే దానికి కారణం. బాబు పరువు తీస్తున్న టీటీడీ బాబులు!

చిరకాలం అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యను పరిష్కరించినందుకు అటు తెలంగాణ ప్రజాప్రతినిధులు, ఇటు తిరుమల దర్శనాలకు వచ్చే తెలంగాణ ప్రజలు ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నారు. ఆ మేరకు తెలంగాణ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

సీఎం చంద్రబాబు గతంలో హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల, స్పీకర్, మండ లి చైర్మన్ కలసి తెలంగాణ భక్తుల కోసం తమ ప్రజాప్రతినిధుల లేఖలు ఆమోదించాలని కోరారు. తిరుమల పైన తమ రాష్ట్ర భక్తులకు కాటేజీలు నిర్మించేందుకు స్థలం కేటాయించాలని సీఎం రేవంత్‌రెడ్డి అభ్యర్ధించిన విషయం తెలిసిందే.

తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు విలువలేని వైనంపై, ‘‘సూర్య’’లో అనేక వార్తా కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఏపీ ప్రభుత్వం, ఇకపై తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను గౌరవించాలని టీటీడీని ఆదేశించింది.

నిజానికి ఈ సమస్యపై ‘సూర్య’ వెబ్ సైట్, గత డిసెంబర్ నుంచి వరస కథనాలు వెలువరించింది. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అప్పుడే తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను గౌరవించాలని ఆదేశించారు. కానీ టీటీడీ అధికారులు మాత్రం మీనమేషాలు లెక్కిస్తూ వచ్చారు. ఆలోగా తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్ టీటీడీ వైఖరిని తూర్పారపట్టారు. వేములవాడ, యాదాద్రి, బాసర, భద్రాచలం వంటి ఆలయాల్లో తాము ఏపీ ప్రజాప్రతినిధుల లేఖలు గౌరవించటం లేదా? ఆంధ్రా వ్యాపారులు హైదరాబాద్‌లో వ్యాపారాలు చేసుకోవటం లేదా? టీటీడీకి మాదగ్గర భూములు లేవా? ఏపీ ప్రభుత్వం స్పందించకపోతే, తెలంగాణలో ఆంధ్రావ్యాళ్లు వ్యాపారం చేసుకోలేరు. మేం దీనిపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని హెచ్చరికలు జారీ చేయడం వివాదాస్పదంగా మారింది.

తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలపై స్వయంగా సీఎం ఆదేశించినా, టీటీడీ అధికారులు స్పందించకుండా నిర్లక్ష్యం వహించిన ఫలితంగా, చివరకి అది మళ్లీ ప్రాంతీయ విబేధాలకు దారితీసే పరిస్థితికి వెళ్లడం ఆందోళన కలిగించింది. టీడీపీ అధికారుల నిర్లక్ష్యం.. రెండు రాష్ట్రాల సంబంధాలను దెబ్బతీసే స్థాయికి చేరడంపై.. ‘సూర్య’లో వరస కథనాలు వెలువడిన విషయం తెలిసిందే.

దీనితో రంగంలోకి దిగిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు.. పరిస్థితిని గ్రహించి, తక్షణమే తన ఆదేశాలు అమలుచేయాలని స్పష్టం చేశారు. ఫలితంగా దర్శనాలపై కసరత్తు చేసిన టీటీడీ అధికారులు.. తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలకు వారానికి నాలుగు దర్శనాలు కల్పించాలని నిర్ణయించారు. నిజానికి ఉమ్మడి రాష్ట్రంలో దర్శనాలు ఇచ్చినప్పుడు, రాష్ట్రం విడిపోయిన తర్వాత దర్శనాలు ఎందుకు నిలిపేయాలి? దానివల్ల వచ్చే అదనపు ఇబ్బంది ఏమిటన్న చర్చ జరిగింది.

కాగా తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని, తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు అభినందిస్తున్నాయి. దానితో తెలంగాణలో మరోసారి ఆయన ఇమేజ్ పెరిగినట్టయింది. అదే సమయంలో తిరుమలలో తెలంగాణ భక్తుల దర్శనాలకు సంబంధించి.. వరస వార్తా కథనాలు రాసిన ‘సూర్య’ వెబ్ సైట్ కు, తెలంగాణ ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నారు.

సూర్యకు కృతజ్ఞతలు: మాజీ ఎమ్మెల్యే ప్రసూన
తిరుమల దర్శనానికి వెళ్లే వేలాదిమంది తెలంగాణ భక్తులకు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వెసులుబాటు కల్పించడంపై మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత కాట్రగడ్డ ప్రసూన, తెలుగుమహిళ రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దీనికోసం తెలంగాణ భక్తుల సమస్యలు వెల్లడిస్తూ, అనేక కథనాలు రాసిన ‘సూర్య’ వెబ్ సైట్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఇది తమ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబుకు తెలంగాణ ప్రజల పట్ల ఉన్న గౌరవం, చిత్తశుద్ధిని స్పష్టం చేస్తోందన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల వల్ల తెలంగాణ భక్తుల కష్టాలు చాలావరకూ తగ్గుతాయని వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE