Suryaa.co.in

Telangana

తెలంగాణ ప్రజల మదిలో అమరుల త్యాగాలు నిరంతరం జ్వలిస్తూ ఉండేలా స్మారకం నిర్మాణం

– మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు… హుస్సేన్ సాగర్ ఒడ్డున రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం నిర్మాణ తుది దశ పనులను మంగళవారం నాడు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. మెయిన్ ఎంట్రన్స్ వద్ద జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు.

అనంతరం నిర్మాణ ప్రాంగణమంతా కలియ తిరిగారు. అధికారులు, వర్క్ ఏజెన్సీతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ఆలోచనలకు అనుగుణంగా నిర్మాణం పూర్తి కావాలని మంత్రి అధికారులకు,వర్క్ ఏజన్సికి స్పష్టం చేశారు.

మంత్రి వెంట… ప్రెస్ అకాడెమీ చైర్మన్ అల్లం నారాయణ,ఆర్ అండ్ బి ఈఎన్సి గణపతి రెడ్డి,సి.ఈ మోహన్ నాయక్,ఎస్.ఈ లు లింగారెడ్డి,సత్యనారయణ,హఫీజ్,ఈ.ఈ నర్సింగ రావు, డి.ఈ మాధవి,ఎ.ఈ ధీరజ్, శిల్పి రమణారెడ్డి,కెపిసి నిర్మాణ సంస్థ ప్రతినిధి కొండల్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ… “తెలంగాణ ప్రజల మదిలో అమరుల త్యాగాలు నిరంతరం జ్వలిస్తూ ఉండేలా దీపం ఆకృతి వచ్చేలా స్మారకం నిర్మాణం ఉండాలని ముఖ్యమంత్రి కేసిఆర్ గారు నిర్ణయించి ఈ నిర్మాణానికి పూనుకున్నారు. ఈ నిర్మాణం అరుదైన స్టెయిన్ స్టీల్ తో నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతి పెద్ద కట్టడం. కేసిఆర్ గారి నేతృత్వంలో ఎక్కడైతే ప్రత్యేక తెలంగాణ కోసం జలదృశ్యం మీటింగ్ జరిగిందో అదే స్థలంలో నేడు కేసిఆర్  నేతృత్వంలోనే అమరవీరుల స్మారక చిహ్నం నిర్మిస్తున్నాం.

జలదృశ్యం, టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటును జీర్ణించుకోలేక అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. మా కార్యాలయంలో సామాన్లు,ఫర్నీచర్ బయట పడేశారు. ఎక్కడైతే అవమానించబడ్డమో ఇప్పుడు అదే ప్రాంతంలో కేసిఆర్ తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం నిర్మిస్తున్నారు. రాష్ట్రానికి అతిథులు,ప్రముఖులు ఎవరు వచ్చిన ఈ స్మారకాన్ని సందర్శించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. త్వరలో ముఖ్యమంత్రి కేసిఆర్ చేతుల మీదుగా ఈ నిర్మాణం ప్రారంభం ఉంటుంది.” అని మంత్రి అన్నారు.

LEAVE A RESPONSE