రాజ్యాంగం రాయి కాదు !

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ నిర్మాత కేసీఆర్ కాంక్షించినదే జరుగుతోంది.ఆయన ట్రాప్ లో అన్ని రాజకీయపక్షాలు పడిపోయాయి.కేసీఆర్ కు ఈ సంగతి ముందుగానే తెలుసు.ఆయనకు వివాదాలు ఇష్టం.వార్తల్లో నిరంతరం నలుగుతూ ఉండడం ఇష్టం. భారత రాజ్యాంగంలో మార్పులు చేయాలని కేసీఆర్ ఉబుసుపోకగా అనలేదు.ఆ మాటల పర్యవసానం ఆయనకు తెలియనిది కాదు.వాటిపై దుమారం చెలరేగుతుందనీ ఆయనకు తెలుసు.నిరసనలు భగ్గుమంటాయనీ ఆయనకు తెలుసు. కేసీఆర్ అలాంటి ప్రతిస్పందనే ఆశించారు.సరిగ్గా అలాగే సాగుతోంది.

కేసీఆర్ మాట్లాడిన కొన్ని గంటల్లోనే దేశవ్యాప్తంగా ఆయనకు వివిధ ప్రాంతీయ పార్టీల మద్దతు లభించింది.తమిళనాడు,మహారాష్ట్ర,పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు కేసీఆర్ కు సంఘీభావం తెలిపారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశంలో గుణాత్మక మార్పులు అవసరమని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ వ్యతిరేక రాజకీయ శక్తులను అమితంగా ఆకర్షించాయి.కేసీఆర్ నాయకత్వం పట్ల ఎవరి అభిప్రాయాలు ఎట్లా ఉన్నా,ఆయన దూకుడును బిజెపి వ్యతిరేక రాజకీయపార్టీలు స్వాగతిస్తూ ఉన్నవి.

రాజ్యాంగం పవిత్రమైనది. అవసరానికి తగ్గట్లుగా సవరణ చేస్తున్నారు తప్ప.. అసలు మొత్తం రాజ్యాంగాన్ని మార్చేయాలన్న ఆలోచన ఎప్పుడూ.. ఎవరూ చేయలేదు. అలాంటి ఆలోచన చేస్తే ఎంత తీవ్రమైన ప్రతిఘటన వస్తుందో తెలియని జూనియర్ రాజకీయ నాయకుడు కాదు కేసీఆర్. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేస్తుందని విమర్శలు వినిపిస్తూ ఉంటాయి హిందూ రాజ్యం చేస్తారన్న ప్రచారం జరిగేది. బీజేపీ నేతలు మాత్రం నిర్మోహమాటంగా ఖండించేవారు.

బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే కేసీఆర్ ఈ ” రాజ్యాంగ మార్పు”ను ప్రతిపాదించడం సాహసోపేత చర్య. ఎస్సీ, ఎస్టీలకు జనాభాకు తగ్గట్లుగా రిజర్వేషన్లు ఇవ్వాలన్న దేశ యవనికపై ఒక ఎజండాగా కేసీఆర్ తీసుకు వచ్చారు. అలాగే రాష్ట్రాలలో ప్రభుత్వాలు పాలు వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకునే వీలు లేకుండా కేంద్రప్రభుత్వమే ‘సమాంతర రాజ్యం’ నడిపే ధోరణిని ఆయన ఎండగడుతున్నారు.అందులో భాగంగానే ‘సమాఖ్య స్ఫూర్తిని బీజేపీ దెబ్బతీస్తోందన్న విషయాన్ని మూడేళ్ళ క్రితమే కేసీఆర్ విరుచుకుపడ్డారు.

కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని ఆరోపిస్తూ భారతీయ జనతా పార్టీ సహా అన్ని రాజకీయ పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారు. బీజేపీ నేతలు అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకాలు చేశారు. రాజ్యాంగం జోలికొస్తే చూరచూర చేస్తారని బండి సంజయ్ కేసీఆర్‌ను హెచ్చరించారు. సీఎం కేసీఆర్ అంబేద్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు హాజరుకారని…125 అడుగుల బాబా సాహెబ్ విగ్రహాన్ని ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు.

కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నాయకులు గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష చేయాలని నిర్ణయించారు. తదుపరి కార్యాచరణను గురువారం ప్రకటిస్తామని చెప్పారు. బీజేపీతో కుమ్మక్కు అయి రాజ్యాంగంపై కేసీఆర్ అనుచితంగా మాట్లాడుతున్నారని.. బీజేపీ ఎజెండాను ఆయన అమలు చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు.

కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ డిమాండ్ చేశారు.లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఎంతటిత్యాగాలకైనా సిద్ధమని మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ నేత ప్రవీణ్ కుమార్ ప్రకటించారు.మోడీ సర్కార్ రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ ఎన్నికల కోణంలో ప్రకటనల కోసం ప్రకటనలు ఇస్తుండాన్ని ద్రుష్టిలో పెట్టుకుని కేసీఆర్ రాజ్యాంగం మళ్లీ రాయాలన్న వ్యాఖ్యలు చేశారని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్ పల్లి వినోద్ కుమార్ అన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదన్నారు.వాజ్‌పేయ్ హయాంలో రాజ్యాంగ పున సమీక్ష పరిశీలన కోసం వేసిన కమిటీ గురించి బీజేపీ నేతలు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

కేసీఆర్ వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ లోని జగన్ పార్టీ గట్టిగా సమర్ధించింది.రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉందని ఆ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉందన్న కేసీఆర్ వ్యాఖ్యల వల్ల పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకోవచ్చని.. రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరంపై చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా చర్చ కోసమే రాజ్యాంగంలో మార్పులను కేసీఆర్ కోరారని అర్ధమవుతోంది. భారతీయ జనతా పార్టీని బంగాళాఖాతంలో కలపాలని, మోదీని దేశం నుంచి తరిమికొట్టాలని అన్నారు భారత రాజ్యాంగం గురించి ప్రస్తావించి యావత్ భారతదేశ దృష్టిని తెలంగాణ వైపునకు మళ్లించారు.

బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీలకు ప్రత్యామ్నాయ వేదిక కావాలని, ఆ వేదిక రూపకల్పనలో తనది ప్రధాన భూమిక కావాలని కేసీఆర్ పరితపిస్తున్నారు. బీజేపి, కాంగ్రెస్ పార్టీలంటే గిట్టని నేతలతో కేసీఆర్ గతంలో మంతనాలు జరిపారు. తృతీయ రాజకీయ వేదికకోసం చర్చలు కూడా జరిపారు. సానుకూల వాతావరణం లేనందున ఆయన ఫెడరల్ ఫ్రంట్ వ్యవహారాలపై సైలెంట్ అయిపోయారు. సుధీర్గ సమయం తర్వాత కేసీఆర్ , మళ్లీ కేంద్రంపైన కొత్త వ్యూహంతో ముందుకొచ్చారు.

కేసీఆర్ కొత్త రాజ్యాంగం వ్యాఖ్యల తాత్పర్యం వేరు. ప్రత్యర్థులు దొరికిందే తడవుగా కేసీఆర్ పై దుమ్మెత్తి పోసి సంతృప్తి చెందుతున్నవి. ఈ వ్యాఖ్యలను అంబేడ్కర్‌కు జరిగిన అవమానంగా ప్రత్యర్థులు చిత్రీకరిస్తున్నారు. సీఎం కేసీఆర్ దాదాసాహెబ్ అంబేడ్కర్ ను ఎక్కడా అవమానించలేదు.తన యాభై ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రస్తుత రాజ్యాంగం వల్లనే అనేక పదవులు పొందానని కూడా కేసీఆర్ చెప్పుకున్నారు.కేసీఆర్ ప్రత్యర్థులు ఆ విషయాన్ని ప్రస్తావించడం లేదు.75 సంవత్సరాల క్రితం రాజ్యాంగం అమలులోకి వచ్చింది. నాటి నున్నచీ దేశంలో సామాజిక , ఆర్ధిక,రాజకీయ రంగాల్లో ఎన్నో మార్పులు సంభవించాయి.

మారుతున్న కాలానికి అనుగుణంగా దేశ అభివృద్ధి కోసం రాజ్యాంగంలో భారీ మార్పులు తీసుకువస్తే నష్టమేమిటి? భారతరత్న అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి వెలుగులోనే ఆ మార్పులు, చేర్పులు ఉంటాయని మేధావులు ,లౌకిక వాదులు,అంబేద్కర్ సంఘాలు ఎందుకు ఆలోచించడం లేదు.రాజ్యాంగం శిల కాదు.జడపదార్ధం అంతకన్నా కాదు.ఎప్పుడు ఎట్లా అవసరమైతే అట్లా రాజ్యాంగంలో సవరణలు తీసుకురాగల వెసులుబాటు పార్లమెంటుకు ఉన్నది. 75 సంవత్సరాలుగా బడుగు వర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయా? దళితులకు రాజ్యాధికారం ఎందుకు రావడం లేదు.

లోపం ఎక్కడున్నది? ఎస్సి,ఎస్టీల గురించి తలబాదుకుంటున్న కుహనా లౌకికవాదులు ఈ అంశాల గురించి ఎందుకు మాట్లాడరు? సాగునీటి వివాదాలు ఇంకా దశాబ్దాల తరబడి ఎందుకు సాగుతున్నవి? విద్య,వైద్య సదుపాయాలూ,వ్యవసాయరంగం,రైతుల గురించి కేంద్రప్రభుత్వాలు ఒరగబెడుతున్నదేమిటి?కాంగ్రెస్,బీజేపీలు కుబేరులకు ప్రయోజనం కలిగించే చర్యలే చేపడుతున్నాయని కేసీఆర్ చేస్తున్న ఫిర్యాదుపై ఏమి చెబుతారు? పలు దేశాలు రాజ్యాంగాలను పునర్లిఖించుకున్నాయని,భారతదేశ ప్రజల ఆకాంక్షలు నెరవేరేలా మన రాజ్యాంగాన్ని మరలా రచిస్తే తప్పేమిటి అని కేసిఆర్ అంటున్నారు.

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ‘సహకార సమాఖ్య’ స్ఫూర్తి దెబ్బతింటున్నందున రాజ్యాంగం పునర్లిఖిస్తే తప్పేమిటి? అంబేద్కర్ ను అగౌరవపరచినట్లు ఎలా కాగలదు? టిఆర్ఎస్ పై పోరాడడానికి ప్రతిపక్షాలకు ఎజండా లేకుండా పోతున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో పలు మార్లు చెప్పారు.భారత రాజ్యాంగంలో మార్పుల ప్రతిపాదనను తీసుకు వచ్చి ప్రతిపక్షాలకు కేసీఆర్ పని చెప్పినట్టు కనిపిస్తోంది.

jakir
– జకీర్ సీనియర్ జర్నలిస్టు

 

Leave a Reply