ప్రభుత్వ ఉద్యోగాల నిరీక్షణలో కరిగిపోతున్న యవ్వనం, జీవితంలో సెటిల్ అవ్వాలనే భ్రమలో కూలిపోతున్న కలలు..
ఆధునిక భారత సమాజంలో ఒక విచిత్రమైన, ఆందోళనకరమైన దృశ్యం కనిపిస్తోంది. దేశానికి భవిష్యత్తుగా, నవశక ఆవిష్కర్తలుగా నిలవాల్సిన లక్షలాది మంది యువత.. ఒక చిన్న ‘కొలువు’ కోసం తమ జీవితంలోని అమూల్యమైన కాలాన్ని త్యాగం చేస్తున్నారు. “ప్రభుత్వ ఉద్యోగం దొరికితేనే జీవితం సెటిల్ అయింది” అనే ఒక సామాజిక భ్రమ నేటి యువత మేధస్సును సంకెళ్లలో బంధించింది.
అనంతమైన సామర్థ్యాలు, అపారమైన కలలు ఉన్నప్పటికీ,ఒక నోటిఫికేషన్ కోసం ఏళ్ల తరబడి కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తూ, కోచింగ్ సెంటర్ల ఇరుకు గదుల్లో మేధస్సును మొద్దుబార్చుకుంటున్న తీరు సమాజం ఆలోచించాల్సిన తీవ్రమైన అంశంగా మారింది.
శాశ్వతం అనే భ్రమ.. ఎదుగుదలకు ఆటంకం !
ప్రభుత్వ ఉద్యోగం అంటే అది ఒక శాశ్వత భద్రత అని, ఒకసారి కుర్చీలో కూర్చుంటే ఇక జీవితాంతం సుఖమేనని భావించడం, నేటి సమాజంలో బలమైన రుగ్మతగా మారింది. కానీ మారుతున్న కాలంలో ఏదీ శాశ్వతం కాదు.
సాంకేతిక విప్లవం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , డిజిటల్ ఎకానమీ వంటివి ప్రపంచ ముఖచిత్రాన్ని వేగంగా మార్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేవలం ఒక ‘పర్మినెంట్’ పోస్టును పట్టుకుని కూర్చోవడమే పరమార్థం అనుకోవడం ప్రగతిని అడ్డుకోవడమే.
నిజమైన సెటిల్మెంట్ అంటే ఒకే చోట నిశ్చలంగా ఉండిపోవడం కాదు, నిరంతరం మారుతున్న కాలంతో పోటీ పడి ఎదగగల సామర్థ్యాన్ని సంపాదించడం.
సామాజిక ఒత్తిడి: యువతపై మానసిక దాడి!
నేటి యువత ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నిరుద్యోగం మాత్రమే కాదు, అంతకు మించిన సామాజిక ఒత్తిడి.
తల్లిదండ్రుల అతి ఆశలు, బంధువుల వెటకారపు మాటలు, సమాజపు పోలికలు, అన్నిటికీ మించి పెళ్లి మార్కెట్లో ప్రభుత్వ ఉద్యోగానికి కడుతున్న వెల, ఇవన్నీ యువతతో తీవ్రమైన మానసిక ఒత్తిడిని పెంచుతున్నాయి.
నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూ, వయసు పైబడుతున్నా ఆర్థికంగా కుటుంబంపై ఆధారపడుతూ, ఆత్మగౌరవాన్ని కోల్పోతున్న యువత ఆత్మఘోష వర్ణనాతీతం.
ఒక్క పరీక్ష ఫలితం మనిషి విలువను నిర్ణయిస్తుందని భావించడం మన సమాజపు మూర్ఖపు పోకడలకు అద్దం పడుతుంది..
అవకాశాల అనంత విశ్వం.. మనమేమో ఇరుకు దారిలో !
ప్రపంచం ఇప్పుడు ఒక ‘గ్లోబల్ విలేజ్’. ఇంటర్నెట్, స్టార్టప్ సంస్కృతి ద్వారా అవకాశాలు ఇప్పుడు కేవలం ప్రభుత్వ కార్యాలయాల గోడల మధ్యే లేవు. , టెక్నాలజీ,ఇన్నోవేషన్, ఫ్రీలాన్సింగ్ వంటి అనేక రంగాల్లో అపారమైన అవకాశాలు ఆహ్వానిస్తున్నాయి. కానీ, మన యువత మాత్రం ఒకే ఒక్క నోటిఫికేషన్ చుట్టూ గిరికీలు కొడుతూ తమలోని సృజనాత్మకతను వృథా చేసుకుంటోంది.
వేలాది మంది పీహెచ్డీలు సైతం చిన్న క్లర్క్ ఉద్యోగాల కోసం క్యూ కడుతున్నారంటే అది మన విద్యా వ్యవస్థలోని లోపాలను బట్టబయలు చేస్తోంది. నైపుణ్యం లేని పట్టా కేవలం ఒక కాగితం మాత్రమేనని గుర్తించలేకపోతున్నారు.
విద్య – పరీక్షల మధ్య పెరుగుతున్న అగాధం
విద్య అంటే కేవలం ఉద్యోగం కోసం చదివే సిలబస్ కాదు.. అది వ్యక్తిత్వ వికాసానికి, విజ్ఞాన సముపార్జనకు మార్గం. కానీ నేటి విద్యా వ్యవస్థ జ్ఞానాన్ని కాదు, కేవలం పరీక్షల్ని మాత్రమే ప్రోత్సహిస్తోంది. పరీక్షలో నెగ్గిన వారే మేధావులని, విఫలమైన వారు పనికిరానివారని ముద్ర వేయడం ప్రమాదకరమైన ధోరణి. ప్రపంచ ప్రసిద్ధ విజేతలు ఎవరూ ప్రభుత్వ పరీక్షల వైపు చూడలేదు. వారి నైపుణ్యమే వారిని ప్రపంచం మెచ్చే స్థాయికి తీసుకెళ్లింది. నైపుణ్యం ఉన్నవారికి ఈ విశాల ప్రపంచమే ఒక పెద్ద కార్యాలయం.
కొలువుల భ్రమలో కలలను చంపుకోవద్దు!
జీవితం అంటే నిరంతర అభ్యాసం. ఒక ఉద్యోగం కోసం సంవత్సరాల తరబడి నిరీక్షిస్తూ, యవ్వనాన్ని వృథా చేసుకోవడం వివేకం అనిపించుకోదు. ‘సెటిల్’ అవ్వాలనే బలహీనమైన భ్రమ, యువతను ఒకే మూసలో బంధిస్తోంది.
గుర్తుంచుకోండి..
సామర్థ్యమే ఆధారం : సర్కారు కొలువు రాకపోతే జీవితం ఆగిపోయినట్లు కాదు. మీ నైపుణ్యానికి పదును పెడితే, అవకాశాలే మీ కోసం వస్తాయి.
ప్రత్యామ్నాయాల అన్వేషణ : మూస పద్ధతులకు స్వస్తి చెప్పండి. నూతన రంగాలను అన్వేషించండి.
నిరంతర వికాసం : జ్ఞాన సముపార్జన ఆగిపోతే, మనిషి స్తంభించిపోతాడు.
జీవితం ఒక విశాల సాగరం. అందులో ఒక చిన్న ద్వీపం కోసం వెతికి కాలం గడపడం కంటే, సాహసంతో ప్రయాణించడం గొప్పది. ‘సెటిల్మెంట్’ అనే సంకెళ్లు తెంచుకోండి.. మీ గమ్యాన్ని మీరే నిర్దేశించుకోండి.
– జి. అజయ్ కుమార్