తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగమే అమలవుతోంది

– హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్
అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తెలంగాణలో అమలు కావడం లేదు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాజ్యాంగమే అమలవుతోంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన వ్యక్తి కేసీఆర్. ఈ దేశ ప్రజా స్వామ్య చరిత్రలో వందల కోట్లు ఖర్చు చేసి భంగపడ్డ ఏకైక సీఎం కేసీఆర్ .
చరిత్రలో ప్రజలకు మేలు చేసే వారినే కాదు…వేధించే వారిని గుర్తు పెట్టుకుంటుంది. తెలంగాణ ఆకలినైనా భరిస్తదే తప్ప ఆత్మగౌరవాన్ని వదులుకోదనే విషయం మరోసారి నిరూపితమైంది. ఏ ఉద్యమాలు, చైతన్యం ద్వారా అధికారంలోకి వచ్చారో వారిని బానిసలుగా చేయాలనుకున్న కేసీఆర్ కు చెంప చెళ్లుమన్పించిన గడ్డ నా హుజూరాబాద్ గడ్డ.
నా విజయం హుజూరాబాద్ ప్రజలకే అంకితం చేస్తున్నా. నా ఆడబిడ్డలు, పులిబిడ్డల్లా కొట్లాడిన యువత, రైతులతోపాటు యావత్ తెలుగు ప్రజలు, మఫ్టీలో ఉన్న వందల మంది పోలీసులు సోషల్ మీడియాలో మాట్లాడిన హుజూరాబాద్ ప్రజల నోరు నొక్కే ప్రయత్నం చేసిండ్రు.
పోలీసు అధికారులు హుజూరాబాద్ ప్రజలను బెదిరించిండ్రు. టీఆర్ఎస్ కండువా కప్పుకుంటేనే మీకు లాభమైతదని చెప్పిండ్రు. డీజీపీ… నా దగ్గర ఆధారాలున్నయ్. ఎన్నికల సంఘానికి ఆ ఆధారాలన్నీ పంపిస్తా. వారిపై చర్యలు తీసుకునేదాకా పోరాడతా.
ఇక్కడ ఎన్నికల కమిషన్, పోలీస్ యంత్రాంగం, అధికారుల కనుసన్నల్లోలోనే డబ్బులు పంచిండ్రు. ప్రజాస్వామ్యాన్ని పాతరేసిండ్రు. డీజీపీ మహేందర్ రెడ్డి, ఎన్నికల సంఘం అధికారులారా……మీ పోలీస్, కలెక్టర్, ఆర్డీవో నౌకరీలకు నా ప్రజలు పన్నులు కడితేనే జీతాలు వస్తున్నయనే సంగతి మర్చిపోవద్దు.
కేసీఆర్ చూపిన పోస్టులకు ఆశపడి…మీరు చేసిన చిల్లర పనులను చూసి తెలంగాణ జాతి సిగ్గుపడుతోంది. ఒక్క ఎన్నిక కోసం రూ.500 కోట్లు ఖర్చు పెడతారా? తెలంగాణ ప్రజలు గొర్లనుకున్నవ్. కానీ వాళ్లు పులిబిడ్డలని నిరూపించిండ్రు. ఈ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో అరిష్టమైన పాలన కొనసాగుతోంది. దీనిని ఖతం చేయాల్సిన సమయం వచ్చింది.
కేసీఆర్ ను, టీఆర్ఎస్ ను ఓడించడానికి ఎవరున్నారని తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నరు. 2023లో టీఆర్ఎస్ ను ప్రజలు పాతరేయడం ఖాయం…ఇక్కడ వెలిసేది జెండా కాషాయం మాత్రమే. గెలిచే పార్టీ బీజేపీ మాత్రమే. ఎస్…తెలంగాణలో ఆట మొదలైంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికలతో మొదలైన ఆట తెలంగాణ మొత్తాన్ని అంటుకుని టీఆర్ఎస్ ను ఖతం చేయడం ఖాయం.
కేసీఆర్…..దళిత బంధు కోసం రూ. 2 లక్షల కోట్లు ఖర్చయతది అన్నవ్ కదా…బడ్జెట్ లో పైసా కేటాయించకుండా ఎట్లా ప్రకటించినవ్? ఇదేమి ప్రజాస్వామ్యం? మీకొచ్చిన అధికారం మీ తాతముత్తాతలచ్చింది కాదు….సీఎం కుర్చీ ఎడమకాలి చెప్పుతో సమానమని తెలంగాణ ప్రజలను అవమానించిన నాయకుడు కేసీఆర్. దళిత బంధు పథకాన్ని యావత్ తెలంగాణ మొత్తం అమలు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యేగా నేను డిమాండ్ చేస్తున్నా.
నేను ఆర్దిక మంత్రిగా పనిచేసిన. ఈ రాష్ట్రానికి రూ. 5 వేల నుండి రూ.10 వేల కోట్లు కూడా ఖర్చు పెట్టే స్థితి లేదు. ఈ పథకం అమలు కావాలంటే మరో 20 ఏళ్లు కావాలి. కేసీఆర్….మీ పాలనలో దళిత జాతిలో ఏ ఒక్కరైనా బాగుపడ్డట్లు నిరూపించగలవా? నీ సీఎంవోలో ఒక్క దళిత అధికారి కూడా లేరంటే దళితులకు మీరిచ్చే గౌరవమేందో ప్రజలకు అర్ధమైంది.
హైదరాబాద్ ఐటీ హబ్, ఇండస్ట్రీయల్ హబ్ అన్నరు కదా…..తెలంగాణ బిడ్డలకు ఎన్ని లక్షలు ఉద్యోగాలిచ్చారో చెప్పగలరా? ఎన్నికల మేనిఫెస్టో భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని చెప్పిన కేసీఆర్….నిరుద్యోగ భ్రుతిని ఎందుకు అమలు చేయలేదు? రాబోయే కాలంలో బీజేపీ పక్షాన ఎల్లవేళలా ప్రజల గొంతుకైన ఉంటానని మాట ఇస్తున్నా. హుజూరాబాద్ ఫ్రజలకు నా చర్మం వలిచి చెప్పులు కుట్టించినా….కాళ్లు కడిగి నీళ్లు నెత్తినపోసినా వారి రుణం తీర్చుకోలేను.