– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్: జనాభా ఆధారంగా కేంద్ర ప్రభుత్వం జరపాలనుకుంటున్న డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. భారత ప్రభుత్వ సూచన మేరకు కుటుంబ నియంత్రణ ను పకడ్బందీగా అమలుచేసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించాలనుకోవడం దారుణమన్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆధ్వర్యంలో మార్చి 22 న చెన్నైలో నిర్వహించబోతున్న సమావేశానికి బీఆర్ఎస్ ను ఆహ్వానించేందుకు హైదరాబాద్ వచ్చిన డిఎంకే నేతలు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణ మరియు నీటి సరఫరా మంత్రి కె.ఎన్. నెహ్రూ, రాజ్యసభ ఎంపీ ఎన్.ఆర్. ఎలాంగో బృందంతో తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమావేశమయ్యారు. అనంతరం రెండు పార్టీల నేతలు మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ వాదనను బలంగా వినిపిస్తాం: కేటీఆర్
డీలిమిటేషన్ మీద దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా పోరాడాల్సిన సందర్భం ఇది. తెలంగాణ,తమిళనాడు,కేరళ, కర్నాటక,ఆంధ్రప్రదేశ్ సమష్టిగా పోరాడినట్లయితే తప్పకుండా దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది. 1970-80 దశకంలో ఫ్యామిలీ ప్లానింగ్ బాగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ స్థానాలను కొత్తగా వచ్చిన సెన్సెస్ ప్రకారం నిర్ణయిస్తాము అనడం అన్యాయం. ఫలితంగా పార్లమెంట్ లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుంది.
ఈ విషయంలో స్టాలిన్ ఏర్పాటుచేస్తున్న అఖిలపక్ష సమావేశానికి బీఆర్ఎస్ తరపున హాజరుకావాలని కేసీఆర్ గారు ఆదేశించారు.కేసీఆర్ ఆదేశం ప్రకారం మార్చి 22 న జరిగే సమావేశానికి హాజరై బీఆర్ఎస్ , తెలంగాణ వాదనను బలంగా వినిపిస్తాం.
ధన్యవాదాలు: డిఎంకే ఎంపీ ఎన్.ఆర్. ఎలాంగో
డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మొదటి నుంచి ప్రశ్నిస్తున్నారు. అందుకే మార్చి 22న దక్షిణాదిలోని అన్ని పార్టీలతో చెన్నైలో సమావేశం ఏర్పాటుచేస్తున్నారు. ఆ సమావేశంలో అన్ని పార్టీలతో చర్చించి ఉమ్మడి కార్యచరణను ప్రకటిస్తాం. ఈ సమావేశానికి హాజరు అవుతామని బీఆర్ఎస్ చెప్పింది. అందుకు ధన్యవాదాలు.